ముహర్రం’ పేరు వినగానే ఇమామె హుసైన్ (రజి) గుర్తుకొస్తారు. ముహమ్మద్ ప్రవక్త (సఅసం) మనుమడైన ఇమామె హుసేన్ ‘కర్బలా’ మైదానంలో వీరోచితంగా పోరాడి అసువులు బాసిన ఘటన కండ్లముందు కదలాడుతుంది. న్యాయం కోసం, ధర్మం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇమామె హుసైన్ చేసిన త్యాగాన్ని ఏటా ముహర్రం పదో తేదీన గుర్తుచేసుకుంటారు. ‘రంజాన్’ నెల ఉపవాసాల తర్వాత ముహర్రం నెల ఉపవాసాలు ప్రముఖమైనవని మహాప్రవక్త తెలిపారు. ఇది అల్లాహ్ నెల అని పేర్కొన్నారు. యౌమె ఆషూరా ఉపవాసం పాటించడం వల్ల గత ఏడాది చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని పేర్కొన్నారు. ముహర్రం నెల పదో తేదీని ‘ఆషూరా’ అంటారు. ముహమ్మద్ ప్రవక్త (స) తదనంతరం పాలించిన తొలి నలుగురు ఖలీఫాలూ ప్రజాస్వామ్య పద్ధతిలో ధర్మబద్ధంగా పాలించారు. ఆ తర్వాత ప్రజలు ప్రజాస్వామ్య బద్ధంగా హజ్రత్ హసన్ (ర) గారిని పాలకుడిగా ఎన్నుకున్నారు. కాని నాటి సిరియా గవర్నర్ హ.అమీర్ ముఆవియా (ర) అధికారం కోసం హజ్రత్ హసన్ (ర)తో పోటీ పడ్డారు. ఫలితంగా ఇరువర్గాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. శాంత స్వభావుడైన హసన్ (ర) యుద్ధ నివారణకు హ.ముఆవియా (ర)తో కొన్ని షరతులతో కూడిన ఒప్పందం చేసుకొని ఖలీఫా పదవి నుంచి తప్పుకొన్నారు.
అయితే హ.అమీర్ ముఆవియా తన అవసాన దశలో తన కొడుకు యజీద్ను తన రాజకీయ వారసుడిగా ప్రకటించారు. ఈ పరిణామాన్ని ప్రజాస్వామ్యవాదులు జీర్ణించుకోలేకపొయారు. హసన్ తమ్ముడైన ఇమామె హుసైన్ (ర)కు మద్దతు ప్రకటిస్తూ ఆహ్వానించారు. అప్పుడు ఇమామె హుసైన్ తన బాబాయి కొడుకైన ముస్లిమ్ బిన్ అఖీల్ను తన దూతగా కూఫాకు పంపారు. ఈ పరిణామాలన్నీ తెలుసుకున్న యజీద్ దూతను చంపించి, ఇమామ్ను కూఫాకు రాకుండా అడ్డుకోవాలని సేనాధిపతిని ఆదేశించాడు. దూత హత్యకు గురయ్యాడని తెలిసినా ముందుకు వెళ్లాలనే ఇమామ్ నిర్ణయించుకున్నారు. ఇమామ్ బృందాన్ని ‘కర్బలా’ దగ్గర యజీద్ సేనాధిపతి అడ్డుకున్నాడు. అప్పుడు ఇమామె హుసైన్ సేనాధిపతితో రాజీకి ప్రయత్నించినా యజీద్ సైన్యం అంగీకరించకుండా ఆయన పరివారాన్ని నిర్బంధించడానికి పూనుకొన్నాడు. గత్యంతరం లేని స్థితిలో ఇమామె హుసైన్ యజీద్ సైన్యంతో భీకరమైన పోరు చేయాల్సి వచ్చింది. ఆ సమరంలో వేల సంఖ్యలో ఉన్న పెద్ద సైన్యాన్ని ఇమామె శిబిరంలోని 72 మంది వీరోచితంగా ఎదుర్కొన్నారు. చివరికి యుద్ధంలో ఇమామె హుసైన్ ఒక్కరే మిగిలారు. ఆయన కూడా ధర్మ పరిరక్షణ కోసం పోరు సల్పుతూ హి.శ.61, ‘ముహర్రం’ నెల, పదో తేదీన వీరమరణం పొందారు. ఆయన త్యాగాన్ని స్మరిస్తూ ముస్లిం సమాజం ముహర్రం ఆచరిస్తుంది.