ఒకానొక వేటగాడు చెరువులోకి గాలం విసిరాడు. గాలానికి వేలాడుతున్న చిన్న మాంసం ముక్కను ఓ చిన్నచేప నోటకరవబోయింది. అంతలోనే పెద్దచేప దాన్ని వారించింది. ‘ఆ ఎరను తాకావో.. వేటగాడు నిన్ను అమాంతంగా లాగేస్తాడు. నిన్ను వండుకొని హాయిగా భుజిస్తాడు’ అని చెప్పింది. చిన్నచేప ఆ మాటలు పట్టించుకోలేదు. ఈ ముసలి చేప పనికిమాలిన ముచ్చట్లు చెబుతున్నదని భావించింది. గాలానికి వేలాడుతున్న మాంసం ముక్కను నోట కరిచింది.
మరుక్షణం మాంసానికి ఉన్న ముల్లు చేప గొంతులో గుచ్చుకుంది. వేటగాడు గాలం లాగడంతో చేప వచ్చి ఒడ్డున పడింది. పెద్దచేప చెప్పిన సంగతులన్నీ చిన్నచేప మనసులో కదలాడాయి. ప్రాపంచిక జీవితంలోని తళుకు బెళుకుల మాయలోపడి చిన్నచేపలా మోసపోతున్నారని చెప్పడానికి ఉలేమాలు ఈ కథను చెబుతుంటారు. ఈ జీవితం తాత్కాలికం, పరలోక జీవితం శాశ్వతం అన్న ప్రవక్తల ప్రబోధాలను, ఖురాన్ హెచ్చరికలను పెడచెవిన పెట్టి.. మృత్యువు అనే ముల్లు గుచ్చుకోగానే పశ్చాత్తాపపడితే ప్రయోజనం ఉండదు. మనిషి చనిపోయాక జరిగే పర్యవసానాల గురించి ప్రవక్తలు విడమర్చి చెప్పారు. చెరువులో పెద్దచేపలా జీవితాన్ని గడిపేవారే వివేకవంతులు, బుద్ధిజీవులు.
– ముహమ్మద్ ముజాహిద్