గురువారం 13 ఆగస్టు 2020
Devotional - Aug 03, 2020 , 00:10:24

జీవాత్మయే పరమాత్మ!

జీవాత్మయే పరమాత్మ!

జీవాత్మ, పరమాత్మ అని మనం వేర్వేరుగా చెప్పుకొంటున్నా వాస్తవానికి ఆత్మ ఒక్కటే. జీవులందరిలో వున్న ఆత్మ ఒక్కటే అయినా మాయా(అజ్ఞాన) ప్రభావంతో వేర్వేరుగా తోస్తున్నది. ఎలాగైతే, ఒకే సూర్యుడు నీటి కుండలన్నింట్లోనూ వేర్వేరుగా కనిపిస్తున్నాడో అలాగే, ఆత్మ ఒక్కటే అయినా జీవుల రూపంలో వేర్వేరుగా కనిపిస్తుంటుంది. ఈ జగత్తు అంతా పరమాత్మనుంచి పుట్టి, పోషితమై, మరల పరమాత్మలోనే లయమవుతున్నది. అందువల్ల, జగత్తు (ప్రపంచం) శాశ్వతం కాదు. ఆత్మయే శాశ్వతం. ఉన్నదికూడా ఆత్మ ఒక్కటే. ‘సర్వం ఖల్విదం బ్రహ్మ’. ఇదంతా బ్రహ్మమే (ఆత్మయే). ‘ఏకమేవా ద్వితీయం బ్రహ్మ’. ‘రెండవది లేని ఒకే బ్రహ్మం ఉన్నద’ని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఈ ఆత్మ (బ్రహ్మం)కు సజాతీయ, విజాతీయ, స్వగత భేదాలేవీ లేవు. చరాచర జగత్తంతా వ్యాపించి ఉన్నది. అది ఏ విధంగానూ విభజితం కాలేదు. విభజితమైనట్లుగా కనబడుతున్నది, అంతే.

అజ్ఞానం లేదా అవిద్య ఉపాధిగా గలవాడు జీవుడు. మాయావశుడు. ప్రదేశం వల్ల, కాలం వల్ల బాధింపబడేవాడు. అంటే, ఒకచోట ఉంటే మరోచోట ఉండలేడు. అలాగే, ఒక కాలంలో ఉంటే మరొక కాలంలో ఉండడు. కర్మవశుడు, కర్తృత్వభావం కలవాడు. అహంకార, మమకారాలతో ఇంద్రియ విషయాలపట్ల ఆసక్తి గలవాడై జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తున్న వాడు. పరమాత్మ జ్ఞాన స్వరూపుడు. సర్వకారణ కారణుడు. మాయాతీతుడు. మాయను తన అధీనంలో వుంచుకొనేవాడు. ‘అణోరణీయాన్‌ మహతో మహీయాన్‌' అని ఉపనిషత్తు వాక్యం. అణువులో అణువుగాను, మహత్తులో మహత్తుగాను ఉండేవాడు. గుణాతీతుడు. సర్వవ్యాపకుడు. శాశ్వతుడు. సచ్చిదానంద స్వరూపుడు. 

వాస్తవానికి జీవుడు కూడా సచ్చిదానంద స్వరూపుడే. కాని, మాయకు లోబడిన కారణంగా తనను తాను తెలుసుకొనలేక పోతున్నాడు. అజ్ఞాన రూపమైన మాయను తొలగించుకొంటే జీవుడుకూడా పరమాత్మ అవుతాడు. ‘తత్తమసి’ (అది నీవై ఉన్నావు), ‘బ్రహ్మా హమస్మి’ (నేను బ్రహ్మమును) వంటి మహా వాక్యాల నిరంతర చింతనలో తన ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవడమే అధ్యాత్మ విద్య. ఆత్మను గురించిన చింతనను, ఆత్మను తెలుసుకోవడమే జ్ఞానం. ఇదియే విద్య. ‘భగవద్గీత’లో శ్రీ కృష్ణపరమాత్మ, ‘అధ్యాత్మ విద్యా విద్యానాం. విద్యలలో అధ్యాత్మ విద్యను నేను’ అన్నాడు. ఈ జ్ఞానాన్ని పొందడమే మానవజన్మ పరమలక్ష్యం.

గుణమయం, పంచ భూతాత్మకం అయిన ఈ జగత్తులోని అన్ని వస్తువులలోను, ప్రాణులలోను పరమాత్మ సమంగా వ్యాపించి వున్నాడు. పరమాత్మ వ్యాపించి ఉండకపోతే ఏదీ ఏ కార్యాన్నీ చేయజాలదు. అందువల్ల, అన్నిటిలోనూ పరమాత్మను దర్శించేవాడు (పరమేశ్వరుని చూసేవాడు) నిజమైన ద్రష్ట. దీనినే ‘భగవద్గీత’..

‘సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరం

వినశ్యత్స వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి’ అని పేర్కొన్నది.

‘ప్రకృతి కార్యాలన్నీ గుణమయములే. శరీరం నశిస్తుం ది. కాని, జీవుడు నశించడు కనుక శాశ్వతుడు’ అని తెలిసినవాడే జ్ఞాని. జ్ఞానికి మాత్రమే ‘జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యం’ అని తెలుస్తుంది. ‘జగత్తే సర్వస్వం’ అన్న భ్రమ లో అజ్ఞాని ఉంటాడు. అందువల్ల జ్ఞానమే ముఖ్యం. జ్ఞానం వల్ల అన్ని కర్మలూ నశిస్తాయి. మరల జన్మకూడా ఉండదు. కనుక, జ్ఞానానికి మించిన పవిత్రమైంది ఏదీ లేదు. ‘నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే’ అని భగవద్గీత ప్రమాణీకరించింది. మానవజన్మ సార్థకమవడానికి జ్ఞానాన్నే ప్రయత్న పూర్వకంగా పొందాలి.logo