శుకముని పరీక్షిత్ భూజానితో… అవనీపతీ! అక్రూరుని సమాధానం విని దిక్కు తోచని శతధన్వుడు ఆ మణిని అక్రూరుని కడనే పడవేసి గుండెల్లో దడ పుట్టగా తురగం- గుర్రమెక్కి త్వరత్వరగా శత-నూరు యోజనాల దూరం పారిపోయాడు. పోయి పోయి మిథిలా నగరం చేరి గుర్రం దిగి పాదచారియై పరుగెత్తి పోతూండగా శౌరి, ఓరీ! పారిపోకు- అంటూ అతనిని వెంటాడి చక్రం ప్రయోగించి వక్రబుద్ధి గల వాని తలను ఉత్తరించాడు- నరికాడు. అతని వలువలను ఎంత వెతికినా స్యమంతకం కనిపించకపోవడంతో కంసాంతకుడు ద్వారకాధీశుడు బలదేవుని చెంతకు చేరి ‘శతధన్వుడు ఊరక మరణించాడు. అతని వద్ద మణి లేద’ని తెలిపాడు. హలధారి- బలరాముడు ఖలవిదారి (దుష్ట శిక్షకుడు) కృష్ణునితో- ‘తమ్ముడూ! శమంతక మణిని శతధన్వుడు చేజిక్కించుకున్నాడన్నది నిక్కము. నీవు గ్రక్కున- వెంటనే ద్వారక చేరి మణిని ఎక్కడ దాచి పెట్టాడో వెతికించు. నేను జనక భూపాలుని దర్శనం కొరకు మిథిలకు వెళ్లివస్తా’ అని పలికి గోపాలదేవుని పంపించాడు. జనక మహారాజు ప్రార్థించగా ప్రలంబాంతకుడు- ముసలాయుధుడు (బలదేవుడు) మిథిలా నగరంలో కొన్ని సంవత్సరాలు ఉండిపోయాడు.
కం॥ ‘చలమున గాంధారేయుడు
లలిత గదా యుద్ధ కౌశలము నేర్చె దగన్
హలి చే నాశ్రిత నిర్జర
ఫలిచే ద్వైలోక్య వీర భట గణ బలిచేన్’
ఆ సమయంలో కలి పురుషుడు దుర్యోధనుడు మిథిలకు తరలి- వెళ్లి జనకునిచే ఘనంగా అలరించ- సంతోషబెట్టబడిన వాడై, ఆశ్రిత నిర్జర ఫలి- ఆశ్రయించిన వారికి కల్పవృక్షం వంటి వాడు, ముల్లోకాల్లో ఎల్ల గదా యోధులలో తల్లజుడు- శ్రేష్ఠుడు అయిన హలి- బలరాముని చెంత చలము- పట్టుదలతో గదాయుద్ధ కౌశలం సర్వం నేర్చుకొన్నాడు.
శుకయోగి- రాజా! ద్వారక చేరి హరి, సత్యభామకు నిత్యం అగత్యంగా- తప్పక ప్రియకరుడు కాన, సత్రాజిత్తుకు పరలోక క్రియలు జరిపించాడు. శతధన్వుడు సుధన్వు- సుందరమైన శార్ఙ ్గమనే ధనస్సు గల మందర గిరిధరు (కృష్ణు)నిచే నిహతుడైనాడని విని అక్రూర కృతవర్మలు ఉభయులూ భయకంపితులై- హడలిపోయి ధైర్యం సడలగా ద్వారకా నగరం వదలి సుదూర ప్రాంతాలకు వెడలిపోయారు. అక్రూరుడు నిష్క్రమించిన తరువాత ద్వారకలో అనావృష్టి వంటి అనేక ఉపద్రవాలు, మానవులకు శారీరక, మానసిక తాపాలు సంభవించాయి.
అంతట, ద్వారకలోని కొందరు వయోవృద్ధులు భయపడి కడలి శయనుని- కృష్ణునితో ఇలా విడమరచి నుడివారు… ‘వార్ణేయా (కృష్ణా)! కాశీరాజు రాజ్యంలో వర్షాలు పూజ్య- శూన్యమైనప్పుడు ఆయన, అక్రూరిని తండ్రి- పుణ్యరాశి అయిన శ్వఫల్కుని రప్పించి, గాందిని అనే తన కుమార్తెనిచ్చి సత్కరించగా పుష్కలంగా వానలు కురిసాయి. పుష్కరేక్షణా!- కమలాక్షా! వాసికెక్కిన శ్వఫల్క తనయుడు అక్రూరుడు కూడా అంతటివాడే! మహా తపస్వి, పరమ భాగవతుడు. అతగాడు తిరిగివస్తే ఈ ఉత్పాతాల వెతలు- బాధలు తొలగిపోతాయి. హితకరమైన వర్షాలు పడతాయి. దేవరా! ఇలా అన్నందుకు మన్నించండి. అతనిని రావించి ప్రజల పీడను తప్పించండి’. శుకదేవుడు.. రాజా! ఇది కొందరి మతమే- అభిప్రాయమే కాని సర్వ సమ్మతం కాదు. ఎందుకనగా, సకల ఋషి మునులకు నివాసభూతుడైన అకలంకుడు భగవంతుడు వాసుదేవుడు నివసించే ద్వారకలో, ఆయన అండదండలలో అనావృష్టి, ఆధివ్యాధులు ఇత్యాది ఉపద్రవాలు ఉండగలవా? పరమాత్మ సంకల్పం లేనిదే ఇలా జరగదు అని పరమార్థం!
