ద్వేషాన్ని ప్రేమతో జయించవచ్చు. ‘నీకు ఇవ్వని వారికి ఇవ్వు. నీతో సంబంధాలు తెగదెంపులు చేసుకున్నవారిని కలుపుకొనిపో. నీపై దౌర్జన్యం చేసిన వారిని క్షమించి వదిలిపెట్టు. ఇలా చేస్తే మనిషి ఉన్నత వ్యక్తిత్వం కలవాడు అవుతాడు’ అంటుంది ఖురాన్. ఒకరోజు ప్రవక్త ప్రయాణంలో ఒక చెట్టుకు ఆనుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఆయన్ను హతమార్చడానికి ఇదే మంచి సమయమని ఓ వ్యక్తి భావించాడు. చేతిలో కత్తితో ఆయన ముందుకు వచ్చి, ‘ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారని’ కత్తి దూశాడు. అల్లాహ్ కాపాడతాడన్నారు ప్రవక్త. ఇంతలో శత్రువు చేతిలో కత్తి కాస్తా జారిపోయింది. ప్రవక్త ఆ కత్తి తీసుకుని ‘ఇప్పుడు నిన్నెవరు రక్షిస్తార’ని అడిగారు. ఆ వ్యక్తి వణుకుతూ ‘ఎవరూ లేరు’ అన్నాడు. ప్రవక్త అతనితో ‘తప్పు… నిన్ను కూడా అల్లానే రక్షిస్తాడు’ అన్నారు. ఆ వ్యక్తిని క్షమించి వదిలేశారు.
ప్రవక్త ముహమ్మద్ (స) ఇంటి నుంచి మసీదుకు వెళ్లే దారిలో ఒక మహిళ నివాసం ఉండేది. ఆమె ఇంటి పైకప్పు నుంచి రోజూ ఆయనపై చెత్త వేసేది. ప్రవక్త మౌనంగా వెళ్లిపోయేవారు. ఒకరోజు ప్రవక్తకు ఆ మహిళ కనిపించలేదు. ఆయన అక్కడ ఆగి చుట్టుపక్కల వారిని ఆమె గురించి వాకబు చేశారు. ఆ మహిళ అనారోగ్యంతో మంచం పట్టిందన్నారు వాళ్లు. ప్రవక్త ముసలమ్మ ఇంట్లోకి వెళ్లి ఆమెను పరామర్శించారు. ధైర్యం చెప్పారు. ప్రవక్త వైఖరి ఆమెపై ఎంతో ప్రభావం చూపింది. క్షమాగుణం ఎంత గొప్పదో పై రెండు సంఘటనలు చాటి చెబుతున్నాయి. మన్నింపు వైఖరిని అలవర్చుకోవడమే ప్రవక్త (స) పట్ల మన ప్రేమకు నిదర్శనం.
– ముహమ్మద్ ముజాహిద్ 96406 22076