e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home చింతన గోండి, కోయ భాషల్లోనే తెలుగు మూలాలు!

గోండి, కోయ భాషల్లోనే తెలుగు మూలాలు!

గోండి, కోయ భాషల్లోనే తెలుగు మూలాలు!

తెలుగు భాష ఎంత సుందరమైనదో అంత ప్రాచీనమైనది. మన భాషా వికాస చరిత్ర వేల ఏండ్లది. ఇది ఆది ద్రావిడంలో అవతరించి పరిణామక్రమంలో మారుతూ తెలుగుగా వికాసం చెందింది. ఆ క్రమంలో అనేక మూలపదాలను మిగిలించుకొని ఉన్నది. ఆ మిగిలి ఉన్న పదాలే మన భాషకు సంబంధించి ‘జీన్స్‌’లాంటివి. అంతేకాదు తెలుగుకు అందాలద్దుతున్నవి. ఈ పదాలను బట్టి మన భాషా చరిత్రను అర్థం చేసుకోవాలి. తిరిగి అధ్యయనం చెయ్యాలి.

తెలుగు భాషలో ఉన్న పదాల ఉనికి ఎట్లా కొనసాగుతూ ఉందో అర్థం చేసుకుంటే గానీ మన తెలుగు భాష చరిత్ర, ఔన్నత్యం అర్థం కాదు. మచ్చుకు ‘పేడి మూతి’ అనే మాట. ‘పేడీ’ మాటను తిక్కన తను అనువదించిన ‘మహాభారతం’ విరాట పర్వంలోని మూడవ ఆశ్వాసం
(పద్యం నెం.229,233,234. మహాభారతం, ప్రచురణ: ఉస్మానియా విశ్వవిద్యాలయం,1970)లో అర్జునుడి ముఖాన్ని వర్ణిస్తూ చెప్పాడు. నాడు మహాకవి తిక్కనకు కూడా ఈ మాట తప్ప వేరే మాట దొరక లేదు. మన మూలాలు సంస్కృతంలో ఉన్నాయనుకోవడం వట్టి భ్రమ. ఇంకా..‘సాంపి’, ‘ఏర్‌ నీర్‌’, ‘పేర్‌ పెద్దేర్‌’, ‘మాటా -మంతి’, ‘కెవ్వు- కేక’, ‘మర్నాగి’.. లాంటి ఎన్నో మాటల ద్వారా ఈ భాష మూలాలను చూస్తే.. తెలుగుకు మూలం గోండీ, కోయలాంటి ఆదివాసీ భాషలని అర్థమవుతున్నది. మన భాషా మూలాలను గోండీ, కోయ భాషలలో చూసినప్పుడు ఆశ్చర్యం, అంతకు మించిన అబ్బురం కలుగుతుంది. అలాగే తెలుగులో ఉన్న ఏ నాలుగో, అయిదో పదాలను తీసుకోవడమనేది నా పరిమితి. నేను ప్రస్తావిస్తున్నవి కన్నవీ, విన్నవీ, పరిశీలన చేసినవి మాత్రమే.

- Advertisement -

పేడి మూతి: ‘పేడి మూతి’ అనో, లేదా ‘పేడి మూతోడు’ అనో మీసాలు రాని లేదా లేని యువకులను అనడం వింటాం. ‘పేడి’ అంటే ‘గోండీ’భాషలో అమ్మాయి అని అర్థం. పేడి మూతి వాడు/పేడి మూతోడు అంటే ‘అమ్మాయిలాంటి మూతి ఉన్నవాడ’ని అర్థం. ఇది తప్ప దీనికి ఇంకో మూలం లేదు. దీన్ని బట్టి గోండీకీ తెలుగుకూ ఉన్న సాన్నిహిత్యం ఎంత ప్రాచీనమో, ఎంత అర్వాచీనమో ఊహించాలి. ఆడమూతి లేదా ఆడ మూతోడు అనవచ్చు కదా! ఇలా అచ్చ తెలుగు పదబంధం వాడుకలోకి రాకుండా ‘పేడి మూతి’ అనే పదబంధం ఎందుకు వచ్చింది అని మనం లోతుగా అలోచించవలసిందే. ‘పేడి’ గోండీ అయినప్పుడు ‘పెట్ట’ ఏ భాషాపదం.‘పడ్డ’,‘బిడ్డ’ఏ భాషాపదం. ఇప్పటికీ మనం ‘బర్రె పడ్డ’ అనే మాట వాడుతాం. మానవ శిశువుకు ‘బిడ్డ’ అనే పదం వాడుతాం. వీటన్నింటి మూలాలు వెతుకాల్సిందే.

