భగవంతుడంటే మానవజాతి నుంచి వేరుగా, సుదూరంగా ఉండేవాడని కాదు. తన ధామం నుంచి దిగివచ్చి ఈ లోకంలో వివిధ అవతారాలలో మనకు దర్శన మిస్తాడు. తన అవతార ప్రయోజనాన్ని భగవద్గీతలో తానే స్వయంగా వివరించాడు కూడా. శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ కోసం తాను యుగయుగంలోనూ అవతరిస్తానని మరీ ప్రకటించాడు. అంతేగాక, మానవజాతి శాంతియుతంగా, సంతోషంగా, సుసంపన్నంగా ఉండేందుకు తగిన ధర్మ సంస్థాపన కూడా గావిస్తాడు.
భగవంతుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. తన సంకల్ప మాత్రంగా ఏ రూపంలోనైనా లోకంలో అవతరించగలడు. నరసింహుడై స్తంభంలో ఉద్భవించగలడు. బ్రహ్మదేవుడి నాసికా రంధ్రం నుంచి వరాహమూర్తిగా జనించగలడు! తనకు నచ్చిన విధంగా తన భక్తులకు దర్శనమిచ్చి తగిన సేవా భాగ్యాన్ని ప్రసాదించగలిగే సర్వస్వతంత్రుడు ఆ దేవాదిదేవుడు. అలాంటి ఒక రూపమే మందిరంలోని భగవంతుడి అర్చావతారం. దేవాలయంలోని మూర్తి రాతితోనో, లోహంతోనో నిర్మితమైన వస్తువు కాదు. అది సాక్షాత్తూ భగవంతుడే.
పరబ్రహ్మ స్వరూపుడైన దేవదేవుడు మూడు విధాలుగా వ్యక్తమవుతాడని శాస్ర్తాలు నిశ్చయంగా నిరూపిస్తున్నాయి. అవి..
1. నిరాకార, వైవిధ్య రహితమైన బ్రహ్మజ్యోతిగా పిలిచే సర్వ వ్యాపకత్వం.
2. ప్రతి జీవి హృదయాంతరంలో కొలువై ఉన్న పరమాత్మ తత్వం.
3. షడైశ్వర్య సంపూర్ణుడై మూర్తీభవించిన భగవత్ తత్త్వం. సకల ఇతర భగవత్ తత్త్వాలకు ఇదే మూలం.
బ్రహ్మజ్యోతికి తానే ఆధారమని భగవద్గీతలో శ్రీకృష్ణుడు వివరించాడు. సకల చరాచర జీవుల హృదయాలలో పరమాత్మగా ఉన్నది తానేనని అందులో చెప్పాడు. భగవద్గీత 12వ అధ్యాయంలో తాను కేవలం సగుణాత్మక ఆరాధన ద్వారా మాత్రమే ప్రసన్నుడనవుతానని శ్రీకృష్ణుడు తెలియజేశాడు.
దేవాలయంలో అర్చా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలంటే ఆగమ శాస్త్ర నియమ నిబంధనలను అనుసరించాలి. శాస్త్రంలో చెప్పినట్టు మొదట స్థపతితో భగవంతుడి విగ్రహాన్ని తయారు చేయించాలి. స్థపతి శిల్ప శాస్త్ర నియమాలను అనుసరిస్తూ శిలతోగానీ, పంచలోహాలను ఉపయోగించి గానీ విగ్రహాన్ని చెక్కుతాడు. సరైన కొలతలు, పరిమాణాలతో రూపాన్ని మలుస్తూ, శాస్ర్తాలలో వివరించిన ప్రకారం భగవంతుడి అకృతిని తీర్చిదిద్దుతాడు. అలా సిద్ధమైన విగ్రహాన్ని ఆగమ శాస్ర్తాలు, పాంచరాత్ర నిబంధనలను అనుసరించి సుముహూర్తంలో ప్రతిష్ఠిస్తారు.
ప్రపంచవ్యాప్త హరేకృష్ణ ఉద్యమ సంస్థాపక ఆచార్యులైన శ్రీల ప్రభుపాదుల వారు ఈ విధంగా వివరించారు. “భక్తి-సందర్భ’ అను గ్రంథంలో ఆచార్య శ్రీల జీవ గోస్వాముల వారు భక్తిమార్గంలో ఉన్న నిష్ఠాగరిష్ఠులైన భక్తులు మట్టి, లోహం, శిల, దారువు (కలప)తో చేసిన భగవంతుడి అర్చా రూపానికి, భగవంతునికి స్వయం రూపానికి మధ్య ఎలాంటి భేదం చూపరని అంటారు. భౌతిక ప్రపంచంలో ఒక వ్యక్తి, అతనికి సంబంధించిన ఛాయాచిత్రం, విగ్రహం మధ్య భేదం ఉంటుంది. అవి వ్యక్తితో భిన్నమైనవి. కానీ, సర్వ సంపూర్ణుడైన భగవంతుడి విషయంలో మాత్రం స్వామికి, స్వామివారి మూర్తులకు ఎలాంటి భేదమూ ఉండదు. ఒక భక్తుడు ఆలయంలోని మూర్తికి ఏదైనా నివేదిస్తే అది సాక్షాత్తు స్వామికి నివేదించినట్టే. అలా భగవంతుడికి అర్పించిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా భక్తుడు సకల దుఃఖాల నుంచి ఉపశమనం పొందుతాడు’ అని పేర్కొన్నారు.
పైన వివరించినట్లుగా, భగవంతుడు తన సంకల్పమాత్రంగా ఏ రూపంలోనైనా లోకంలో అవతరిస్తాడు. ప్రస్తుత యుగంలో భగవంతుడు శబ్ద రూపంలో అవతరిస్తాడని వేదశాస్ర్తాలు వివరిస్తున్నాయి. భగవన్నామ సంకీర్తనంలోని ఆ దివ్య శబ్ద ప్రకంపనలే భగవంతుని స్వరూపం.
హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ, రామ రామ హరే హరే
ప్రతిరోజూ ఈ మహామంత్రాన్ని జపించడమే ఈ యుగానికి నిర్దేశితమైన అర్చా విధానం.