బాన్సువాడ : బాన్సువాడ మండలంలోని బాన్సువాడ- బీర్కూర్ ప్రధాన రహదారి పై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పట్టణ సీఐ రామకృష్ణా రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కల్హెర్ మండలంలోని జంలా నాయక్ తండాకు చెందిన దశరత్ (38) , రాంచందర్ (45) అనే ఇద్దరు బీర్కూర్ మండలంలోని జాల్లాపల్లి లో జరిగే శుభకార్యంలో పాల్గొనేందుకు ద్విచక్రవాహనం పై బయలుదేరారు. బీర్కూర్ నుంచి అతివేగంగా వచ్చిన కారు ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
వీరిని చికిత్స నిమిత్తం బాన్సువాడ దవాఖానకు తరలించగా పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి నిజామాబాద్ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో దశరత్, ప్రైవేట్ దవాఖానలో రాంచందర్ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు సీఐ వివరించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.