నేడు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ( Srila Bhaktisiddhanta Sarasvati Thakura ) జన్మతిథి
అసలైన కృష్ణ చైతన్యం ఆయన. వైష్ణవ తత్వాన్ని గర్జించి వినిపించిన సింహ గురు. భక్తి సిద్ధాంతంలో మేరునగ ధీరుడు. శ్రీల ప్రభుపాదుల వంటి మహనీయుడిని జాతికి అందించిన ఆచార్యులు. వారే బ్రహ్మ-మధ్వ-గౌడీయ వైష్ణవ సంప్రదాయ పరంపర 31వ ఆచార్యులు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఆయన జీవితం కృష్ణసేవకు అంకితం. ఆయన వచనం కృష్ణతత్త్వం. ఆ మహనీయుడి జన్మతిథి సందర్భంగా సరస్వతి ఠాకూర్ జీవిత విశేషాలు..
‘కృష్ణభక్తికి చైతన్యం కలిగించే కొడుకు కావాలి’ అని ఆరాటపడుతున్నాడు శ్రీల భక్తివినోద ఠాకూర్. పూజలో శ్రీ చైతన్య మహాప్రభువు నిత్యం ఇదే విన్నవించుకునేవారు ఆయన. అనుకున్నట్టుగానే ఆ ఇంట ఓ పసిబాలుడు పుట్టాడు. 1874 ఫిబ్రవరి 6న (మాఘ కృష్ణ పంచమి) యజ్ఞోపవీతం ధరించినట్టుగా బొడ్డుపేగు చుట్టుకొని పుట్టాడు. శ్రీకృష్ణుడి అనుగ్రహంతో బిడ్డ పుట్టాడని మురిసిపోయారు భక్తివినోద ఠాకూర్. కృష్ణతత్త్వాన్ని తన కొడుకు కుగ్రామాల నుంచి ఖండాంతరాలకు వ్యాప్తిచేస్తాడని నమ్మారు. బిమల ప్రసాద్ దత్త అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పిల్లాడిని పెంచసాగారు.
♦♦♦
బిమల ప్రసాద్‌కు ఐదు నెలల వయసు. జగన్నాథపురిలోని ఇంట్లో ఎక్కడో ఆడుకుంటున్నాడు. పూరీ రథచక్రాలు కదిలాయి. భక్తులంతా ఉత్సాహంతో రథాన్ని లాగుతున్నారు. వారి ఉత్సాహమంత వేగంగా రథం కదులుతున్నది. రథయాత్ర బిమల ప్రసాద్ ఇంటి మీదుగా వెళ్లాలి. ఆ వీధికి వచ్చింది. ఆ ఇంటి వరకు వచ్చింది. చప్పున ఆగిపోయింది రథం. ఎవరెంత లాగినా కదలదే! పూరీ జగన్నాథుడి రథాన్ని చూడగానే బిమల ప్రసాద్ తల్లి ఆనందంతో పరవశించింది. కొడుకును చంకనెత్తుకొని రథం దగ్గరికి పరుగు తీసింది. స్వామివారి పాదాల చెంత కొడుకును ఉంచింది. జగన్నాథుడికి ధరింపజేసిన పూల హారం ఆశీః పూర్వకంగా కిందికి జారింది. బిమల ప్రసాద్ శరీరాన్ని తాకుతూ కింద పడింది. జగన్నాథుడి ఆశీస్సులు లభించాయి. తల్లి మురిసిపోయింది. విషయం తెలుసుకున్న తండ్రి భక్తి వినోద ఠాకూర్ సంబరపడ్డాడు. కొడుకు తన ఆధ్యాత్మిక వారసత్వాన్ని నడిపించగల శక్తిమంతుడు అవుతాడని నమ్మాడు.
♦♦♦
పూరీలో పట్టణ మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న భక్తి వినోద ఠాకూర్ పూజ గదిలో దేవతార్చనకు అన్ని ఏర్పాట్లు చేశాడు. పూలో, అభిషేక జలాలో తీసుకురావడానికి వాకిట్లోకి వెళ్లాడు. ఇంతలో బిమల ప్రసాద్ పసితనంతో దేవుడి నివేదన కోసం ఉంచిన మామిడిపండును ఆరగించాడు. అది చూసిన తండ్రి ‘దేవుడికి నివేదించక ముందు తినడం తప్పు కదా!’ అని స్వల్పంగా మందలించాడు. ఆనాటి నుంచి మామిడి పండు తినడం పూర్తిగా మానేశారు ఆయన. ఎప్పుడైనా ఎవరైనా వారికి మామిడిపండును సమర్పిస్తే, నేను అపరాధిని. ఆ పండును నేను తినలేను అంటూ సున్నితంగా తిరస్కరించేవారు. దైవానుగ్రహానికి వ్యక్తిగత పట్టుదల తోడైంది. బిమల ప్రసాద్ దత్త అచిరకాలంలోనే తండ్రి కోరుకున్న మార్గంలో నడిచేందుకు సిద్ధమయ్యారు.
