లక్నో : ఆర్థిక ఇబ్బందులతో ఓ మహిళ తన ఇద్దరు పిల్లల గొంతు కోసి ఆపై ఆత్మహత్యకు ప్రయత్నించిన ఉదంతం యూపీలోని మొరదాబాద్ సమీపంలో గోషిపుర గ్రామంలో వెలుగుచూసింది. ఈ ఘటనలో ఆమె కుమారుల్లో ఒకరు గాయాలతో మరణించగా మహిళ మరో కుమారుడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. కుటుంబ సమస్యలతోనే మహిళ ప్రీతి తీవ్ర నిర్ణయం తీసుకుందని పోలీసులు వెల్లడించారు. మహిళ భర్త దేవేంద్ర ఓ కంపెనీలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు.
కంపెనీలో ఆయనకు సకాలంలో జీతాలు రాకపోవడంతో వేరే పని చూసుకోవాలని మహిళ చెబుతున్నా వినకపోవడంతో మనస్ధాపంతో ప్రీతి దుందుడుకు నిర్ణయం తీసుకుంది. ఘటన జరిగిన రోజు భర్తతో వాదనకు దిగిన ప్రీతి ఆపై కత్తితో ఇద్దరు కుమారుల గొంతు కోసింది. ఆపై తానూ ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటనలో చిన్న కుమారుడు ఆదర్శ్ (4) అక్కడికక్కడే మరణించగా ప్రీతి, ఆమె పెద్ద కుమారుడి పరిస్థితి విషమం కావడంతో దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.