రమణ మహర్షి దగ్గరికి ఓ విదేశీ పాత్రికేయుడు వచ్చాడు. ఏండ్లుగా అలా ఒకే చోట ఉంటున్న రమణుల్ని ఉద్దేశించి ‘అసలు ఇలా ఎలా ఉండగలుగుతున్నారు? ఇది ఎలా సమర్థనీయం. ఈ వైఖరితో మీరు సమాజానికి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు? ఇది కర్మల నుంచి తప్పించుకోవడం కాదా?’ అని ప్రశ్నించాడు. అప్పుడు మహర్షి ‘ఇక్కడ కర్మ జరగడం లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు. తిరిగే చక్రానికి, తిరగని ఇరుసే కదా ఆధారం! అలాగే నిశ్చలంగా ఉండటమూ కర్మకు ప్రేరణే’ అన్నారు. అలా కర్మలో అకర్మకు, అకర్మలో కర్మకు ఆయన అద్భుతమైన నిదర్శనంగా నిలిచారు.
మరో సందర్భంలో కె.అరుణాచలం అనే గాంధేయవాది, రమణ మహర్షిని కలసి ‘భగవాన్! అందరినీ ఊరకే ఉండమంటారు. మీరూ ఉండి చూపిస్తారు. కానీ మహాత్మాగాంధీ అందరినీ కార్యనిమగ్నులు కావాలని చెబుతున్నారు. ఆయన కూడా ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఎందుకు ఈ తేడా?’ అని ప్రశ్నించారు. అప్పుడు అనన్యసామాన్యమైన మందహాసం రమణ మహర్షి ముఖంపై పొటమరించింది. ‘నేను ఊరకే కూర్చుంటున్నానని నీకెవరు చెప్పారు? ఆ మహాత్ముడు పనిలోనే నిమగ్నమయ్యాడని ఎందుకు అనుకుంటున్నావు?’ అని ఎదురు ప్రశ్నించారు. ‘కర్మలో అకర్మనూ, అకర్మలో కర్మనూ ఎవడు దర్శిస్తాడో, వాడే శ్రేష్ఠుడు, అతనే యోగి’ అన్న శ్రీకృష్ణభగవానుడి గీతామృత భావాన్ని స్ఫురింపజేశారు.
మహాభారతంలో మహామహాయోధులందరూ ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొన్నవారే. కృష్ణ భగవానుడు మాత్రం ఎలాంటి ఆయుధమూ పట్టలేదు. ఎదురుపడి పోరాటమూ చేయలేదు. కేవలం రథ సారథిగా ఉన్నట్లు కనిపించాడు. మహాసంగ్రామాన్ని ఓ సాక్షిలా గమనించాడు. కానీ, ఆ రణరంగమంతా ఆ రుక్మిణీనాథుడి కనుసన్నల్లోనే ముందుకు సాగిందన్నది జగద్విదితం. అకర్మలో తీవ్ర కర్మ దాగి ఉంటుందని చెప్పడానికి ఇంతకుమించి తార్కాణం లేదు. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలో తరచూ ‘స్థితప్రజ్ఞత’, ‘నిశ్చలత’ అనేవి కార్యక్షేత్రాల్లో అత్యున్నతమైన గుణాలుగా ప్రస్తావించాడు. కర్మసన్యాస యోగంలో ‘ఎవరైతే తమయందే శాంతిసుఖాలను అనుభవిస్తారో, ఎవరికి తమయందే జ్ఞానప్రకాశం ఉదయిస్తుందో వారు అత్యున్నత స్థితికి చేరతారు’ అన్నాడు గీతాచార్యుడు.
బాగా తిప్పి వదిలేసిన బొంగరం ఉన్న చోటే తిరుగుతూ ఉంటుంది. దూరం నుంచి చూసినవారికి అది అలా కదలనట్టు కనిపిస్తుంది. కానీ, తీవ్రమైన భ్రమణం దానిలో దాగి ఉంది. అలాగే ఉత్కృష్టమైన సంకల్పాలకు సాకారంగా నిలిచేవారు కూడా బాహ్యప్రపంచానికి ముభావంగా కనిపించవచ్చు. కానీ, వారిలో తీవ్ర కర్మ పరాయణత్వం దాగి ఉంటుంది. నిశ్చలత, స్తబ్ధత బాహ్యానికి ఒకేలా కనిపిస్తాయి. కానీ, నిశ్చలత నిలకడగా పారే సెలయేరు లాంటిది. స్తబ్ధత కాలుష్యపు కాసారం లాంటిది. నిశ్చలత, మౌనం మనిషిలోని చైతన్యశక్తిని జాగృతం చేస్తాయి. మన ఏకాంతం మనల్ని నిశ్చలంగా మార్చాలి. స్తబ్ధతలోకి కుంగదీయకూడదని మాధవుడి నుంచి మహర్షి చెప్పింది ఈ సూత్రమే!
