Atla Tadde | నేడు అట్లతద్ది (Atla Tadde).. తెలుగువారి ముఖ్యమైన పండుగల్లో ఇది ఒకటి. తెలుగు పంచాంగం ప్రకారం ఆశ్వయుజ బహుళ తదియ రోజున అట్లతద్ది పండుగ జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 09, గురువారం రోజు ఆశ్వయుజ బహుళ తదియ. దీన్ని ఉయ్యాల పండుగ, గోరింటాకు పండుగ అని కూడా పిలుస్తారు. నార్త్‌లో అయితే, ఈ పండుగను కర్వా చౌత్ పేరుతో పిలుస్తారు.
గౌరీదేవి శివుడిని భర్తగా పొందాలనే కృత నిశ్చయంతో ఉందని త్రిలోక సంచారి అయిన నారదుడు తెలుసుకుని.. ఆ కోరిక ఫలించాలంటే అట్లతద్ది వ్రతం చేయమని సూచిస్తాడు. ఆయన ప్రోద్బలంతో గౌరీ దేవి ఈ వత్రం ఆచరించి శివుడిని భర్తగా పొందినట్లు పురానాలు చెబుతున్నాయి. ఇది స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం. పెళ్లి కానీ అమ్మాయిలు తమకు మంచి భర్త రావాలని ఈ నోము ఆచరించగా.. పెళ్లి అయిన స్త్రీలు తమ సౌభాగ్యం కలకాలం ఉండాలని కోరుకుంటూ ఈ నోము చేసుకుంటారు.
అట్ల తద్ది ముందురోజు కాళ్ళు, చేతులకు అందంగా గోరింటాకు పెట్టుకుంటారు. గుమ్మాలకు తోరణాలు కడతారు. రాత్రి గౌరీ దేవిని పూజించి అన్నాన్ని ప్రసాదంగా పెడతారు. ఇక అట్ల తద్ది రోజు ఆడవాళ్ళు తెల్లవారుజామున నిద్రలేచి తల స్నానం చేసి సూర్యభగవానుడు రాకముందే రాత్రి గౌరీదేవికి నైవేద్యంగా పెట్టిన అన్నాన్ని 11మంది ముత్తైదువులతో కలిసి ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇక రాత్రి చంద్రోదయం వరకూ ఉపవాసం ఉంటారు.
ఇంట్లోని తూర్పుదిక్కున మంటపము ఏర్పాటు చేసి గౌరీదేవి పూజ చేస్తారు. ధూప, దీప, నైవేద్యాలు సమర్పించి గౌరీ పూజను పూర్తి చేయాలి. అట్లతద్ది రోజు మహిళలు సరదాగా విహారానికి వెళ్తారు. చెట్లకు ఊయళ్లు కట్టి సరదాగా ఊగుతూ కాలక్షేపం చేస్తారు. అందుకే అట్ల తద్దిని ఆటల తదియ అని కూడా పిలుస్తారు. విహారంలో సేకరించిన ఆకులు, పూలతో సాయంత్రానికి ఇంటికి చేరుతారు. వాటితో గౌరీ దేవిని పూజించి.. సాయంత్రం చెరువుల్లో దీపాలు వదులుతారు.
సాయంత్రం చంద్ర దర్శనం అనంతరము గౌరీ దేవికి పూజ చేస్తారు. మినుములు పిండి, బియ్యము పిండి కలిపి అట్లను తయారు చేసి 11 అట్లను నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం ముత్తైదువులకు 11 అట్లు, 11 ఫలాలను వాయనంగా ఇస్తారు. బియ్యం చంద్రునికి, మినుములు రాహువుకి సంబంధించిన ధాన్యం. ఈ రెండింటితో అట్లు చేసి వాయనంగా ఇవ్వడం వల్ల ఆ గ్రహాలు శాంతించి, దోషాలేమైనా ఉంటే తొలగిపోతాయని నమ్మకం. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనముగా ఇవ్వాలి. గర్భస్రావము రాకుండా, సుఖప్రసవం అయ్యేందుకు దోహదపడుతుంది కూడా. అందుకే ముత్తైదువులకు అట్లను వాయనముగా ఇస్తారు.
తాంబూలాలు ఇచ్చిన అనంతరం 11 మంది ముత్తైదువులకు భోజనాలు పెట్టి తాము కూడా ఉపవాసాన్ని విరమించాలి. 11 రకాల ఫలాలను తినడం, 11 సార్లు తాంబూలం వేసుకోవడం, 11 సార్లు ఊయల ఊగడం, గోరింటాకు పెట్టుకోవడం.. ఈపండుగలో విశేషము. ఈ పండుగ రోజు ఆడవాళ్ళు తమ భర్తలు ఆయురారోగ్యాలతో పదికాలాలపాటు సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అట్లతద్ది జరుపుకుంటారు.
Also Read..