సాంపి: తెలంగాణ పల్లెల్లో రోజూ పొద్దున్నే లేవగానీ వినే మాటల్లో ఆకిలి/వాకిలి ఊడ్చుడు, సాంపి సల్లుడు. ఆకిలి ఊడ్చుడు అనేది స్పష్టంగానే అర్థమవుతుంది. మరి ‘సాంపి’ అనేది ఏంటిది? పశువుల పెండ/పేడను నీళ్ళల్లో కలిపి చల్లేది ‘సాంపి’. మరి ఇక్కడ ‘పేడ నీళ్లు’ అనక ‘సాంపి’ అని ఎందుకు అంటున్నం? పేడకు సాంపికి పొసగడం లేదు. పేడ, నీళ్లు కలిపితే ఏ సంధి ద్వారా కూడా ‘సాంపి’ రాదు. గోండీలో పేడను ‘సడాపి’ అంటరు. ఈ ‘సడాపి’ నుంచి వచ్చిందే ‘సాంపి’.

అవ్వ(అమ్మ!): అవ్వ అంటే అమ్మనా? అమ్మమ్మనా? నాయినమ్మనా? తెలంగాణలో కొన్ని వైపుల అమ్మను ‘అవ్వ’ అంటరు. కొన్ని ప్రాంతాల్లో ‘అమ్మ’ అంటరు. ఇక్కడ తేల్చవలసింది అవ్వ స్థానంలో అమ్మ వచ్చి కూర్చోవడం గురించి. ఇక అమ్మ స్థానం లో ‘మమ్మీ’ వచ్చి కూర్చోవడం ఇంకా ఇటీవలి పరిణామం. కోయలో అమ్మను ‘యవ్వ’అంటరు. ‘యవ్వ’నే కాలక్రమంలో ‘అవ్వ’ అయ్యింది.

ఇక ‘అయ్య’ స్థానంలో ‘నాన్న- బాపూ’ వచ్చి కూర్చోవడం చూస్తున్నదే. కోయ భాషలో తండ్రిని ‘ఇయ్యాల్‌’ అంటరు. కోందులు అమ్మను ‘అయ్య’అంటరు. నిజానికి అమ్మకు అసలైన పదం అవ్వ మాత్రమే.

గోండి, కోయ భాషల్లోనే తెలుగు మూలాలు!

మాటా-మంతి: బాగా పరిచయం ఉన్న మాట ‘మాటా మంతి’. మాట అంటే అందరికీ తెలుసు. అయితే దీనిలో ఉన్న ‘మంతి’ సంగతి ఏమిటీ? జాగ్రత్తగా చూస్తే ఇది రెండు పదాల సమాహారం. మరి ‘మంతి’అనే పదానికి కూడా ఏదో ఒక అర్థం ఉండాలి. అంతే కాకుండా మన‘మాట’ అనే పదం పక్కన ఎందుకు వచ్చి కూర్చుందో ఆ చరిత్ర తెలియాలి. కోయలో ‘మంతి’అంటే ‘ఉంది’ అని అర్థం. అంటే ‘మాటా- మంతి’ అంటే ‘మాట ఉంది’ అని అర్థం. మనం తెలుగుభాష అంటాం. కానీ కోయను ‘కోయమాట’ అంటరు. నిజానికి మనం కూడా తెలుగును తెలుగుభాష అని గాక ‘తెలుగు మాట’ అని అనడమే సరైనది.

