e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home చింతన సమత్వ బుద్ధియే జీవన ధర్మం!

సమత్వ బుద్ధియే జీవన ధర్మం!

సమత్వ బుద్ధియే జీవన ధర్మం!

సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి॥

భగవద్గీత (2-38)


మానవ జీవితంలో సుఖదుఃఖాలు అత్యంత సహజం. జీవితం అన్నప్పుడు ఇవి తప్పవు. సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడం, దుఃఖం కలిగినప్పుడు కుంగిపోవడం మానవ నైజం. కానీ, ‘ఈ రెండింటి విషయంలో మనిషి సమత్వం పాటించినప్పుడు ఏ విధమైన పాపమూ అతనిని బాధించదు’ అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో చెప్పాడు. ‘అర్జునా! సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా ఒకే విధంగానే ఉండు. లాభం కలిగినా, నష్టం కలిగినా రెంటినీ సమభావనతో చూడు. జయమైనా, అపజయమైనా సమబుద్ధితోనే స్వీకరించు. ఇట్లా చేసినప్పుడు నీకు ఏ పాపమూ అంటదు’ అని ప్రబోధించాడు.
ఈ బోధ అర్జునునికే కాదు, లోకంలోని ప్రతి మనిషికీ వర్తిస్తుంది. అర్జునుడు సుఖదుఃఖాలను ముందుగానే శ్రీకృష్ణునితో చెబుతూ, తన బాధనంతా వ్యక్తపరిచాడు. గురువులు, బంధువర్గాలను యుద్ధంలో సంహరించిన ఫలితంగా ఒనగూడే సుఖాలను తాను అనుభవింపలేనని జగద్గురువైన శ్రీకృష్ణునికి స్పష్టంచేశాడు. అదే సమయంలో తీవ్ర నిర్వేదాన్నీ వెలిబుచ్చాడు. చేయవలసిన కర్తవ్యాన్ని త్యజిస్తూ యుద్ధం నుంచి నిష్ర్కమించడానికే సిద్ధపడ్డాడు. ఇది కర్తవ్య పాలనకు విరుద్ధం. ‘బాధ్యతల నుంచి వైదొలగడం’ అన్నది మనిషిని పక్కదారి పట్టిస్తుంది. ఆ మార్గం పరాజయాలను మోసుకొస్తుంది. అపకీర్తి పాల్జేస్తుంది.

దుర్మార్గులను సమర్థించినట్లూ అవుతుంది. అన్యాయాలను ప్రోత్సహించినట్లు కూడా అవుతుంది. దీన్ని గమనించాడు కనుకే శ్రీకృష్ణ పరమాత్మ.. అర్జునుణ్ణి యుద్ధ సన్నద్ధంతో కర్తవ్యోన్ముఖుణ్ణి చేసే దిశగా ఆయనకు అనేక ధర్మసూత్రాలు, సత్యాలను బోధించాడు. అవన్నీ సార్వకాలికాలు. మానవాళికి ధర్మజీవన మార్గాన్ని చూపించేవి. ఈ ధర్మాచరణ ఆచరించిన వ్యక్తినేగాక అతని మొత్తం సమాజాన్నీ రక్షిస్తుంది. ఎక్కడ అన్యాయం జరిగినా, అధర్మం ప్రబలినా దాన్ని నివారించే గొప్ప శక్తి ‘క్షత్రియ ధర్మం’. అవసరమైతే యుద్ధం చేసైనా ధర్మాన్ని రక్షించాల్సింది సుక్షత్రియులే. వారికి యుద్ధానికి మించిన శ్రేయస్సు ఉండదు.
‘ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయోన్యత్‌ క్షత్రియస్య న విద్యతే’. అధర్మ నివారణను క్షత్రియధర్మంగా గుర్తించాలి. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని అధిగమించవలసిన బాధ్యత విధిగా వారిదే. సరిగ్గా అర్జునునికి కూడా ఇవే సమస్యలు ఎదురయ్యాయి. యుద్ధం చెయ్యాల్సిన క్షత్రియధర్మానికి అవే అడ్డంకులుగా నిలిచాయి. ‘గురు బాంధవుల హననం తన మనస్సు అంగీకరించని పని’ కావడం, అర్జునుడు స్వధర్మ నిర్వహణ నుంచి వెనుకంజ వేయడం వంటివన్నీ.. అతనిలోని రాగద్వేషాల ఫలితాలే. శ్రీకృష్ణ భగవానుడు ‘ధర్మ నిర్వహణలో రాగద్వేషాలకు తావుండరాదని’ స్పష్టం చేశాడు. ఇదే సమయంలో మరో రహస్యాన్నీ బోధించాడు. అది సుఖదుఃఖాలు, జయాపజయాలకు సంబంధించింది.

‘ఒక సత్కార్య నిర్వహణలో సుఖం లభించవచ్చు, దుఃఖమైనా ప్రాప్తించవచ్చు. అలాగే, ఏదైనా పని వల్ల జయం కలుగవచ్చు. ఒక్కోసారి అపజయమూ సంభవించవచ్చు. వీటిని దృష్టిలో పెట్టుకొని తాను తన బాధ్యత నుంచి తప్పుకోవడం క్షత్రియధర్మం కాదని’ అన్నాడు పరమాత్మ.
స్వధర్మ నిర్వహణ పట్ల ఏ విధమైన ఫలితం వచ్చినా సరే, క్షత్రియుడు అన్నవాడు వెనుదిరుగరాదు. అతనిలో ‘సమత్వ బుద్ధి’ తప్పనిసరి. దీనివల్లనే అతడు ధర్మ నిర్వహణకు సిద్ధపడతాడు. అలా సిద్ధపడటమే భావ్యం. అందుకే, శ్రీకృష్ణ పరమాత్ముడు ‘యుద్ధం చేయకపోతే పాపం మూట కట్టుకున్న వాడవవుతావు’ అంటూ అర్జునుణ్ణి హెచ్చరించాడు. మానవ ప్రవృత్తిని ధర్మ మార్గంలోకి మళ్లించడానికే భగవానుడు ఈ గొప్ప సందేశం ఇచ్చాడు. కనుక, ప్రతి ఒక్కరూ సుఖదుఃఖాలు, జయాపజయాల పట్ల సమత్వభావనను అలవర్చుకోవాలి.

సమత్వ బుద్ధియే జీవన ధర్మం!
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సమత్వ బుద్ధియే జీవన ధర్మం!

ట్రెండింగ్‌

Advertisement