నీరు ఒకటే.. కొన్ని ప్రాంతాల్లో పానీ అంటారు. మరికొన్ని ప్రాంతాల్లో వాటర్ అని పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా నీటి స్వభావం మారదు. అలాగే భగవంతుడు కూడా! ఏ పేరుతో పిలిచినా, ఏ రూపుతో కొలిచినా అసలు స్వరూపం ఒకటే. ఈ సృష్టిని ఏర్పరచిన భగవంతుడు, మనలను సృష్టించిన భగవంతుడు ఒక్కడే.
‘యేప్యన్య దేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః
తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకమ్
(భగవద్గీత 9-23)
‘ఓ అర్జునా! శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ, వారు నన్ను పూజించినట్లే’ అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. దేవుడు ఒక్కడే అన్న భావనను తెలియజేస్తుంది ఈ శ్లోకం.
అంతటా వ్యాపించి ఉన్న భగవంతుడు ఒక్కడే అయినా, దేశకాల పరిస్థితులు, నమ్మకాలు, వ్యక్తిగత ఇష్టాలను బట్టి వేర్వేరు రూపాలతో కొలుస్తుంటారు. సాధారణ మనుషుల రూపాలు, పేర్లతోపాటు వారి అభిరుచులు, అలవాట్లు వేర్వేరుగా ఉంటాయి. అలాగే దైవాన్ని వివిధ రూపాలుగా కొలిచి, వివిధ నామాలతో, రకరకాల పద్ధతుల్లో ఉపాసిస్తూ ఉంటారు. కొందరు శక్తిగా భావిస్తారు. మరికొందరు రాముడిగా కీర్తిస్తారు. ఇంకొందరు శివుడిగా భావించి స్తుతిస్తారు. ఎవరు ఎలా ఆరాధించినా, ఏవిధంగా ఉపాసించినా దైవం కరుణిస్తాడు. భక్తుడు ఏ రూపంలో పూజిస్తే.. అదే రూపంలో అనుగ్రహిస్తాడు భగవానుడు. ఆ పేరుతోనే పలుకుతాడు దేవదేవుడు. ఏ దేవుడి కోసం చేసిన ఆరాధనలైనా అవన్నీ అనంతమైన పరమాత్ముడికే చెందుతాయని తెలుసుకోవాలి.
సనాతన ధర్మంలో దేవతారాధనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు శాస్త్రకారులు. అయితే, తాను పూజించే దేవుడు అధికుడు, మిగతా దేవతలు కాదు అనే భావనతో పెనుగులాడుకున్న సందర్భాలు చరిత్రలో కోకొల్లలుగా కనిపిస్తాయి. సృష్టికర్త ఒక్కడే అన్న విషయాన్ని గ్రహిస్తే ఇలాంటి వాదనలకు చోటుండదు. ‘శివాయ విష్ణు రూపాయ, శివ రూపాయ విష్ణవే’, ‘శ్రీరామో లలితాంబిక, శ్రీకృష్ణః శ్యామలాదేవి’ లాంటి వాక్యాలు మన పురాణాల్లో కనిపిస్తాయి. వేదాలు, పురాణాలు సైతం దైవం ఒక్కటే అని తీర్మానించాయి. కానీ, ఈ సత్యాన్ని గ్రహించక ‘నా దేవుడు అధికుడు, నీ దేవుడు కాదు’ అని వితండవాదనలు చేస్తుంటారు. పరమాత్మ మాత్రం తనను ఎలా పిలిచినా పలుకుతానని స్పష్టంగా చెప్పాడు. ‘ఎవరు ఏయే దేవతలను ఆరాధించినా వారందరూ అనంతుడను, అవ్యక్తుడను అయిన నన్ను ఆరాధిస్తున్నట్లే’ అని స్వయంగా భగవానుడే ప్రకటించాడు.
శ్రీకృష్ణుడిని ఒకొక్కరూ ఒక్కోలా భావించి పూజించేవారు. గోపికలు ప్రియునిగా ఆరాధించేవారు. గోపబాలురు కృష్ణ పరమాత్మలో స్నేహితుడిని చూసుకునేవారు. ద్రౌపది అన్నగా భావించింది. యశోదా నందులు, దేవకీ వసుదేవులు కొడుకుగా లాలించారు. శిశుపాలుడు శత్రువుగా తలచాడు. ఇలా ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా శ్రీకృష్ణుడిని కొలిచారు. ఒక్కడే కృష్ణుడిలో ఎవరికి వారు తమకు ఇష్టమైన రూపాన్ని దర్శించారు. నచ్చిన పేరుతో పిలిచారు. ఎవరు ఎలా పిలిచినా అందరికీ తన ప్రేమను పంచాడు శ్రీకృష్ణుడు. అందిరిపైనా అనుగ్రహాన్ని వర్షించాడు. సకామ భక్తితో మనం ఏ దైవాన్ని పూజించినా అది పరమాత్మకు చెందుతుంది. ఈ సత్యం విస్మరించి వ్యర్థమైన వాదనల్లో కొట్టుకుపోరాదు. తప్పు దారిలో వెళ్తే గమ్యం చేరే మాట అటుంచితే, ఇక్కట్లు ఎదురవుతాయి. అలాగే, దైవం ఒక్కటే అన్న భావన లేకుండా చేసే పూజలు అవిధి పూర్వకాలనీ, అజ్ఞానంతో కూడినవని గీతాచార్యుడు తెలియజేశాడు. ఈ సత్యాన్ని తెలుసుకొని భగవంతుడు ఒక్కడే, భగవన్నామం ఒక్కటే అన్న నిశ్చయానికి రాగలిగితే అదే మోక్షానికి ద్వారం అవుతుంది.
–కనుమ ఎల్లారెడ్డి
93915 23027