శనివారం 06 మార్చి 2021
Devotional - Jan 27, 2021 , 02:13:18

దేహికి, దేహానికి మధ్య..!?

దేహికి, దేహానికి మధ్య..!?

వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో పరాణి 

తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ ॥

- భగవద్గీత (2-22)

‘సాధారణంగా మానవులందరూ చినిగిపోయిన, పాతబడిన వస్ర్తాలను వదిలేసి కొత్త వస్ర్తాలను ధరించటం సహజం. అదేవిధంగా, మనలోని జీవాత్మ కూడా పాత శరీరాలను విడిచి, కొత్త శరీరాలను ధరిస్తూ ఉంటుంది’ అని శ్రీకృష్ణ భగవానుడు ఈ సుప్రసిద్ధ శ్లోకంలో పేర్కొన్నాడు. దీనిద్వారా ‘మరణానికి సంబంధించి’ మనిషి కండ్లు తెరిపించే గొప్ప ప్రయత్నం ఆయన చేశాడు. అర్జునుని వలెనే అనేక మందికి మరణ సంబంధ భయాలు ఉంటాయి. ‘బంధుమిత్రుల మరణం సంభవించే ఈ యుద్ధాన్ని నేను చెయ్యను’ అని భీష్మించుకొని స్వధర్మాచరణకు దూరమైపోయిన పాండవ మధ్యమునికి ధర్మబోధతో ఈ సత్యాన్ని ఎరుక పరిచాడు. అత్యంత సులభరీతిలో మనందరికీ నిత్యమూ తెలిసిన విషయంతో దీనిని పోల్చిచెప్పడం ఇందులోని ప్రత్యేకత.

వస్ర్తానికైనా, దేహానికైనా జీర్ణం కావడం అనేది అనివార్యం. కొత్త వస్ర్తాలు ధరించేటప్పుడు ఎవరికైనా సంతోషమే కలుగుతుంది. మరి, ‘శరీరం వదిలే సమయంలో మాత్రం మనకు దుఃఖం ఎందుకు కలగాలి?’ మానవ శరీరాన్ని పాతవస్త్రంతో పోల్చడం ద్వారా శ్రీకృష్ణుడు అత్యంత సరళతరమైన పోలికను చూపించాడు. అన్యాపదేశంగా, ‘మరణం శరీరానికే గాని ఆత్మకు కాదన్న జీవిత సత్యం’ ఇందులో ఇమిడి ఉంది. ఆత్మ నిత్యత్వాన్ని అనేక శ్లోకాలలో భగవద్గీత చెప్పింది. ‘నైనం ఛిందంతి శస్ర్తాణి, నైనం దహతి పావకః (2-23). ఆత్మను ఏ శస్ర్తాస్ర్తాలూ ఛేదింపజాలవు. అగ్ని, నీరు వంటివాటితో దానికి ప్రమాదమూ లేదు’ అని కూడా శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించాడు. ఆత్మ శాశ్వతత్వం తెలిసిన జ్ఞాని సుఖ దుఃఖాలను సమభావనతో చూస్తాడు. కనుక, అతను ఎటువంటి దుఃఖానికి లోడు కాడు. ఇంతటి ‘స్థితప్రజ్ఞత’ను సాధిస్తేనే స్వధర్మ నిర్వహణలో వ్యక్తికి తడబాటు ఉండదు. ఇలాంటి జీవిత సత్యాలు కేవలం అర్జునునికి మాత్రమే బోధించినట్టు కనబడినా, భవబంధాలలో చిక్కుకున్న ప్రతి మనిషికీ ఇవి వర్తిస్తాయి. అతనిలోని ఇంద్రియార్థుల విమూఢత్వం నశించడానికి ఈ బోధ ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. అర్జునుని విషాదం వెనుక ఉన్న ఈ భావన నశించాలన్నది భగవత్సంకల్పం.

మనిషి కేవలం ‘దేహి’ మాత్రమేగాని ‘దేహం’ కాదన్న సత్యాన్ని పై శ్లోకం నిర్ధారించింది. శిథి లమయ్యేది ‘దేహం’ మాత్రమే, ‘దేహి’ కాదు. ‘బతికి బట్ట కట్టడం’ అనే ఒక లోకోక్తి ప్రపంచం లో బహుళ ప్రచారంలో ఉంది. ‘దేహం’ అంటే వస్త్రం. ‘దేహి’కి తన వస్త్రం (దేహం)తో సంబం ధమే లేదు. దేహానికి వస్త్రం ధరిస్తాం. అంతే. దేహా నికి, వస్ర్తానికీ- రెండిటికీ ‘శైథిల్య గుణం’ ఉంది. ప్రపంచంలోని ప్రతి వస్తువూ కొంతకాలానికి శిథిలమవుతుంది. ఈ దేహమూ అంతే. అందుకే, ‘అటువంటి అశాశ్వతమైన దేహం కోసం చింతిం చడం అనవసరమని’ శ్రీకృష్ణ భగవానుని సందే   శం. వస్త్రధారియైనవాడు అది శిథిలమయ్యేంత వరకు దానిని మోస్తూనే ఉంటాడు, ఉండాలి. అదేవిధంగా, దేహధారియైనవాడు కూడా దేహం శిథిలమయ్యేంత దాకా శరీరాన్నీ మోయక తప్ప దు. వస్త్రం దేహాన్ని కప్పి దాన్ని కొంతవరకు రక్షించినట్లే, దేహం కూడా ఆత్మను రక్షిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే శరీరం శిథిలావస్థకు చేరుకుం టుందో.. అప్పుడు ఆత్మ దానిని వదిలేసి, కొత్త దేహాన్ని ఆశ్రయిస్తుంది. ఇది ప్రతి ఒక్క మనిషీ తెలుసుకోవలసిన తాత్తిక సత్యం.

-గన్నమరాజు గిరిజా మనోహరబాబు

VIDEOS

logo