హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాంబిభ్రతీం
సౌవర్ణాంబర ధారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్జ్వలాం
వందే పుస్తక పాశమంకుశ ధరాం సగ్భ్రూషితాముజ్జ్వలాం
త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణీం॥
త్రిపురుని భార్య త్రిపురసుందరీ దేవి. అంటే పరమేశ్వరుని భార్య అయిన గౌరీదేవి అని అర్థం. త్రిపురాత్రయంలో బాలాత్రిపురసుందరీ దేవి తొలి దేవత. అందుకనే నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని మొదటి రోజున బాలాత్రిపురసుందరీ దేవిగా అలంకరణ చేస్తారు. మనస్సు, బుద్ధి, అహంకారం ఈ తల్లి అధీనంలో ఉంటాయి. ఈ తల్లి అభయహస్తం, వరదముద్ర ప్రదర్శిస్తూ అక్షమాల ధరించి ఉంటుంది. ఈమెను ఆరాధించటం వల్ల నిత్య సంతోషం కలుగుతుంది. శ్రీచక్ర సంప్రదాయంలో షోడశీ విద్యకు ఈమె అధిదేవత. రెండు నుంచి పదేండ్లు వయసులోపు బాలికలను బాలాత్రిపురసుందరీ దేవి స్వరూపంగా అర్చించి, సకల సుమంగళ ద్రవ్యాలు, నూతన వస్ర్తాలు ఇవ్వాలి. ఇందువల్ల ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది. బాలా త్రిపురసుందరీ దేవి అనుగ్రహం వల్ల సత్సంతానం కలుగుతుంది. అమ్మవారికి పాయసం నివేదనగా సమర్పించాలి.