ఉమ్మడి రాష్ట్రంలో ఉరిసిల్లగా మారిన సిరిసిల్లలో మళ్లీ ఆనాటి దౌర్భాగ్యస్థితి దాపురిస్తున్నది. కేసీఆర్ సర్కారు దిద్దుబాటు చర్యలతో, అండదండలతో పదేండ్లపాటు బతుకు భరోసా పొందిన నేతన్న.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఆగమాగమైపోతున్నడు. ప్రభుత్వం నుంచి వర్క్ ఆర్డర్లు అందక, నేసిన బట్టల్ని కొనేవారులేక మీ బతుకేందని అడిగే వాడు కనిపించక రాష్ట్ర వ్యాప్తంగా నేతన్న చితికిపోతున్నడు. గత 24 గంటల్లోనే సిరిసిల్లలో ఏకంగా ముగ్గురు నేత కార్మికులు ఉరికొయ్యకు వేలాడి ప్రాణాలు తీసుకున్నారు. కాంగ్రెస్ పరిపాలన రాష్ర్టాన్ని మళ్లీ పాతరోజులకు తీసుకుపోతున్నదనే హెచ్చరికను జారీ చేశారు.
రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 25 (నమస్తేతెలంగాణ) / సిరిసిల్ల రూరల్ : కార్మిక క్షేత్రం సిరిసిల్లలో నేతన్నల ఆత్యహత్యల పరంపర మళ్లీ మొదలైంది. 24 గంటల్లోనే ముగ్గురు నేత కార్మికులు ప్రాణాలు వదిలారు. ఇందులో ఇద్దరు ఉరివేసుకొని బలవన్మరణం చెందగా.. మరొకరు ఉపాధి దొరక్క.. ఆకలితో అలమటించి ఊపిరి విడిచారు. కేసీఆర్ పాలనలో చేతినిండా పనితో ధీమాగా బతికిన కార్మికలోకం, కాంగ్రెస్ నాలుగు నెలల పాలనలో ఉపాధి లేక ఆగమవుతున్నది. వస్త్ర పరిశ్రమలో ఏర్పడిన సంక్షోభంతో కార్ఖానాలు మూతపడి పనులు లేక, ఆర్థిక ఇబ్బందులతో నేతకార్మికులు ఆత్మహత్యల బాటపడుతున్నారు. సిరిసిల్ల పర్యటనలోనే ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ బాధిత కుటుంబాలను పరామర్శించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఇందిరానగర్‌కు చెందిన అంకారపు మల్లేశం(55)కు భార్య భారతి, కొడుకు మహేందర్, కూతురు మనీషా ఉన్నారు. భార్య బీడీలు చుడుతుండగా, ఆయన మరమగ్గాలు నడుపుతుంటారు. రెండేండ్ల క్రితం కూతురి పెండ్లి చేశాడు. నాలుగు నెలల క్రితం భార్యకు కాలు విరగడంతో చికిత్స కోసం ఖర్చు చేయడంతో ఆర్థికంగా ఇబ్బందులు మొదలయ్యాయి. కాంగ్రెస్ సర్కార్ వస్త్ర పరిశ్రమకు బకాయిలు చెల్లించక పోవడంతోపాటు కొత్త ఆర్డర్లు ఇవ్వకపోవడంతో మరమగ్గాలు మూతపడ్డాయి. దీంతో నేత కార్మికులకు నాలుగు నెలలుగా పనిలేకుండా పోయింది. కుటుంబాలను పోషించుకోలేక, అప్పులు కట్టలేక మనోవేదనకు గురైన మల్లేశం గురువారం ఉదయం కార్ఖానా సమీపంలోనే చింత చెట్టుకు నైలాన్ తాడుతో ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. ఆయన భార్య భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
సిరిసిల్ల పట్టణంలోని పద్మనగర్‌కు చెందిన అడిశర్ల కైలాసంకు భార్య పద్మ, ఇద్దరు కొడుకులు మహేందర్, సాయి, కూతురు మౌనిక ఉన్నారు. కూతురి పెండ్లి చేశారు. కైలాసంకు పదేండ్ల క్రితమే పక్షవాతం వచ్చి కాలు చెయ్యి పడిపోయింది. వైద్యఖర్చుల కోసం రూ.పది లక్షలు అప్పు అయ్యింది. చిన్నపాటి పెంకుటిల్లు కూలిపోవడంతో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. పెద్దకొడుకు మహేందర్ మెడికల్ ఏజెన్సీలో గుమస్తాగా పనిచేస్తున్నారు. చిన్న కొడుకు అడిశర్ల సాయి (26) సిరిసిల్ల పట్టణంలోని ఓ వస్త్ర యజమాని వద్ద మరమగ్గాలకు బీములు పోసే (వార్పిన్) పనిచేస్తున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత వస్త్రపరిశ్రమలో సంక్షోభంలో పడింది. వార్పిన్లు కూడా బంద్‌కావడంతో సాయి ఉపాధి కోల్పోయారు. ఇంటి వద్దే ఉండి తండ్రిని చూసుకుంటున్నారు. నాలుగు నెలలుగా పనిలేకపోవడం తో మానసికంగా కుంగిపోయారు. ఇంటి అద్దె చెల్లించలేక, కుటుంబాన్ని పోషించలేక మనస్తాపం చెందారు. గురువారం సాయంత్రం సాయి ఇంట్లోనే చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
సిరిస్లిలలోని నెహ్రూనగర్‌కు చెందిన ఈగ రాజు(50) ఆకలితో అలమటించి ప్రాణాలు కోల్పోయారు. ఈయనకు భార్య రేఖ, కొడుకు దేవీప్రసాద్, కూతురు లక్ష్మీప్రసన్న ఉన్నారు. రాజు తన ఇంట్లో మూడు జోడీల సాంచాలు పెట్టుకున్నారు. ఆర్థిక స్థోమత లేక వాటిని నడిపించలేక సాంచాలను ఏడాది కింద అమ్ముకున్నారు. అక్కడ ఇక్కడా సాంచాలు నడుపుకొంటూ కుటుంబాన్ని పోషిస్తూనే కూతురు, కుమారుడిని చదివిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో బతుకమ్మ ఆర్డర్లు ఇచ్చి సిరిసిల్ల నేత కార్మికులకు చేతినిండా పనికల్పించడంతో నెలకు రూ.15 వేల వరకు వేతనం తెచ్చేవాడ ని అతని భార్య రేఖ తెలిపారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆర్డర్లు లేక సాంచాలు బంద్‌కావడంతో నాలుగు నెలలుగా ఖాళీగానే ఉంటున్నారు. ఏదోఒక పనిచేస్తానంటూ 15 రోజుల క్రితం చెప్పకుండానే ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. వెళ్లిన రాజు ఫోన్ చేయకపోవడంతో ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులకు రామడుగు మండలం వెదిర గ్రామ సమీపం లో బుధవారం శవమై దొరికాడు.మృతదేహం అప్పటికే బక్కచిక్కి, రంగుమారిపోయింది. ఉపాధివేటలో తిరిగి ఆకలితో అలమటించి చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు.