e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home చింతన యద్భావం తద్భవతి!

యద్భావం తద్భవతి!

యద్భావం తద్భవతి!

మనసును భగవంతుని మీదే నిలిపి తగిన ఉపచారాలతో, ముందుగానే సమకూర్చుకున్న పూజా ద్రవ్యాలతో అర్చించడమే ‘పూజ’. ‘సంభవిద్భిః ద్రవ్యైః, సంభవిదు పచారైః, సంభవితా నియమేన..’ అంటే, ‘లభించిన పూజా ద్రవ్యాలతో, అనుకూలమైన ఉపచారాలతో, ఏర్పరుచుకున్న నియమాలతో నాకు ఉన్నంతలో నీ పూజకు సిద్ధమయ్యాను స్వామీ!’ అని మనసులో సంకల్పించుకొని అర్చనకు ఉపక్రమిస్తాం. భక్తిని, శక్తిని బట్టి ఎంత పూజా సామాగ్రినైనా సమకూర్చుకోవచ్చు. పూజా విధానంలో కూడా ‘పంచోపచారాలు’ (5 రకాల సేవలు: గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం), ‘షోడశోపచారాలు’ (16 రకాల సేవలు: ఆవాహనం, ఆసనం నుంచి నీరాజనం, పునఃపూజ దాకా), ‘చతుష్షష్ట్యుపచారాలు’ (64 రకాల సేవలు: విశేష అర్చనలు, వీటిలో నవరత్న ఖచిత సింహాసనం, ఏనుగులు, గుర్రాలు, దుర్గం వంటివి సమర్పించడం) ఇత్యాదులు ఎన్నో ఉంటాయి. ఇవేకాక జప, తప, దాన, తర్పణ, హోమాది అనేకానేక విధానాలు, అర్చనలు, క్రతువులు ఉంటాయి. అర్చించేవారి శక్తి సామర్థ్యాలు, వదాన్యతలను బట్టి పూజల హంగులు, ఆర్భాటాలు పెరుగుతుంటాయి. పేదవాని బీదపూజలు నిరాడంబరంగానే ఉంటాయి.
‘సత్యనారాయణస్వామి’ వ్రతకథలో చంద్రకేతు, ఉల్కాముఖ మహారాజుల పూజలకే కాదు, కట్టెలమ్మేవాని, గొల్లపిల్లల పూజలకు కూడా స్వామి సంతుష్టుడై సమానమైన ఫలాలను ఇవ్వడం గమనించవచ్చు. సాధారణంగా ఏ పూజకైనా విత్తం కన్నా చిత్తం ముఖ్యం.
‘ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల
భాండశుద్ధి లేని పాకమేల
చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా
విశ్వదాభిరామ వినుర వేమ!’

అన్న వేమన్న ఆదర్శం అందరికీ అనుసరణీయం కావాలి.
భావనామాత్ర సంతుష్టుడు భగవంతుడు. ఆయన అర్చనలో భావనమే ప్రధానం. ‘యద్భావం తద్భవతి’ అంటే, ‘మనస్ఫూర్తిగా తలచిందే జరుగుతుంది’. భగవంతుని మీద పరిపూర్ణమైన విశ్వాసంతో, మనఃపూర్వకంగా అర్చించేవారు కేవలం అక్షితలు వేసి, ‘నవరత్నాభరణాని సమర్పయామి’ అని భావించినా సరిపోతుంది. ‘కొండంత దేవుడికి కొండంత పత్రిని సమర్పించగలమా?’. నిర్మల భక్తితో ‘ఏకబిల్వం శివార్పణం’ అని సమర్పించినా చాలు. మన మనోనిగ్రహం కోసమే విగ్రహారాధన. సగుణోపాసనలోని ఆంతర్యమిదే. మనస్సు ఏకాగ్రత కుదిరి నిశ్చల తత్త్వం ఏర్పడిన భక్త యోగులు, తపస్సిద్ధులు నిర్గుణోపాసనతోనే భగవంతుని అర్చించి తరిస్తారు, ‘శ్రీమద్భాగవతం’లో ప్రహ్లాదునిలాగా.
పానీయంబులు ద్రావుచున్‌ గుడుచుచున్‌ భాషించుచున్‌ హాస లీ
లా నిద్రాదులు సేయుచున్‌ దిరుగుచున్‌ లక్షించుచున్‌ సంతత
శ్రీ నారాయణ పాదపద్మ యుగళీ చింతామృతా స్వాద సం
ధానుండై మఱచెన్‌ సురారి సుతు డేతద్విశ్వమున్‌ భూవరా!
‘అన్నివేళలా, అన్ని అవస్థల్లో, అంతటా పరమాత్ముని దర్శించి ఆ లీలానుభూతిలోనే మునిగితేలుతారు’. భక్త రామదాసాది కర్మయోగులకు ‘అంతా రామమయం, జగమంతా రామమయమే కదా’!
ఆత్మాత్వం గిరిజామతిః పరిచరాః ప్రాణాః శరీరం గృహం
పూజాతే విషయోప భోగ రచనా నిద్రా సమాధి స్థితిః
సంచారః పదయోః ప్రదక్షిణ విధిః, స్తోత్రాణి సర్వాగిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం.

‘ఓ పరమేశ్వరా! నా ఆత్మవు నీవు. నా బుద్ధి పార్వతి. నా పంచప్రాణాలే నీ పరిచారికలు. నాకు ఏయే విషయాల మీద ఆసక్తి ఉందో అవన్నీ నీకు పలువిధాలైన ఉపచారాలు. నేను నిద్రిస్తున్నానంటే అది సమాధి స్థితిలో ఉన్నానన్నమాట. నా పాదాలు భూమిపై సంచరించినదంతా నీకు చేసే ప్రదక్షిణయే. నేను మాట్లాడే మాటలన్నీ నిన్ను స్తుతిస్తున్న స్తోత్రాలే. నేను చేసే కర్మలన్నీ నీకు చేసే ఆరాధనలే. ఇలా బాహ్యాభ్యంతరాలలో నా తనుమనః పూర్వకంగా జరిపేవన్నీ ఈశ్వరార్చనలే’ అంటారు ఆదిశంకర భగవత్పాదులవారు ‘శివ మానసిక పూజాస్తోత్రం’లో. ఇలాంటి నిర్వ్యాజ భక్తి స్థితిని కలిగినవారి జన్మమే ధన్యం.

మరుమాముల దత్తాత్రేయశర్మ

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
యద్భావం తద్భవతి!
యద్భావం తద్భవతి!
యద్భావం తద్భవతి!

ట్రెండింగ్‌

Advertisement