గలెలియా తీరంలో సామాన్య జనంలో సంచరించే ప్రభువు దగ్గరికి ఒక సేనాధిపతి ఆత్రుతగా వచ్చాడు. తన కుమారుడి వ్యాధి గురించి చెప్పి బాధపడ్డాడు. తన కొడుకు మృత్యువుతో పోరాడుతున్నాడనీ, చివరి ఘడియల్లో ఉన్నాడనీ క్రీస్తుకు చెప్పుకొని కన్నీటిపర్యంతం అవుతాడు. ప్రభువు చుట్టూ ఉన్న ప్రజలు.. ‘పిల్లవాడికి చికిత్సో, భూతవైద్యమో చేయించకూడదా?’ అని సలహా ఇచ్చారు. అవేవీ ఆ సేనాధిపతి వినిపించుకోలేదు. ప్రభువుతో ‘అయ్యా నీవు వస్తే నా కొడుకు బతికిపోతాడు. నా బిడ్డ కన్నుమూయక ముందే మా ఇంటికి దయచేయండి’ అని వేడుకుంటాడు. విశ్వాసంతో ప్రభువు పాదాలను చుట్టేశాడు. కన్నబిడ్డ కోసం పరితపిస్తున్న ఆ తండ్రితో ప్రభువు ‘నీవు ఇంటికి వెళ్లు.
నీవు అక్కడికి చేరుకునేసరికి నీ కొడుకు బతికే ఉంటాడు’ అన్నాడు. కృతజ్ఞతతో ప్రభువుకు ప్రణామాలు సమర్పించి పటాలం కదిలిరాగా రథమెక్కి వెనుదిరిగాడు సైన్యాధిపతి. తిరుగు ప్రయాణంలో ఉండగానే.. కోట నుంచి ఒక భటుడు తమకేసి వేగంగా రావడం కనిపించింది. అతణ్ని చూడగానే సైన్యాధిపతి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. భటుడు సమీపించి..‘మీ కుమారుడికి ఆపద తప్పింది. అనారోగ్యమంతా మాయమైంది. హుషారుగా అందరి పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు’ అని అమృతం లాంటి కబురు అందించాడు. సైన్యాధిపతి ధరించిన ధగధగలాడే ఎర్రటి పూల జూలు కిరీటం ప్రభువుకు మరోసారి కృతజ్ఞతగా వంగి నమస్కరించి కళకళలాడింది.
…? ప్రొ॥బెర్నార్డ్ రాజు, 98667 55024