e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News గోరంత దీపం.. కొండంత దైవం!

గోరంత దీపం.. కొండంత దైవం!

మార్గశిర శుద్ధ షష్ఠిని ‘సుబ్రహ్మణ్య షష్ఠి‘ అంటారు. దేవతలకు సేనా నాయకత్వం వహించి సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం చేసిన పర్వదినం ఇదే. కుమారస్వామి, స్కంధుడు, శరవణభవుడు. స్వామినాథుడని సుబ్రహ్మణ్యుడికి పేర్లు. కుమారస్వామికి ఆరు ముఖాలు. కనుక షణ్ముఖుడని కూడా పేరు. షణ్ముఖుడి ఆరు ముఖాలు పంచభూతాలను, ఆత్మను సూచిస్తాయి. యోగ సాధనలోని షట్చక్రాలకు ఈ ఆరు ముఖాలూ ప్రతీకలు. ఆది దేవుడైన శంకరుడికి ప్రణవ మంత్రం అర్థాన్ని వివరించి తండ్రికే గురువయ్యాడు కుమారస్వామి.

ఈ జగత్తులో మాతాపితృ తత్వానికి పార్వతీ పరమేశ్వరులు, పుత్ర తత్వానికి ప్రతీకలు సుబ్రహ్మణ్య, గణపతులు అని చెప్తారు. పంచభూతాత్మకమైన ఈ లోకానికి ‘వ్యక్తావ్యక్త మహదహంకారాలు’ ఆధారం. ఇందులో అవ్యక్త తత్వానికి అమ్మవారు ఆలంబన. వ్యక్త స్వరూపాలకు సంకేతం శివుడు. మహత్తత్వానికి ప్రతీక గణపతి. కుమారస్వామి అహంకారానికి సూచిక. అహంకారం అంటే మనం అనుకునే గర్వం కాదు. ‘నేను’ అనే స్పృహ. ఈశ్వరపరమైన భావన. ఈ స్పృహ నుంచే సర్వ జగత్‌ సృష్టి జరిగిందని పెద్దలు చెప్తారు. రహస్యంగా అందరిలో ప్రకాశించే పరమాత్ముని చైతన్యమే ఇది. అందుకే సుబ్రహ్మణ్యుడిని ‘గుహ’ అని పిలుస్తారు. శివుని తేజస్సు నుంచి ఉద్భవించినవాడు కనుక ‘గురు గుహ’ అని స్వామికి మరోపేరు.

- Advertisement -

ప్రకృతి, పురుషుల ఏకత్వం కుమారస్వామి. పార్వతీపరమేశ్వరులు, లక్ష్మీనారాయణుల సమైక్య సమన్వయ తత్వమూర్తి కుమారస్వామి అని స్కాందపురాణం చెప్తున్నది. స్కందుడిని ఆరాధిస్తే ఈ నాలుగు శక్తులనూ పూజించినట్టే అని చెప్తారు. కార్తికేయుణ్ని కాలస్వరూపుడిగా భావిస్తారు. షణ్ముఖుని ఆరు ముఖాలు ఆరు రుతువులకు, పన్నెండు హస్తాలు పన్నెండు నెలలకు ప్రతీకలు. ఈ సంవత్సరాగ్ని రూపమైన స్కందుడు వివిధ వర్ణాలు ప్రకాశింపజేసే చిత్రాగ్ని అనే నెమలిపై ఆసీనుడై ఉంటాడు.
సుబ్రహ్మణ్యుడు అనంత జ్ఞాన స్వరూపం. సునిశిత మేధస్సుకు ప్రతిరూపం. ఆయన చేతిలో ఉన్న శక్తి ఆయుధం జ్ఞాన సంపదకు చిహ్నం. ఈ ఆయుధంతోనే అజ్ఞానమనే తారకాసురుణ్ని సంహరించాడు కార్తికేయుడు. అందుకే స్వామిని ‘జ్ఞాన శక్త్యాత్మ’ అని పిలుస్తారు. ఇచ్ఛా, జ్ఞాన, క్రియలతో కూడిన శక్తిని ధరించిన జ్ఞాన స్వరూపం ఆయన. ఆరు కోణాల చక్రం బహుముఖ ప్రజ్ఞకు సంకేతం. కవిత్వానికి, ప్రతిభకు కుమారస్వామి ఉపాసన ఉపకరిస్తుంది. పోతన భాగవతంలో ‘పుట్టం బుట్ట, శరంబునన్‌ మొలువ’ అంటూ తాను పుట్టలో పుట్టిన వాల్మీకిని కాను, రెల్లుపొదల్లో పుట్టిన శరవణభవుణ్ని అంతకన్నా కాదంటూ ప్రార్థించాడు. ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాల్లోనూ స్కందుని ప్రస్తావన కనిపిస్తుంది. రామాయణంలో స్కందోత్పత్తి గురించి విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు వివరిస్తాడు. మహాభారతంలో సుబ్రహ్మణ్య జననం, తారకాసుర సంహారం గురించి ఉంది.

ఆదిశంకరాచార్యులు సూచించిన ఆరు ఉపాసనా క్రమాల్లో సుబ్రహ్మణ్య ఆరాధన కూడా ఒకటి. కార్తికేయుడి పూజ అంటే అగ్ని ఉపాసనతో మమేకమై ఉంటుందని చెప్తారు. నిత్యపూజలో చేసే దీపారాధన శివశక్త్యాత్మకుడైన, అగ్ని సంభవుడైన సుబ్రహ్మణ్యుణ్ని ఆరాధించడమే అవుతుంది. భక్తుడు వెలిగించే గోరంత దీపమే సుబ్రహ్మణ్య రూపంగా కొండంత అండగా నిలుస్తుందని భావిస్తారు. ‘కొందరు భక్తులు శివుడిని పూజిస్తారు. కొందరు అమ్మవారిని పూజిస్తారు. అలా కాక ఏకకాలంలో ఇద్దరినీ కలిపి పూజించాలంటే సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తే చాలు’ అని కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖర మహాస్వామి పేర్కొన్నారు. శివుడి దివ్య తేజస్సుతో జన్మించిన కార్తికేయుడి ఆరాధన సాధకులకు విజ్ఞానంతోపాటు ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.

డాక్టర్‌ పార్నంది రామకృష్ణ

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement