నిత్యం విశ్వామిత్ర కృత సుప్రభాతంతో నిద్రలేచే తిరుమల వెంకన్న నేటి నుంచి గోదాదేవి పిలుపుతో మేల్కొంటాడు. ధనుర్మాస వేళ గోదాదేవి రాసిన తిరుప్పావు పాశురాలు రోజుకొకటి చొప్పున వింటాడు శ్రీనివాసుడు. అలాగే రోజులో ఒకసారి 30 పాశురాలూ ఆలకిస్తాడు. గోదాగీత గోవిందాన్ని వింటూ గోవిందుడు పరవశిస్తాడు. తిరుమల క్షేత్రంలో మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న వైష్ణవాలయాలలో ఈ ధనుర్మాసంలో తిరుప్పావై మార్మోగుతుంది. సంక్రాంతి వరకు కొనసాగే ఈ సిరినోము ధనుర్మాస వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది.
శ్రీరంగనాథుణ్ని కొలుస్తూ ధనుర్మాసంలో గోదాదేవి రోజుకొకటి చొప్పున ముప్పయ్ పాశురాలు ప్రస్తుతించింది. వీటిలో మొదటి ఐదు ఉపోద్ఘాతం లాంటివి. తిరుప్పావై ప్రాధాన్యాన్ని తెలియజేస్తాయి. భగవంతుడికి చేసే అర్చన, నివేదన సహా అన్ని ఉపచారాల్లో ఆడంబరాలు అవసరం లేదని, చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు సంతోషిస్తాడని ఈ పాశురాల్లో చెబుతుంది. తర్వాతి పది పాశురాల్లో చెలులతో కలసి, శ్రీరంగనాథుడిని సేవించటానికి గోదాదేవి వెళ్తున్న సన్నివేశాల వివరాలు వర్ణితమై ఉన్నాయి. పక్షుల కిలకిలారావాలు, అప్పుడే వికసిస్తున్న పూలు, దేవాలయంలో వినిపించే చిరుగంటల ధ్వనులు, లేగదూడల ‘అంబా’రావాలు, వాటి మెడలో గంటల సవ్వడి మొదలైన మనోహర ప్రకృతి దృశ్యాల వైభవం వీటిలో కనిపిస్తుంది.
పదిహేను నుంచి ఇరవయ్యో పాశురం వరకు గోదాదేవి, చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శన విశేషాలతో నిండి ఉంటాయి. ‘కపట నిద్ర విడిచి, లోకాల్ని కాపాడటానికి మేలుకోవయ్యా’ అంటూ రంగనాథుడికి సుప్రభాతం ఈ పాశురాల్లోనే వినిపిస్తుంది. కృష్ణుడి అష్టమహిషుల్లో ఒకరైన నీలాదేవి ప్రార్థన కూడా వీటిలోనే ఉంటుంది. తర్వాతి తొమ్మిది పాశురాలు పూర్తిగా భగవద్విలాసాన్ని ప్రకటిస్తాయి. నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి. చివరి పాశురం ఫలశ్రుతి. ఎవరైతే ఈ పాశురాలు గానం చేస్తారో, వారికి భగవత్ కృప తప్పకుండా కలుగుతుందని అందులో హామీ ఇస్తుంది.
ఈ పాశురాలు గోదాగీతగా ప్రాచుర్యం పొందాయి. ఆధ్యాత్మిక ప్రస్థానంలో, మానవ జీవనంలో ఏది మంచో ఏది చెడో వివేచన చేసుకోమని హెచ్చరిస్తాయి ఇవి. మహర్షులైన వారి మార్గదర్శనం తీసుకోమని సూచించాయి. తిరుప్పావై పాశురాలు ఆత్మను పరమాత్మ సన్నిధికి చేర్చే వాహకాలు. సగుణోపాసన ద్వారా నిర్గుణోపాసనకు మార్గం చూపే దారి దీపాలు. అంతిమంగా ‘శ్రీకైవల్యపదానికి’ చేరవేసే పరమపద సోపానాలు.