అలా అన్న పెద్దల మాటలు విని శ్రీకృష్ణుడు దూతల ద్వారా అక్రూరుని రప్పించి అర్చించాడు. లోక మర్యాదలను ఎరిగిన శ్రీకరుడు శ్రీధరుడు అతనికి వ్యథలు తొలగించే కొన్ని ప్రియ కథలు వినిపించి, మృదు మధురంగా ఇలా ముచ్చటించాడు- ‘అక్రూరా! శతధన్వుడు ద్వారకను విడిచి వెళుతూ మణిని నీకడ దాచి ఉంచిన విషయం తెలిసింది. సత్రాజిత్తుకు పుత్ర సంతానం లేదు. కాన, అతని విత్తాన్ని- ఆస్తిని, అప్పుని కూడా సత్రాజిత్తు పుత్రికలే పంచుకుంటారు. దుర్మరణం పాలైన సత్రాజిత్తుకు సద్గతులు కలగడానికై సత్కర్మలు జరగాలి. మహానుభావా! మీరు సువ్రతులు- వ్రతనిష్ఠులు, పవిత్రాత్ములు. మీరు తప్ప ఆ మణిని భరించగలవారలు లేరు. అది మీ వద్దనే ఉండాలి. కాని, ఇద్ధ- శుద్ధ చరితా! నాకు పెద్ద చిక్కు ఒకటొచ్చి పడ్డది. మా అన్నగారికి ఆ మణిని గురించి నా మీద బహు చెడ్డ అపనమ్మకం ఏర్పడ్డది. కనుక, దానిని మా బంధువులందరికీ చూపించు. నీ గృహంలో హాటక- బంగారు వేదికల మీద యజ్ఞకార్యాలు నిత్యమూ నిరాటంకంగా కొనసాగుతాయి’. ‘భగవాన్ భక్త భక్తిమాన్’ అంటుంది భాగవతం- భక్తుల యందు భక్తి కలిగి ఉండటం భగవంతుని స్వభావమట! పరమ భక్తుడైన అక్రూరుని మహిమ లోకానికి విదితం చెయ్యడమే ఇక్కడ అహి- కాళియ మర్దనుని అభిమతం.
శుకుడు- భారతా! సారసాక్షుడు కృష్ణుడు ఇలా సాంత్వన- ఊరడింపు వాక్యాలు పలుకగా అక్రూరుడు వలువ- దుస్తుల్లో దాచి తెచ్చిన మహా విలువైన ఆ స్యమంతకాన్ని పలువురి ముందు వెలువరించి- బయటపెట్టి గోవిందునికి సమర్పించాడు.
ఉ॥ ‘సంతసమంది బంధుజన సన్నిధికిన్ హరి దెచ్చి చూపె న
శ్రాంత విభాసమాన ఘృణి జాల పలాయిత భూనభోంతర
ధ్వాంతము హేమభార చయవర్షణ విస్మిత దేవ మానవ
స్వాంతము గీర్తి పూరిత దిశావలయాంతము నా స్యమంతమున్’
శ్రీకాంతుడు కృష్ణుడు సంతసించి అశ్రాంతం- నిరంతరం తన ఆలోక- కాంతి కిరణాలచే లోకాల ధ్వాంతం (చీకట్లను) పలాయితం చేయ- పోగొట్టగలదీ, తను అను నిత్యం ప్రసాదించే జాతరూపం- కలధౌతం (బంగారం)తో దేవ మానవుల స్వాంతా- అంతరంగాలకు వింత గొలిపేదీ, దిగంతాల వరకు కీర్తిని సంతరించుకున్నదీ అయిన స్యమంతక మణిని తన బంధు సంతతి- వర్గానికి చూపించి మనశ్శాంతి పొందాడు.
