హృదయాత్సంపరిత్యజ్య సర్వ వాసన పంక్తయః
యస్తిష్ఠతి గతవ్యగ్రః స ముక్తః పరమేశ్వరః॥
(మహోపనిషత్తు 6-8)
‘వాసనలన్నిటినీ హృదయం నుంచి త్యజించి, ఏ వ్యాకులతా లేకుండా ఎవడు ఉంటాడో అతడే ముక్తుడు, ఆతడే పరమేశ్వరుడు..’ అని పై ఉపనిషత్ వాక్యానికి అర్థం. బ్రహ్మ సమాజ నాయకుడైన కేశవసేన్ తరచూ రామకృష్ణ పరమహంస సాంగత్యంలో చాలాసేపు గడిపేవాడు. ఒకరోజు రాత్రి పది అయింది. కేశవసేన్ను ఆ రాత్రికి పరమహంస అక్కడే ఉండిపొమ్మన్నారు. కానీ ఆయన మాత్రం ‘నేను వెళ్లిపోవాలి. కొంచెం పని ఉంది..’ అన్నాడు. అప్పుడు పరమహంస ‘పక్కన చేపల బుట్ట లేకపోతే నిద్ర పట్టదా ఏంటి!’ అంటూ ఈ కథ చెప్పారు. ఒక బెస్త మహిళకు చేపలు అమ్ముడు పోయేసరికి చీకటి పడింది. ఆ రాత్రి తన వూరికి వెళ్లలేక పోయింది.
గత్యంతరం లేక అదే గ్రామంలో ఉన్న స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. ఆ స్నేహితురాలిది పూల వ్యాపారం. ఆశ్రయం కోరి వచ్చిన బెస్త మహిళలను సాదరంగా ఆహ్వానించి పూలమ్మి. గదిలో పడుకోమ్మన్నది. ఆ గదంతా పూల పరిమళంతో నిండి ఉంది. బెస్త మహిళకు ఎంత సేపటికీ నిద్ర పట్టలేదు. ఎంత రాత్రయినా నిద్రపోకుండా.. అటూ ఇటూ మెసులుతున్న స్నేహితురాలితో ‘ఏమైంది?’ అని అడిగింది పూలవ్యాపారి. అప్పుడు బెస్త మహిళ ‘కారణం ఏమిటో తెలియడం లేదు! ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు. ఏమనుకోకుండా నా చేపల బుట్ట కాస్త తెచ్చిపెడతావా’ అని కోరింది.
ఆ స్నేహితురాలు అలాగే చేసింది. చేపల బుట్ట తలాపున పెట్టుకుంది బెస్త మహిళ. క్షణాల్లో నిద్రలోకి జారుకుంది. పరమహంస ఈ కథ చెప్పి.. ‘ప్రగాఢమైన పరిచయం మనకు తెలియకుండానే ఒక వాసనగా మారుతుంది. దాని వెంబడే మనిషి బుద్ధి వెళ్లిపోతుంది. కానీ దాన్నే జయించవలసి ఉన్నది’ అని వివరించారు. “నాకు తీరదు. వెంటనే వెళ్లిపోవాలి’ అని అన్నావంటే ఏదో వాసన నిన్ను అటుగా లాగుతున్నదన్నమాట! ఇలాగైతే సాధకుడు జీవన్ ముక్తుడు కాలేవు’ అని కేశవసేన్కు విశదపరిచారు. బుద్ధిని మనం అనుకునే మంచి విషయం వైపు మళ్లించాలంటే వాసన అనేది తొలగిపోవాలి. వాసన అంటే తీవ్రమైన సాంగత్యంతో కలిగే భావం. మామూలు పరిచయాలు ఫర్వాలేదు.
…? డా॥ వెలుదండ సత్యనారాయణ