e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home చింతన ఫల ప్రదాత భగవంతుడే!

ఫల ప్రదాత భగవంతుడే!

ఫల ప్రదాత భగవంతుడే!

కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త కర్మణి॥

భగవద్గీత (2-47)

అతి ప్రసిద్ధమైన ఈ శ్లోకాన్ని పలువురు జ్ఞానులు అనేక సందర్భాల్లో నిత్యం స్మరిస్తుంటారు. ఇది ప్రతి వ్యక్తికీ కనువిప్పు కలిగించే బోధ. ‘అర్జునా! కర్మలు చేయడానికే నీకు అధికారం ఉన్నది. ఫలాల విషయంలో మాత్రం ఎప్పుడూ అధికారం లేకుండానే ఉండు. కర్మఫలాలకు నువ్వు కారణం కావద్దు. అలాగని, కర్మలు చెయ్యడం మానేయ్యాలని చూడకు’ అని గొప్ప జీవితసత్యాన్ని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ప్రబోధించాడు.
మానవుడు తాను చేసే ప్రతి పనినీ ఏదో ఫలితాన్ని ఆశించే చేస్తాడు. ఒక్కోసారి పనిచేసిన వ్యక్తికి ఆశించిన ఫలితం రాకపోవచ్చు. దానికి కారణాలనేకం. ‘ఫలితం రాదు కదా!’ అని ఏ వ్యక్తీ తాను చేసే పనిని మానేయడు. ఇది లోకం పోకడ. దీన్ని మార్చలేం కూడా. జీవితంలో అన్నీ మనకు అనుకూలంగా ఉండవు. ఇవాళ అనుకూలంగా ఉన్నా రేపు, ఆ తర్వాత ఉండకపోవచ్చు. అంతమాత్రం చేత నిరాశా నిస్పృహలతో కర్మాచరణం మానరాదు. ఫలితం రాలేదని మథన పడటం వల్ల మిగిలేది మానసిక చింత మాత్రమే. ఇది అందరికీ అనుభవమే. ‘ఫలితం ఎలగూ రాదు’ అని పని మానేస్తే జీవితం సాగదు కదా. కేవలం ఫలితాన్ని మాత్రమే ఆశించి కర్మలు చేసినప్పుడు ఒక్కోసారి చిత్తశుద్ధి కూడా లోపించే ప్రమాదం ఉంటుంది. ఏకాగ్రతకూ భంగం కలుగొచ్చు. పనిమీద ఏకాగ్రత లోపిస్తే దాని ప్రభావం ఫలితంపై పడి వికటిస్తుంది. మన జన్మ సార్థకం కావాలని గాఢంగా కోరుకున్నపుడు కర్మాచరణ మానకూడదు. ఫలితం మాత్రం భగవంతునికే వదిలెయ్యాలి, అది అనుకూలమైనా, వ్యతిరేకమైనా! చిత్తశుద్ధితో చేస్తే ఈ మేరకు తృప్తి మిగులుతుంది. ఇంతవరకే మన కర్తవ్యాన్ని పరిమితం చేసుకోవాలి. ఫలితం వ్యతిరేకమని క్రుంగిపోతే జీవితంలో పురోగతి సాధ్యం కాదు. చివరికి అది కర్మరాహిత్యానికి దారితీసి, మనిషిని నిర్వ్యాపార పరాయణునిగా, నిరర్థక జీవిగా మారుస్తుంది.
కురుక్షేత్రానికి అర్జునుడు పోరాడాలనే వచ్చాడు. శత్రుసైన్యాన్ని తన పరాక్రమంతో జయించి, అన్న ధర్మరాజును చక్రవర్తిని చెయ్యాలనే సంకల్పంతోనే రణరంగంలోకి అడుగుపెట్టాడు. అంతటి మహా లక్ష్యంతో వచ్చిన సవ్యసాచిని అకస్మాత్తుగా నిస్పృహ, నిరాసక్తత వంటి బలహీనతలు ఆవహించాయి. అవి కర్మ నిర్వహణను మసకబరిచాయి. పర్యవసానం యుద్ధ వైముఖ్యానికి దారితీసింది. అందుకే, శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి పై మాట (శ్లోకం) చెప్పవలసి వచ్చింది. ప్రతి వ్యక్తికీ కర్మలపై అధికారం ఉంటుంది. అందరం విధిగా కర్తవ్య నిర్వహణ చెయ్యాల్సిందే. అసలు మనిషి కదలికలే కర్మలతో ముడిపడి ఉంటాయి. ‘కర్మలు చెయ్యాలా? వద్దా?’ అనే స్వేచ్ఛ మనకు ఉన్నది. మనిషి బుద్ధిజీవి కనుక కర్మాచరణ వల్ల పురోగతి సిద్ధిస్తుంది. ఒక్కోసారి మనం ఆశించిన ఫలితం రాకపోవడానికి మనం కారణం కాము. అందుకే, కర్మఫలాన్ని ఆశించవద్దని చెప్పేది.
ఫలితంపై ఎలాంటి ఆశ లేకుండా పనిచేసే వ్యక్తికి నిరాశా నిస్పృహలు అంటవు. పైగా ఇంకా మంచి ఫలితం సాధించాలనే రెట్టించిన ఉత్సాహంతో కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడు. ఇది అచంచలమైన ఆత్మవిశ్వాసానికి మూలమవుతుంది. ‘కర్మ చేయడంలో మాత్రమే నీకు అధికారం ఉన్నది. ఫలితంలో లేదు’ అంటే, ‘ఫలితంపై ఆశ పడవద్దనే’ తప్ప, ఫలితాన్ని ‘ఊహించవద్దని’ కాదు. ఎవరే పనిచేసినా ముందుగా ఫలితాన్ని లక్ష్యంగా చేసుకొనే శ్రమిస్తారు. కాకపోతే, అది మన చేతుల్లో ఉండదని, ‘భగవంతుడు ప్రసాదించేది మాత్రమే’ అని తెలుసుకోవాలి.

గన్నమరాజు గిరిజా మనోహరబాబు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఫల ప్రదాత భగవంతుడే!

ట్రెండింగ్‌

Advertisement