సరి: సరి అనగానే సరి చూసుకోవడం, సరిదిద్దు కోవడం గుర్తుకొస్తాయి. ఈ మాట పుట్టింది ‘సరి’ సరిచూసుకోవడంతోనే. ‘సరి’అంటే గోండీలో ‘బాట’. సరి, తర్రి, బాట ఈ మూడు పదాలు సమానార్థకాలుగా కోయ / గోండులు వాడుతారు.

కెవ్వు కేక: ఎవరైనా వామ్మో అనో, వాయ్యో అనో, అమ్మో, అయ్యో అనో కేక వేస్తారు. అంతే గాని ‘కెవ్వు’అని వేయరు. కోయ/గోండీ లో ‘కెవ్‌’ అంటే చెవి. దూరాన ఉన్న మనిషి చెవికి మాట చేరవేయడానికే అరుస్తారు. ఆ మూలంలోంచి వచ్చిందే ‘కెవ్వు కేక’ వేయటం.

‘గొల్లు’మని ఏడవటం: కెవ్వున కేక వేయడం లాంటి మాటనే గొల్లున ఏడవటం. గొల్లుమని ఎవ రూ ఏడవరు. మనం తరచుగా వినే మాటల్లో సొల్లువాగుడు ఒకటి. ఈ ‘సొల్లు వాగుడు’ అనేది ‘పేపర్‌ కాయిదం’ లాంటిది. పేపర్‌ అన్నా కాగితమే, కాయి దం అన్నా అదే. ఇక్కడ సొల్లుఅన్నా, వాగుడు అన్నా మాట్లాడటమే. సొల్‌ లేదా చొల్‌ అంటే తమిళంలో మాట్లాడటమని అర్థం. ‘మాట ఆడు’ అనే దానికి కోయ మాట ‘కెల్‌’. కెల్‌ నుంచి వచ్చిందే కెల్‌- గెల్‌, కొల్లు- గొల్లు వగైరా. కాబట్టి ఇక్కడ ‘గొల్లు’ అనేది కూడా కెల్‌- గొల్‌ నుంచి వచ్చిందే.

మర్నాగి: మర్నాగి అనేది ఒక రకం పిల్లి. దీని మూతి కుక్క మూతిలా ఉంటుంది.‘మార్‌ నెయ్‌’ అనే మాట అనేక మార్పులకు లోనై మర్నాగిగా తెలంగాణ తెలుగులో మిగిలింది. మార్నాగి మూతి ‘కుక్క’ మూతి లాగ ఉంటది. కాబట్టి దీనిని కోయలు ముద్దుగా ‘మార్నెయ్‌’ (చెట్టు మీది కుక్క) అన్నరు. కుక్కకు ద్రావిడ పదం నెయ్‌/నాయ్‌.తెలుగు తప్ప ఇతర ద్రావిడ భాషల్లో నెయ్‌/నాయ్‌ వాడుకనే ఉంది. నెయ్‌/నాయ్‌ను పక్కన పెట్టి తెలుగు వాళ్ళు ‘కుక్క’ అనే మాటను వాడుతున్నరు.
కరువు: కరువు అనే మాట అర్థం కాని వారుండరు. ‘కరువు’ అంటే వర్షం లేకపోవడం/తిండి కొరత రావడం. ఈ మాటకు మూల పదం కూడా కోయ నుంచి వచ్చిందే. కోయలో ఆకలికి ఉన్న పేరే ‘కరువు/కరవు’. ఆకలిగా ఉంది అనడానికి ‘కరువేసోమంది’ అంటరు. ‘కరవు’ అంటే ‘ఆకలి’ అని అర్థం. ఆకలి తీరని పరిస్థితి తెచ్చేదే కరువు.