మన సనాతన వేదాంత పరిభాషలో ‘ప్రవృత్తి’, ‘నివృత్తి’ అనే పదాలకు విశేష ప్రాధాన్యం ఉంది. ‘ప్రవృత్తి’ అంటే మనసు బాహ్యప్రపంచం వైపునకు మరలడం. బహిర్ముఖమై వివిధ కర్మల్ని నిర్వర్తించడం. ప్రపంచంలో కార్యనిర్వహణ ధర్మాన్ని నెరవేర్చడంలో ఇది అత్యవసరం కూడా! పనిలో నైపుణ్యం ‘ప్రవృత్తి’ వల్లే సాధ్యమవుతుంది. జీవితంలో ఒకానొక అంకం వరకు మనిషి అభ్యుదయం వైపు పయనించడానికి ‘ప్రవృత్తి’ ప్రధాన సాధనం. ఇక రెండోది ‘నివృత్తి ధర్మం’. ఇది తాబేలు తన కాళ్లను లోపలికి మడుచుకోవటం లాంటిది. అంటే మనలోకి మనం చూసుకోవటం. మనలోకి మనం ప్రయాణించడం నివృత్తి. ఇలా ‘అంతర్ముఖులం’ కావడం ఆధ్యాత్మిక ఉన్నతికి నిదర్శనం. బాహ్యకర్తవ్య నిర్వహణ చేయడమే కాక, అనివార్యమైన పరిస్థితుల్లో ప్రశాంతంగా తనలో తాను అంతర్లీనం కావడం అలవర్చుకోవాలి. ఇలా ‘ప్రవృత్తి’, ‘నివృత్తి’ పడుగుపేకల్లా అల్లుకున్న జీవితమే సంపూర్ణ జీవనం. ‘ద్వివిధో హి వేదోక్తో ధర్మః ప్రవృత్తి నివృత్తి లక్షణః, చ జగతః స్థితి కారణం’ అంటున్నది సనాతన ధర్మం. అంటే ప్రవృత్తి, నివృత్తి ధర్మాలను సమన్వయ పరిచినప్పుడే జగత్తు సజావుగా ముందుకు సాగుతుందని అర్థం.
కర్మ ఆచరించే ముందు చేసే ప్రతిజ్ఞే ‘సంకల్పం’. మనకు జీవితంలో దొరికే విరామ సమయాన్ని విశ్రాంతిగా చేసుకుంటామా, సంకల్ప సమయంగా మలుచుకుంటామా! అన్నది మనపై ఆధారపడి ఉంటుంది. మహాభారతంలో దుర్యోధనాదులు శకునితో కలసి తమ కపటపన్నాగాలతో పాండవులను అరణ్య, అజ్ఞాతవాసాల పాలుచేశారు. కానీ, పాండవులు ఆయా సమయాల్లో ఏనాడూ కుంగిపోలేదు. వాటిని తమ శక్తి సంపత్తులు ద్విగుణీకృతం చేసుకునేందుకు సమయంగా, సాధనంగా ఉపయోగించుకున్నారు. మానసికంగా, శారీరకంగా మరింత దృఢమయ్యారు. ధర్మరాజు నైతిక సారథ్యంలో కాలపరీక్షలకు తలొగ్గి విజేతలై నిలిచారు. భవిష్యుత్తులో కురుక్షేత్ర సంగ్రామానికి, వ్యక్తిగత సంకల్పాలు నెరవేర్చుకునేందుకు అరణ్య, అజ్ఞాతవాసాలను సోపానాలుగా చేసుకున్నారు.
‘చదరంగం ఆడేవారి కన్నా పక్కన ఉండి చూసేవాడే ఎక్కువ ఎత్తులు వేయగలడు’ అనేవారు రామకృష్ణ పరమహంస. నిజానికి ఈ ప్రపంచంలో కూడా నిరంతరం కార్యనిమగ్నుడై ఉండే వ్యక్తి కన్నా, కార్యానికి ప్రేరణ ఇచ్చేవాడే ఎక్కువ శక్తిసంపత్తులు కలిగి ఉంటాడు. దీర్ఘకాలం ఆ కార్యానికి నేతృత్వం వహించగలడు. ఉదాహరణకు ఏ సంస్థలో తీసుకున్నా అధినేత నిశ్చలంగా ఎలాంటి విధులు నిర్వర్తించకుండా ఉన్నట్లే కనిపిస్తుంది. ఆదేశాలిచ్చేవాడిగానే అనిపిస్తుంది. కానీ, ఆ సంస్థలోని ప్రతి పనిలోనూ ఆయన ముద్ర ప్రస్ఫుటమవుతుంది. అది పరోక్ష ప్రేరణ. పరోక్ష కార్యనిర్వహణ. అది ఆ వ్యక్తి అధికార ప్రభావం కాదు, శక్తి ప్రసరణ. బౌద్ధికపరమైన నిశ్చల పర్యవేక్షణ. మనిషి ఎంత త్వరగా ఆ స్థితికి వెళితే అంత కర్మరాహిత్య స్థితికి చేరగలడు.