గుణానేతానతీత్య త్రీన్ దేహీ దేహసముద్భవాన్
జన్మ మృత్యు జరాదుఃఖైః విముక్తోమృతమశ్నుతే!
(భగవద్గీత – 14-20)
శరీర ఉత్పత్తికి కారణాలైన సత్వరజస్తమో గుణాలను అధిగమించిన పురుషుడు జన్మించడం, మరణించడం, వార్ధక్యం, దుఃఖాల నుంచి విముక్తుడై పరమానందాన్ని పొందును, అంటున్నాడు కృష్ణ పరమాత్మ.
ప్రతివ్యక్తీ తన బాధలకు ఏదో సందర్భాన్ని కారణంగా భావిస్తాడు. కానీ, సందర్భం కన్నా వ్యక్తి మానసిక స్థితే అలాంటి బాధలకు మూలకారణం. సత్వరజస్తమో గుణాల ప్రాబల్యం వల్ల సహజమైన జ్ఞానాన్ని అజ్ఞానం కప్పేస్తుంది. దానితో సృజనాత్మకతను సంతరించుకొని ఉన్నత శిఖరాలను చేరవలసిన ప్రస్థానం, బంధనాలను ఆశ్రయిస్తుంది. ఫలితంగా చర్విత చర్వణంగా జన్మమృత్యు జరాదుఃఖమనే చక్రంలో చిక్కుకొని బాధలను అనుభవిస్తుంటాం. త్రిగుణాల ప్రాభవాన్ని అవగాహన చేసుకొని వాటిని జయించ గలిగిన వ్యక్తి సుఖదుఃఖ బంధనాల నుంచి విముక్తిని పొందుతాడు. నిజానికి ‘ఖ’ అంటే ఆకాశం.. అంటే ఏమీలేనిదని. దానితో ‘సు’ చేరితే ఆనందం.. ‘దు’ చేరితే వ్యథ. దేనిని చేరుస్తామనేది వ్యక్తి నిర్ణయం.
వ్యక్తి జీవితంలో ఉన్నతత్వాన్ని సాధించేందుకు అడ్డుగా ఉన్నది.. ఎదురైన సందర్భమా లేక దానిని ఎదిరించి నిర్వహించుకోలేని అసమర్థతా? వివేకంతో, విచక్షణతో ఆలోచిస్తే.. సందర్భం కాదు పురోగతిని అడ్డుకునేది అజ్ఞానంతో జనించిన అసమర్థతే అనేది స్పష్టమవుతుంది. బాహ్యంగా దర్శింపజేస్తున్న సందర్భం సత్యం కాదు. అంతర్దర్శనం లోతుగా విచారించే సామర్థ్యాన్ని జాగృతం చేస్తుంది. ఒక వస్ర్తాన్ని దేశ పతాకంగా తయారుచేస్తే గౌరవిస్తాం. అదే వస్త్రంతో ఇల్లు తుడిస్తే అగౌరవిస్తాం. శిల్పి మూర్తిగా మలిచిన రాయి పూజలు అందుకుంటుంది. గడపగా మారిన రాయిని తొక్కుతాం. ఇక్కడ వస్త్రం లేదా రాయి లక్షణాలు మారలేదు. వాటి స్థాయి మారి, వాటిని చూసే విధానం మాత్రమే మారింది. ఎలాగైతే మద్యాన్ని సేవించిన వ్యక్తికి స్వీయ నియంత్రణ తప్పిపోతుందో అలాగే అజ్ఞానం ముసురుకున్న వ్యక్తికి విచక్షణా జ్ఞానం అదృశ్యమవుతుంది.
సంవత్సరాలుగా ఇల్లులేదు బాధపడ్డాం. కష్టపడి ఇల్లు కట్టుకున్నాక సంతోషించాం. తదుపరి దానిని నిలుపుకోవడానికి బాధపడ్డాం. ఒకనాడు అది కూలిపోయింది.. దుఃఖపడ్డం. లోతుగా విచారిస్తే.. ఇల్లు కట్టకముందూ.. దానిని నిలుపుకొనేందుకు.. అది కూలిపోయాకా మనం బాధే పడుతున్నాం. దానికి కారణం ఆ ఇల్లు నాది అనుకొని దానిపై మమకారాన్ని పెంచుకోవడమే. వివేకవంతుడు.. కూలిన ఇంటి కోసం దుఃఖపడక.. కొత్త ఇంటిని నిర్మించుకునే ప్రయత్నం చేస్తాడు. సంతోషమైనా.. దుఃఖమైనా గుణాల ప్రాభవం వల్ల కలిగేవే. గుణాల సమ్మేళనమే జన్మ.. వాటి ప్రవర్తనలో వేగం తగ్గడం వార్ధక్యం. వాటిని ఉపసంహరించుకోవడం.. మరణం. నిజానికి ఈ జన్మమృత్యు జరాదులలో మన ప్రమేయం ఏమీలేదు. దానిని అక్షరాలలో కాక అనుభవ పూర్వకంగా గ్రహించగలగడమే అమృతత్వ సాధన. దానిని సాధించే ఉపకరణమే.. జ్ఞానం.
మూడు గుణాల ప్రభావం అనే భావనను.. వ్యక్తిగత ఎదుగుదల, ఆత్మ సాక్షాత్కారం ప్రభావవంతమైన నాయకత్వానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. త్రిగుణాల ప్రభావానికి గురైతే వ్యక్తి బాధపడతాడు. దాన్ని అధిగమించ గలిగితే ఉన్నత శిఖరాలు చేరుకుంటాడు. నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు.. తనకుగా ఏర్పరుచుకున్న పరిమితులను, అవరోధాలను చెరిపివేసుకో గలిగిన నాయకుడు అభ్యుదయాన్ని సాధిస్తాడు. అనవసరమైన ఒత్తిడి, ఆపదలు దరిచేరని వాతావరణాన్ని అనుచరులకు అందించగలిగే నాయకుని నేతృత్వంలో బృంద సామర్థ్యం పెరుగుతుంది. ఉత్పాదకత పెరుగుతుంది. అభ్యుదయం కలుగుతుంది. ఇలాంటి అంతర్దృష్టిని సంతరించుకున్న నాయకుడిలో లోతైన నాయకత్వ పటిమ వెలుగుచూస్తుంది. అంతిమ ఫలితంపై కాక కర్తవ్యపాలనపై దృష్టి నిలుస్తుంది. వ్యక్తిగత ఎదుగుదల, సంస్థ అభ్యుదయం.. అనుచరుల వికాసం సహజంగా పరిణమిస్తుంది.