‘అక్కడా ఇక్కడా’ అనే మాటను తమిళంలో- ‘అంగే-ఇంగే’, కోయలో- ‘అగ్గ-ఇగ’్గ , అగ్గే- ఇగ్గే , మలయాళంలో- ‘అవిడె ఇవిడె’ అని వాడుతారు. ఇవి ఎటునుంచి ఎటూ ప్రయాణం చేశాయో శోధిం చాలి. పంచ-ద్రావిడం అనే ఒకనాటి పదబంధంలో నేటి గుజరాతు, మహారాష్ట్ర ప్రాంతం కూడా భాగ మే. నేడు అక్కడ ఉన్న భాషలపై ద్రావిడ భాషల ప్రభావాన్ని అధ్యయనం చెయ్యాలి. అంతే కాదు ఒక నాడు హరప్పా మొహంజోదారో ప్రాంతంలో కూడా ద్రావిడ సంస్కృతి వికసించిందని ఇటీవలి పరిశోధనలు తెలుపుతున్నాయి. ఇంకా చెప్పాలంటే నేటికీ పాకిస్థాన్‌లోని బెలుచిస్థాన్‌లో, ఇంకా ఆఫ్ఘనిస్థాన్‌లోని కొండప్రాంతాల్లోనూ ‘బ్రాహుయి’ అనే ద్రావిడ భాషను మాట్లాడే ప్రజలున్నారు. ఈ విషయం భాషావేత్తలనూ, ఆంత్రోపాలోజిస్టులను, సామాజిక శాస్త్రవేత్తలనూ ఆశ్చర్య పరుస్తున్నది. ఈ విధంగా తెలుగు భాష మూలాల్లోకి వెల్లి తెలగు భాషావికాస చరిత్రను సమగ్రంగా, సాధికారికంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది.

ఏరు- నీరు:

తెలుగుకూ – కోయకూ ఉన్నసంబంధం ఏటికీ నీటికీ ఉన్న బంధంలాంటిదే. తెలుగు ‘ఏరు’ భౌతికమైన నేల. కోయలో ‘ఏర్‌’ అంటే నీరు. ఏటిలో ఉండే ఏర్‌ మారుతూ తెలుగు వరకూ
వచ్చేటప్పటికి నీర్‌ అయింది. కోయలో అలాగే ఉండిపోయింది.

పేరు- పెద్దేర్‌:

తెలుగులో పేరు అనే మాటను కోయలో ‘పెద్దేర్‌’ అంటరు. ఈ రెండు పదాల్లో ఏది ప్రాచీనమైనది. ఏది ఇటీవలిది అన్నది తేల్చడానికి పెద్దగా కష్టపడనవసరం లేదు. పెద్దేర్‌ నుంచి పేర్‌ వస్తుంది గానీ పేర్‌ నుండి పెద్దేర్‌ రాదు. మాటలు మార్పు చెందే క్రమంలో కుదించబడేది కూడా ఒక మార్పే.

ఏకశిలానగరం కత:

వరంగల్లుకు ఓరుగల్లు, ఏకశిలానగరమని పేరు. ‘గల్లు’ అంటే ‘రాయి’ అని అందరికీ తెలిసిందే. ఇక్కడ ఒక్క.. ఒకటి అనే అర్థంలో ‘ఓరు’ వచ్చింది. దీనికి మూలం కోయలో ఉన్నది. ఒకటిని కోయలో ‘ఒర్రోట్‌’ అంటరు. ‘ఒర్రో ట్‌’ నుంచే ‘ఓరు’ వచ్చింది

లోన:

ఎక్కడున్నారు అంటే.. ఇంటిలో ఉన్నాం.. పనిలో ఉన్నాం అంటాం.‘లోన్‌’ అంటే కోయలో ఇల్లు. ఇంటిలో ఉండటమే ‘లోన’ ఉండటం. ఇంటిలో ఉంటేనే ‘లోన’ ఉన్నాడు అంటాం. కాబట్టి ఈ ‘లోన’ అనే మాటకు మూలం కూడా కోయలో ఉందన్న మాట
( వ్యాస కర్త: విద్యాబోధన పరిశోధకులు, ‘ఉయ్యాల- జంపాల’;‘బుజ్జి పాటలు’ పుస్తక రచయిత )

గంగదేవు యాదయ్య
9059112105

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గోండి, కోయ భాషల్లోనే తెలుగు మూలాలు!
గోండి, కోయ భాషల్లోనే తెలుగు మూలాలు!
గోండి, కోయ భాషల్లోనే తెలుగు మూలాలు!

ట్రెండింగ్‌

Advertisement