♦♦♦
పదేండ్ల ప్రాయంలో తండ్రి నుంచి హరేకృష్ణ, నృసింహ మంత్రాలను ఉపదేశం పొందారు బిమల ప్రసాద్. 1901లో గాయత్రి మంత్రాన్ని ఉపదేశం తీసుకున్నారు. భక్తి వినోదుల ఆజ్ఞతో నవద్వీపంలోని ప్రఖ్యాత వైష్ణవ సాధు మహాత్ముడైన శ్రీల గౌర కిశోర దాస బాబాజీని తన గురువుగా స్వీకరించి దీక్షను పొందారు. అలా భక్తి వినోదుల ఇంట వెలసిన ఆ ఆణిముత్యమే బ్రహ్మ-మధ్వ-గౌడీయ వైష్ణవ సంప్రదాయ పరంపరలో 31వ ఆచార్యులు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. యుగధర్మమైన నామ సంకీర్తనాన్ని నలుదిశలా వ్యాపింపజేసిన మహనీయుడు ఆయన.
తండ్రితో కలిసి పలు తీర్థస్థలాలను సందర్శిస్తూనే సరస్వతి ఠాకూర్ వైష్ణవ మంజూష (Vaishnava Encyclopedia) గ్రంథాన్ని రచించారు. ఆ తర్వాత పూరి క్షేత్రంలో శ్రీమద్భాగవతంపై ప్రవచించటం ప్రారంభించారు. వివిధ నగరాలకు ప్రయాణిస్తూ గౌడీయ వైష్ణవంలో ఏర్పడిన అపసంప్రదాయాలను పెకలిస్తూ అందరూ సమ్మతించే విధంగా బోధించేవారు. వైష్ణవంలోని నాలుగు సంప్రదాయాలు ఐకమత్యం చేసేందుకు అహరహం శ్రమించారు. వైష్ణవ సిద్ధాంతాన్ని నిర్భయంగా, బలమైన వాదనలతో తత్త ఉపన్యాసాలు చేయడం వల్ల సరస్వతి ఠాకూర్ వారికి ‘సింహ గురు’ అన్న పేరు వచ్చింది. ధీరోదాత్తుడైన ఉపన్యాసకుడిగానే కాక, భగవంతుడిపై అచంచలమైన మధుర ప్రేమభక్తిని కలిగి ఉండేవారు. భారతావనిలోనే కాదు బర్మా, ఇంగ్లండ్, జర్మనీ తదితర దేశాల్లో 64 గౌడీయ మఠాలను స్థాపించారు.
శ్రీల సరస్వతి ఠాకూర్ తన తండ్రి సాయంతో నవద్వీపంలో భూస్థాపితమైన శ్రీ చైతన్య మహాప్రభువుల జన్మస్థానాన్ని వెలికి తీసి పునర్నిర్మింపజేశారు. మద్రాస్, కృష్ణనగర, కలకత్తా నగరాల్లో ‘బృహత్ మృదంగాలు’ పేరుతో మూడు ముద్రణాలయాలు స్థాపించారు. శ్రీ గౌరాంగ మహాప్రభువు బోధనలపై పుస్తకాలు, పత్రికలను ప్రచురింపజేసి ప్రచారం గావించారు. మొత్తం కలిపి సుమారు 61 గ్రంథాలను రచించి, 8 పత్రికలను ప్రచురించేవారు. ‘నదియ ప్రకాశ్’ దినపత్రికను కూడా నిర్వహించారు.
1914లో భక్తివినోదుల నిష్క్రమణతో శ్రీ చైతన్యుల సంకీర్తన ఉద్యమాన్ని ముందుకు కొనసాగించటం తన బాధ్యతగా భావించారు భక్తి సిద్ధాంతులు. తన తండ్రి రచనలతో పాటు, భగవద్గీత, శ్రీమద్భాగవతం, చైతన్య భాగవతం, చైతన్య మంగళ, ప్రేమ భక్తి చంద్రిక, శ్రీ చైతన్య చరితామృతం తదితర ప్రామాణిక గ్రంథాలను ప్రచురింపజేశారు. ఆధ్యాత్మిక జీవనానికి భౌతికపరమైన అర్హతలేవీ అవసరం లేదని వారు వాదించేవారు. కుల, మత, ప్రాంత, లింగ మొదలైన భేదభావాలేవీ లేకుండా వ్యక్తిలోని ఆధ్యాత్మిక జీవనంపై ఆసక్తికే వారు ప్రాధాన్యం ఇచ్చి, దీక్షను ప్రసాదించేవారు.
