ప్రభువు దైవ రాజ్యం గురించి ప్రబోధిస్తూ ప్రజలతో మమేకమైపోయాడు. ప్రజలూ ఆయన చెప్పే నిజాయతీ గల మాటలు వింటూ లీనమైపోయేవారు. వారంతా ఎప్పుడూ ప్రభువుతోనే ఉండేవారు. అక్కడే తినేవారు. ఈ పరిస్థితిని గమనించిన సంపన్నులు కొందరు భక్తులకు కావాలసినవన్నీ సమకూరుస్తూ ఉపచార సేవ చేస్తుండేవారు. ఇదిలా ఉండగా తన కొడుకు ఎక్కడ ఉన్నాడో? ఎలా ఉన్నాడో? ఏం తిన్నాడో? అనుకుంటూ తల్లి మరియ, ప్రభువు సోదరులను వెంట పెట్టుకొని కొడుకు దగ్గరికి ఆందోళనగా వచ్చింది. అప్పుడు ప్రభువు సన్నిధి గుంపులు గుంపులుగా జనాలతో చాలా రద్దీగా ఉంది.
వారిని నెట్టుకొని వెళ్లే పరిస్థితి లేదు. అప్పడు మరియ అక్కడి అనుచరులను పిలిచి.. తాము ఏసును కలవడానికై ఇక్కడికి వచ్చినట్టుగా చెప్పమన్నారు. వాళ్లు వెళ్లి.. ‘ప్రభూ! మీ తల్లి, సహోదరులు మిమ్మల్ని చూడగోరి వెలుపల వేచి ఉన్నారు’ అని చెప్పారు. అప్పుడు ప్రభువు ‘దేవుని వాక్యము విని, దాని ప్రకారం నడచు వీరే, నా తల్లి, నా సహోదరులు’ అని వారితో చెప్పారు. అయితే, అప్పుడు ఆయన చుట్టూ ఉన్నది పరాయివారే! పండెండు మంది శిష్యులు, అపవిత్రాత్మ వ్యాధుల్ని పోగొట్టుకున్న కొందరు స్త్రీలు, ఏడు దయ్యాలు వదలిపోయిన మగ్దలేనే అనే మరియ, హేరోదు రాజ గృహ నిర్వాహకులూ.. ఇలాంటి వారే ప్రభువు చుట్టూ ఉన్నారు. ప్రభువు వారిని చూపుతూ ఈలాంటి బాధితులే నాకు ఆత్మీయులు, బంధువులు అని నిర్మొహమాటంగా చెప్పారు. ఇదే ఆయన బాంధవ్యం. ఈ మాటపైనే ఆయన చివరి వరకూ నిలిచారు.
…? ప్రొ॥బెర్నార్డ్ రాజు, 98667 55024