బెంగళూర్ : ఆన్లైన్ గేమింగ్‌కు బానిసై సర్వం కోల్పోతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఆన్లైన్ జూదం (Online Gambling) వ్యసనంగా మారిన కొందరు రూ. లక్షలు తగలేయడంతో పాటు అప్పు తెచ్చి మరీ నష్టాల పాలవుతున్నారు. ఇక లేటెస్ట్గా ఆన్లైన్లో లూడో ఆడుతూ బెంగళూర్‌కు చెందిన ఓ మహిళ రూ. 4 లక్షలు నష్టపోయింది. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన సమయంలో మొబైల్ గేమర్లలో ఈ గేమ్ విశేష ప్రాచుర్యం పొందగా ఆ క్రేజ్ ఇప్పటికీ కొనసాగుతోంది. బెంగళూరుకు చెందిన వివాహిత, ఇద్దరు పిల్లల తల్లి అయిన 26 ఏండ్ల మహిళ ఆన్లైన్ గేమింగ్‌కు బానిసగా మారింది.
ఈ వ్యసనంతో ఆమె రూ. 4 లక్షలు పోగొట్టుకోగా, ఇంటిలో ఉన్న కొంత డబ్బు తీసుకుని పిల్లలతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. గత ఏడాది ఆన్లైన్ గేమ్‌లో మహిళ రూ. 50,000 పోగొట్టుకోగా, గేమ్‌ను కొనసాగించేందుకు బంగారం తాకట్టు పెట్టి రూ. 1.25 లక్షలు తెచ్చినా ఆ డబ్బూ గేమ్‌లో పోగొట్టుకుంది. ఇక గేమ్‌ను విడిచిపెట్టలేని మహిళ భర్తకు తెలియకుండా బంధువుల నుంచి రూ. 1.75 లక్షలు అప్పు తెచ్చి ఆ నగదునూ ఆన్లైన్ ఆటలో కోల్పోయింది.
భర్తకు విషయం తెలియడంతో మరోసారి ఇలాంటి గేమ్స్ జోలికి వెళ్లనని మాటిచ్చింది. అయితే ఈ ఏడాది జులైలో ఆన్లైన్ గేమ్‌లో వెచ్చించేందుకు ఆమె మరోసారి తన బంగారు ఆభరణాలను కుదువపెట్టి రూ. 1.2 లక్షలను అప్పుగా తీసుకుంది. దీంతో భర్త కల్పించుకుని మహిళను ఆన్లైన్ గేమ్స్ ఆడకుండా చూడాలని ఆమె తల్లితండ్రులను కోరాడు. దీంతో మనస్ధాపానికి గురైన మహిళ ఇంట్లో ఉన్న నగదుతో పాటు ఇద్దరు పిల్లలనూ తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మహిళ సహా పిల్లల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Read More :