వెయ్యిమందిలో కూర్చున్నా క్రైస్తవుని గుర్తుపట్ట గలిగినపుడే.. అతని క్రైస్తవ్యానికి ధన్యత. క్రీస్తు కోరుకున్నది, పరిపూర్ణ క్రైస్తవ్యం వాంఛించిందీ ఇదే! ప్రభువును అనుసరించడమే క్రైస్తవ్యం. క్రీస్తు అంటే ఆషామాషీ పదం కాదు. అది ప్రేమకు, త్యాగానికి సంకేతం. క్రీస్తు తోటివాణ్ని ప్రేమించడానికి ఆనవాలు. ఆయన్ను అనుసరించడం, అనుకరించడం మామూలు విషయం కాదు. కష్టంతో కూడుకున్నదే. క్రీస్తు అనగానే సిలువ కనిపిస్తుంది. సిలువపై కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతూ వేలాడే ప్రభువు కనిపిస్తాడు. మరణిస్తున్న సమయంలో క్రీస్తు ఇచ్చే సందేశాలు సుఖతరంగా ఉండవు. ఆనందంగా చెప్పుకొనేవీ కావు.
అటువంటి క్రీస్తులా ప్రవర్తించేవాడే నిజమైన క్రైస్తవుడు. క్రీస్తు సందేశాన్ని తన ప్రవర్తనతోనే నిర్వచిస్తూ, ఆ సూక్తిని మోసుకుపోయి లోకానికి అందించేవాడు క్రైస్తవుడు. లేకపోతే అతను అన్యుడే. క్రైస్తవుడనని చెప్పుకోవడానికే అనర్హుడే. హింసలు భరించడం తప్ప ఎదురు తిరిగి ప్రతిదాడి చేయడం కోరుకోనిది క్రైస్తవం. దేవుణ్ని పరిపూర్ణంగా పూజించాలని ఎంత గాఢంగా చెబుతుందో, అంతే మోతాదులో సాటివాణ్ని ప్రేమించాలని క్రైస్తవం ఆజ్ఞాపిస్తుంది. అంటే, దైవారాధన.. ప్రేమగా పరిణామం చెందాలన్నమాట. మనల్ని మనం ప్రేమించుకున్నట్టే, మరొకరిని ప్రేమించాలి! అదే ప్రభువు బోధించినది. క్రైస్తవం కోరుకున్నది.
– ప్రొ॥బెర్నార్డ్ రాజు, 98667 55024