భగవత్ సందేశాన్ని ప్రచారం చేయడానికి ఎన్నో వినూత్నమైన మార్గాలను ఏర్పరిచారు సరస్వతి ఠాకూర్. శ్రీ కృష్ణుడు, శ్రీ చైతన్య మహాప్రభువు లీలలను ఉచిత ప్రదర్శనల ద్వారా, లీలా చిత్రాలను చిత్రించిన ఫలకాల ద్వారా ప్రాచుర్యం కల్పించారు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి సంచాలన (యానిమేటెడ్) బొమ్మల ద్వారా ప్రచారం చేయించేవారు. శ్రీ చైతన్య మహాప్రభువు దర్శించిన ఎన్నో పుణ్యక్షేత్రాల్లో వారి పాదముద్రికలు కలిగి ఉన్న పలకలను స్థాపింపజేశారు. తన శిష్యులైన ఎంతో మంది సన్న్యాసులను సంప్రదాయాలకు అతీతంగా కుర్తాలను, పై చొక్కాలను ధరింపజేసి, మోటారు వాహనాలలో సైతం ప్రయాణించే వీలు కల్పించి, మహాప్రభువుల సందేశాన్ని ఖండాంతరాల్లోనూ ప్రచారం చేయించారు.
తమ జీవితంలోని చివరి క్షణం వరకు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతులవారు శ్రీకృష్ణుడి భక్తియుత సేవల్లో, శాస్త్ర ప్రబోధనల్లోనే గడిపారు. 1936, డిసెంబర్ 31 వ తేదీన 62 ఏండ్ల వయసులో పూరి క్షేత్రంలో ఉండగా, ఈ లోకాన్ని వీడి శ్రీకృష్ణ సన్నిధానాన్ని చేరుకున్నారు. వారి సమాధి నవద్వీప మాయాపురంలో ఉంది. వృందావనంలోని రాధాకుండ, రాధా దామోదర మందిరాల్లోనూ పుష్ప సమాధులు నెలకొని ఉన్నాయి. వారి ఆవిర్భావ తిథి ఆశీస్సులు మనందరికీ అందుతాయని ఆశిద్దాం. హరేకృష్ణ!
భారతదేశంలో తాను సాధించిన ప్రచార విజయంతోపాటు, శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతులవారి అత్యున్నత తోడ్పాటులో ఒకటి శ్రీల ఏ.సి.భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారిని సమాజానికి అందించడమే. వారికి దీక్షను ప్రసాదించి కృష్ణ చైతన్యాన్ని ప్రపంచం నలుదిక్కులా వ్యాపింపజేసేలా ప్రేరణను కలిగించారు. శ్రీల భక్తి వేదాంత స్వాముల వారిని ఒకసారి తన గురువు గురించి వివరింపమని కోరగా, ‘వారి గురించి నేనేమి చెప్పగలను? వారు వైకుంఠవాసి’ అని పేర్కొన్నారు.
శ్రీ చైతన్య మహాప్రభువుల నిష్క్రమణ తర్వాత బ్రహ్మ-మధ్వ-గౌడీయ సంప్రదాయం ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొంది. చైతన్యుల బోధనలు లుప్తమై, అపసంప్రదాయాలు చోటుచేసుకుంటున్న తరుణంలో అవతరించారు శ్రీల భక్తివినోద ఠాకూర్లు. శ్రీచైతన్య మహాప్రభువుల బోధనలు యథార్థ రూపంలో పునఃస్థాపించారు. గ్రంథాలు, పత్రికలతో చైతన్య సిద్ధాంత సారాన్ని దశదిశలా వ్యాప్తి చెందించారు. తన అశేష అనుచరులలో ఒక శక్తిమంతమైన భగవత్తత్త్వ ప్రబోధకుడిని తనకు వారసుడిగా ప్రసాదించమని శ్రీచైతన్య మహాప్రభువుల వారిని నిత్యం ప్రార్థించేవారు.
– శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజి, 93969 56984
నిజమైన ప్రేమ అంటే ఏంటి? రాధాకృష్ణుల ప్రేమ మనకు ఏం వివరిస్తుంది?
పాలకుడు ఎలా ఉండాలంటే.. అంపశయ్యపై ఉండి భీష్ముడు చెప్పిన హితబోధ ఏంటి?
సంక్రాంతి తర్వాత ఆరు నెలల ప్రత్యేకత ఏంటి? ఆ టైంలో ఏం జరుగుతుంది?
కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో ఉన్న గంగిరేగు చెట్టు ప్రత్యేకత ఏంటి?