కం॥ ‘చక్రాయుధుడీ క్రియ దన
యక్రూరత్వంబు జనుల కందరకును ని
ర్వక్రముగ దెలిపి క్రమ్మర
నక్రూరునికిచ్చె మణి కృపాకలితుండై’
చక్రాయుధుడు ఇలా అవక్రపరాక్రమంతో తన అక్రూరత్వాన్ని- నిష్కలంకత్వాన్ని (నిర్దోషిత్వాన్ని) నిర్వక్రం- సరళంగా, స్పష్టంగా ప్రజలందరికీ ఎరిగించి స్యమంతకాన్ని తిరిగి అక్రూరునికి ఇచ్చివేశాడు. ఈ ఘటన వలన శఫల్కతనయు- అక్రూరునికి కొంత అపఖ్యాతే కలిగింది. ఎందుకనగా భగవంతుని కృపకు భక్తి జ్ఞాన వైరాగ్యాలే అంతిమ ఫలాలు కాని ధన కనక వస్తు వాహనాలు, గృహ ఆరామ క్షేత్రాలు కావని పవిత్ర భాగవతం సిద్ధాంతం!
కం॥ ‘ఘనుడు భగవంతు డీశ్వరు
డనఘుడు మణి దెచ్చి యిచ్చినట్టి కథనమున్
వినిన బఠించిన దలచిన
జనులకు దుర్యశము బాప సంఘము దలగున్’
శుకుడు- రాజా! అనఘుడు- పాపరహితుడూ, ఘనుడూ, పరమేశ్వరుడూ అయిన హరి- శ్రీకృష్ణుడు స్యమంతక మణిని తెచ్చి ఇచ్చిన కథను విన్నా, చదివినా, తలచినా జనుల దురితాలు- పాపాలు, దుర్యశం- అపకీర్తి తొలగిపోతాయి’ అని పరీక్షిత్తుకి ఈ గాథా సుధాపానము వలని అబాధమైన- తిరుగులేని ఫలశ్రుతిని వినిపించాడు బాదరాయణి ముని.
‘అర్థమనర్థం భావయ నిత్యం’ (శంకరుల భజగోవింద స్తోత్రం), ‘తస్మాదనర్థమర్థాఖ్యం’ (శ్రీమద్భాగవతం)- పేరుకు మాత్రమే ‘అర్థం’- సంపద కాని, అది మట్టుకు లోకంలో అనేక అనర్థాలకు- ఆపదలకు దారితీస్తుందన్న అపఖ్యాతిని మూటకట్టుకున్న తీరును ఈ స్యమంతక ఉపాఖ్యానం చక్కగా నిరూపిస్తుంది. మొట్టమొదటగా మణి సత్రాజిత్తు నుంచి ప్రసేనజిత్తుకు చేరింది. అతగాడిని మహామాయా (దుర్గా) దేవి వాహనం స్వాహా చేసింది. శ్రీపతి- శ్రీకృష్ణుడు బాహ్యంగా తనపై వచ్చిన అపనిందను పోగొట్టుకోవడానికి మణి కోసం వెళ్లినట్లున్నా, నిజానికి జాంబవతిని శ్రీమతిగా స్వీకరించడానికే వెళ్లాడు. సత్యభామ వివాహ సందర్భంలో కూడా ఆయన మణిని అంగీకరించలేదు.
తరువాత ఆ మణి సత్రాజిత్తు, శతధన్వుల వధకు కారణమయింది. అనుమానం పెనుభూతమన్నారు. అది బలరామన్ననే ఆవహించింది. ‘అర్థం’ విషయంలో అనాది, సర్వాది (విష్ణునామాలు) అయిన అచ్యుతునిపై ఆదిశేషు-బలరామునికి కూడా అనుమానం రావచ్చునన్నదే పరమార్థం! రుక్మిణి పట్టమహిషి, పెద్దది కాన తానే ఆ మణికి అధికారిణి అని భావించింది. తన తండ్రిదే కాన తననే వారసురాలుగా సత్యభామ, జాంబవతి అయితే తనకు తండ్రే కట్నకానుకగా ఇచ్చాడని తలచారు. కుబేరుని అనుచరుడైన శంఖచూడుని సంహరించి మురారి- కృష్ణుడు వాని తలలోని మణిని గ్రహించి దానిని బలరామునికిచ్చి మురిపించాడు. ఈసారి కూడా స్యమంతకాన్ని శౌరి తనకే ఇస్తాడని ప్రలంబారి- బలరాముడు ఆశపడ్డాడు. ఈ తలనొప్పి తొలగించుకోవడానికి హరి మణిని అక్రూరుని వద్దకు చేర్చాడు. తనకు చెడ్డపేరు వచ్చినా భక్తుడు అక్రూరుడు భరించి భగవంతుని ఈ సమస్యల నుంచి బయటపడేశాడు.
-తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ ,98668 36006