పోదాంపద పోలేపల్లి జాతర
కోరిన వారికి కొంగుబంగారమై వరాలిస్తున్న ఎల్లమ్మ పోలేపల్లిలో శతాబ్దాలుగా పూజలు అందుకుంటున్నది. అమ్మవారి మాహాత్మ్యం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.
పల్లె ప్రజలను, పశు సంపదను, పంటపొలాలను కాపాడేది గ్రామదేవతలే అని జానపదుల గట్టి నమ్మకం. పోలేరమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ తదితర దేవతలకు జాతరలు చేసి కరుణించమని కోరుకుంటారు. వీటికి తండోపతండాలుగా భక్తులు తరలి వస్తారు. లక్షలాది మంది పాల్గొని పులకించిపోయే సన్నివేశం పోలేపల్లి జాతరలో కనిపిస్తుంది. శివరాత్రి రోజుల్లో వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లి గ్రామంలో వెలసిన ఎల్లమ్మ దేవత జాతర మినీ మేడారాన్ని తలపిస్తుంది. మహాశివరాత్రికి ముందు వచ్చే శుక్రవారం జరిగే జాతర బ్రహ్మోత్సవాలకు పోలేపల్లి సిద్ధమవుతున్నది.

కోరిన వారికి కొంగుబంగారమై వరాలిస్తున్న ఎల్లమ్మ పోలేపల్లిలో శతాబ్దాలుగా పూజలు అందుకుంటున్నది. అమ్మవారి మాహాత్మ్యం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. గ్రామానికి చెందిన గిడ్డెనోళ్ల లక్ష్మన్న ఒకసారి పొలం దున్నుతుండగా గుండ్రాయి కనిపించిందట. దానిని గుంటుక మీద పెట్టి రొప్పిన తర్వాత.. ఆ గుండును ఇవతలి గట్టుకు విసిరేశాడట. మరుసటి రోజు వచ్చేసరికి ఆ రాయి తిరిగి యథాస్థానంలో ఉండటం గమించాడు. రెండుమూడు రోజులు ఇదే తంతు! విషయం తెలిసిన ఊళ్లోని జోగినివాళ్లు ఆ గుండ్రాయి ఎల్లమ్మ దేవత అని, ఈ పొలంలోని ఊడుగు చెట్టు కింద దానిని ప్రతిష్ఠించి కొలువుమన్నారట. ఆ రోజునుంచి చిన్నగుడి కట్టించి ఏటా జాతర నిర్వహిస్తూ వస్తున్నారు. కాలక్రమంలో ఆలయం వృద్ధి చెందుతూ వచ్చింది.
ఘనంగా వేడుక
పోలేపల్లి ఎల్లమ్మ జాతర ఏటా ఘనంగా జరుగుతుంది. మహాశివరాత్రికి ముందు వచ్చే గురువారం నుంచి ఆదివారం వరకు నాలుగు రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ నెల 9వ తేదీ నుంచి 12 వరకు జాతర జరగనుంది. ఇందులో భాగంగా గురువారం రాత్రి 10 గంటల సమయంలో గ్రామంలోని ఎల్లమ్మ గుడి నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని, ఏడు తలల నాగపడగ మూర్తిని పల్లకిలో ఉంచి మంగళ వాయిద్యాలు, కొమ్ము వాయిద్యాలు, బాణసంచా వెలుగుల మధ్య ఊరేగింపుగా ప్రధాన ఆలయానికి తీసుకొస్తారు. ఈ ఊరేగింపు తెల్లవారుజామున 3 గంటల వరకు
కొనసాగుతుంది.
జాతరలో ప్రధాన ఘట్టమైన “సిడె” కార్యక్రమం శుక్రవారం జరుగుతుంది. సాయంత్రం నాలుగు గంటలకు గ్రామం నుంచి బోనంతో ఊరేగింపుగా అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తరువాత ఉత్సవ విగ్రహాన్ని, నాగపడగను, జల్ది కుండను, గవ్వల గురిగిని దేవాలయం సమీపంలోని బావిలో గంగపూజతో స్నానం చేయిస్తారు. జల్ది కుండలో నీళ్లు తీసుకుని గుడికి వస్తారు. తర్వాత సిడె కార్యక్రమం ప్రారంభమవుతుంది. దీంట్లో భాగంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రథానికి పొడవైన కట్టెకు చివరన ఏర్పాటు చేసిన తొట్లెలో ఉంచి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయిస్తారు. రథం గుడి చుట్టూ తిరిగే సమయంలో భక్తులు పసుపు, వేపాకు, గవ్వలను (దీనిని బండారు అని పిలుస్తారు) అమ్మవారి విగ్రహంపైకి చల్లుతారు. ఇలా విసరగా కిందపడిన గవ్వలను భక్తులు ఇంటికి తీసుకుపోవడానికి పోటీలు పడుతుంటారు. సిడె ఉత్సవాన్ని
చూసేందుకు సుమారు రెండులక్షల మంది భక్తులు హాజరవుతారు.
మనరాష్ట్రంతోపాటు కర్ణాటక నుంచి కూడా ఈ జాతరకు వస్తుంటారు. మహారాష్ట్ర షోలాపూర్ ప్రాంతవాసుల్లో చాలామంది ఎల్లమ్మను తమ ఇంటి దేవతగా భావిస్తారు. అక్కడినుంచి జాతరకు కూడా పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఇక శనివారం సాయంత్రం తేరు లాగడం కార్యక్రమం కూడా ఘనంగా జరుగుతుంది. ఆదివారం ప్రత్యేక పూజలతో జాతర ఉత్సవాలు ముగుస్తాయి. నేటికీ చాలా మంది ఎడ్ల బండ్లపై జాతరకు వచ్చి రెండు రోజులపాటు ఉండి వెళ్తారు.
ఇలా చేరుకోవాలి..
పోలేపల్లి గ్రామం మహబూబ్నగర్ నుంచి 50 కిలో మీటర్లు, బొంరాస్పేట మండల కేంద్రం నుంచి 15 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాదు నుంచి యాద్గిర్, గుల్బర్గా, కొడంగల్, సేడం, గుర్మిట్కల్ బస్సులు ఎక్కి తుంకిమెట్లలో దిగాలి. అక్కడి నుంచి ఆటోలో పోలేపల్లి (12 కి.మీ.) చేరుకోవచ్చు. మహబూబ్నగర్ నుంచి వచ్చే వారు తాండూరు బస్సులు ఎక్కి కోస్గిలో దిగి ఆటోలో పోలేపల్లికి (8 కి.మీ.) వెళ్లొచ్చు. జాతర సందర్భంగా పరిగి, తాండూరు, నారాయణపేట, కోస్గి డిపోల నుంచి ఆర్టీసి ప్రత్యేక బస్సులు నడుపుతుంది.
కనికె నర్సింహులు బొంరాస్పేట
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

