Karwa Chauth | పండగ ఏదైనా.. మన సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబిస్తాయి. ఇంటిల్లిపాదీ, బంధువులతో కలిసి జరుపుకునే పండుగలు కొన్నైతే, ఆడవారు మాత్రమే జరుపుకే పండుగలు మరికొన్ని. వాటిల్లో శ్రావణమాసం, కార్తీకమాసాలతోపాటు కర్వా చౌత్ (Karwa Chauth) కూడా ఒకటి. భర్త క్షేమం కాంక్షిస్తూ మహిళలు నిష్టగా నోచే నోము ఇది. దీన్నే దక్షిణాదిలో ‘అట్ల తద్ది’గా చేసుకుంటారు. గురువారం నాడు దక్షిణాదిలో అట్ల తద్దిని మహిళలు ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. నేడు ఉత్తరాది రాష్ట్రాల్లోని మహిళలు కర్వాచౌత్ వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆ నోము విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తరాది మహిళలు ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, జమ్ము, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కర్వా చౌత్ ఉపవాసం సాంప్రదాయకరంగా సాగుతుంది. పౌర్ణమి తర్వాత నాలుగో రోజు ఈ పండుగ వస్తుంది. ఆరోజున జీవిత భాగస్వామి, కుటుంబ క్షేమాన్ని కోరుతూ మహిళలు పార్వతీ దేవికి నిష్టగా పూజలు చేస్తారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ ఉపవాసం ఉంటారు. సాయంత్రం చంద్రుడి దర్శనం చేసుకుంటారు.
జల్లెడలో ముందుగా చంద్రుడిని చూసి ఆ తర్వాత భర్త ముఖాన్ని చూస్తారు. భర్త ఆశీర్వాదాల అనంతరం ఉపవాస దీక్షను విరమిస్తారు. పెళ్లికాని యువతులు కూడా ఉపవాస దీక్ష చేస్తారు. మంచి భర్త రావాలని కోరుకుంటూ పార్వతీ దేవిని పూజిస్తారు. అనంతరం కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి విందులో పాల్గొంటారు.
ఇక ఈ పండుగకు విభిన్న నేపథ్యాలు ఉన్నాయి. అప్పట్లో రాజ్పుత్ పురుషులు తమ భార్య, పిల్లల్ని వదిలేసి తరచూ యుద్ధానికి వెళ్లేవారు. దీంతో తమ భర్తలు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ మహిళలు భక్తితో ఉపవాస దీక్ష చేసేవారు. వారికోసం ప్రత్యేకమైన వంటకాలు సిద్ధం చేసి.. సాయంత్రం భర్త కోసం వేచి చూస్తుండేవారు. అప్పటి నుంచే ఈ కర్వాచౌత్ పండుగ ప్రాశస్త్యం పొందిందని చెబుతుంటారు.
వాయువ్య ప్రాంతంలో ఈ పండుగను మరో విధంగా చేసుకుంటారు. శరదృతువులో పంట చేతికి రాగానే ఈ పండుగను జరుపుకుంటారు. గోధుమలను నిల్వ ఉంచే పెద్ద మట్టి కుండలను ‘కర్వాస్’ అని పిలుస్తారు. ఆ రోజున పెద్ద పెద్ద మట్టి కుండల్లో గోధుమలను నింపి శివపార్వతులకు సమర్పిస్తారు. అదేవిధంగా మహిళలు తమ బంధువుల్ని, స్నేహితుల్ని కలిసి బహుతులు ఇచ్చిపుచ్చుకుంటుంటారు.
ఇక కర్వా చౌత్ రోజున మహిళలు పెళ్లి కూతుళ్లలా ముస్తాబవుతారు. కొందరు పెళ్లి నాటి దుస్తులు, నగలు ధరిస్తే.. మరికొందరులెహంగా, చీర వంటి కొత్త బట్టలతో సంప్రదాయబద్ధంగా రెడీ అవుతారు. ఆ రోజున ఎక్కువగా ఎరుపు, నారింజ రంగు దుస్తులనే ధరిస్తారు. చేతి నిండా గాజులు, నుదుటన కుంకుమతో అందంగా ముస్తాబై అమ్మవారిని కొలుస్తారు. కర్వా చౌత్ పండుగ భార్యా భర్తల మధ్య బంధాన్ని దృఢం చేస్తుందని నమ్ముతారు.
కర్వా చౌత్ రోజున అత్తగారు కోడలికి ప్రత్యేక వంటకం తయారు చేస్తారు. దాన్ని సంప్రదాయ ‘సర్గి’ (థాలి) అంటారు. ఉపవాసం ఉండే కోడలికి అత్తగారు ‘సర్గి’ని చేసి అందించడం ఆనవాయితీ. మన దగ్గర అట్లతద్దిలో మాదిరిగానే కర్వాచౌత్ రోజున ఉపవాస దీక్ష తీసుకోబోయే కొన్ని గంటల ముందు ‘సర్గి’ని ఆహారంగా తీసుకుంటారు. ఈ థాలిలో స్వీట్లు, పండ్లు, పాలు, పెరుగు, డ్రైఫ్రూట్స్ వంటి ప్రత్యేక పదార్థాలు ఉంటాయి. అత్తగారి ఆశీర్వాదంతో కోడళ్లు సూర్యోదయానికి ముందే దీన్ని తీసుకుంటారు.
Also Read..
Atla Tadde | నేడు అట్ల తద్ది.. ఈ విశేషాలు తెలుసా..?