నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః
న చైవ న భవిష్యామః సర్వే వయ మతః పరమ్!
(భగవద్గీత 2-12)
‘అర్జునా! నీవు, నేను, కనిపించే రాజులు.. మనమంతా గతకాలంలో ఉన్నాం.. భవిష్యత్తులోనూ ఉంటాం. అన్ని కాలాల్లోనూ ఉండే ‘నేను’ అనే ‘ఆత్మ‘ శరీర పతనంతో నశించేది కాదు. ఈ సృష్టిలో ఉన్నది నశించదు. లేనిది కొత్తగా పుట్టదు’ అని చెబున్నాడు శ్రీకృష్ణుడు. శిశిరంలో మోడువారిన వృక్షాలు వసంతంలో చిగురిస్తాయి.
వసంతంలో చిగురించిన వృక్షాలు శిశిరంలో మోడువారుతాయి. సృష్టిలో ‘పదార్థం’ ఉన్నప్పుడు దానికి ‘వ్యతిరేక పదార్థం’ కూడా ఉంటుంది. ‘సకారాత్మక’ సంఖ్య ఉంటే ‘నకారాత్మక’ సంఖ్య ఉంటుంది. అలాగే జనన మరణాల పేరుతో మార్పుచెందే శరీరం ఉన్నప్పుడు దానికి అతీతమై, మారనిది ఒకటి ఉంటుంది. అదే ఆత్మ!
జనన మరణాలతో సంబంధం లేకుండా ప్రతివ్యక్తిలో ఒక కేంద్రం ఉంటుంది. అది స్వచ్ఛమైనది.. శాశ్వతమైనది. దానినే పారమాత్మిక తత్త్వం అంటాం. అయితే మనలో చాలామంది జీవన కేంద్రంపై కాకుండా పైపై అంచులనే చూస్తూ జననమరణాలనే భ్రమలో బాధపడుతున్నారు. జాగ్రత్తగా పరిశీలిస్తే.. జగత్తంతా రెండు విధాలుగా కనిపిస్తుంది. మొదటిది ఆకారాలు, పేర్లు, రంగులు, పరిమాణాలు, అది ఉండే కాలం లాంటివి. రెండోది.. వాటిలోపల ఉండే వస్తువు లేదా దేనితో అది తయారు అవుతుందో అట్టి వస్తువు. ఉదాహరణకు మట్టితో కుండలను చేస్తాం. కుండ అనేది ఆకారం, పేరు, పరిమాణాలను బట్టి గుర్తిస్తున్నాం. కానీ, దానికి ఆధారమైనది మట్టే! కుండగా మారనంత వరకది మట్టి మాత్రమే! కుండ బద్దలయ్యాకా మళ్లీ మట్టే. కుండగా మారాక.. ఆ మట్టికి, జననం మరణం కాని కుండకు ఆధారమైన మట్టికి ఆ బద్దలవడం అనేది ఉండదు.
ప్రతివ్యక్తిలో ‘విజ్ఞాన’ పార్శ్వం ఉంటుంది. అలాగే ‘అజ్ఞాన’ పార్శ్వమూ ఉంటుంది. మన సహజస్థితి ఆనందమని జ్ఞానం చెబుతుంది. అయితే ఆనందం మనలోనే ఉన్నదనే సత్యాన్ని గుర్తించక, సౌకర్యంగా ఉన్నదనే భ్రాంతిలో అజ్ఞానాన్ని ఆదరిస్తూ.. మాయ, అహంకారం అనే ముసుగులను కప్పుకొని ఆనందాన్ని విస్మరిస్తున్నాం. మనమంతా జీవితాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నామా? ఆలోచించాలి. విషయాన్ని లోతుగా తరచి చూస్తేనే ఆనందాన్ని ఆస్వాదించ గలుగుతాం. చిత్రకారుడు ఒక చిత్తరువును చిత్రించే సమయంలో పలు కోణాలలో దర్శిస్తాడు.. పరిశీలిస్తాడు. దానికి సంబంధించిన వివిధ స్పందనలను ఆస్వాదిస్తాడు. ఆనందానికి అతీతమైన తన్మయస్థితిలో చిత్రించిన చిత్రం ఉదాత్తతను సంతరించుకుంటుంది. సాధారణ వ్యక్తి దృష్టికీ చిత్రకారుని దృష్టికీ భేదం ఉంటుంది.
ఒకరొక కార్యాన్ని సాధించారంటే దానిని ఎవరైనా సాధించగలరు. అయితే కార్యాన్ని ఆరంభించిన సమయంలో నేను అల్పుడనని దిగాలుపడినా, నా స్థితిగతులు కార్యసాధనకు సరిపోవని అధైర్యపడినా.. కార్యం విఘ్నమౌతుంది. తానెన్నడూ నశింపనని, తనకు ఇతరులకు భేదం లేదని తెలిసాక.. ఉత్సాహం కలుగుతుంది. ఉత్సాహం ధైర్యానికి ఊపిరులూదితే సాహసం ముందుకు వస్తుంది. బుద్ధి ప్రచోదన జరిగితే ఆత్మ విశ్వాసం వెలుగు చూస్తుంది. దానికి ప్రయత్నం తోడైతే కార్యం సాధ్యమవుతుంది. కార్యసాధన ఆనందాన్నిస్తుంది. కృష్ణుడీ చిన్న ధర్మసూక్ష్మాన్ని ఆధారం చేసుకొని అర్జునుడి ఎదలో ధైర్యాన్ని నింపి కార్యోన్ముఖుని చేశాడు. మనందరమూ మరణరహిత ఆనంద స్వరూపులమని, తెలిసి కర్తవ్యాన్ని నిర్వహించాలే కానీ, మనది కాని భయాన్ని ఆశ్రయించి జీవితాన్ని నిర్వీర్యం చేసుకోకూడదు. భయం పరిమితులను దాటిన వారే విజయ సాధకులుగా చరిత్రలో నిలుస్తారు.
– పాలకుర్తి రామమూర్తి