ఐదుగురు బాలికలు.. అంతా స్నేహితులు.. సరదాగా ఆడుకుందామని వెళ్లారు. జాలీగా ఆడుకుంటున్నారు. అంతలోనే ప్రమాదం. ప్రమాదవశాత్తూ ఒక బాలిక కాలుజారి పక్కనే ఉన్న సెల్లార్ గుంటలో పడిపోయింది. తోటి స్నేహితురాలిని కాపాడాలని మిగిలిన నలుగురు స్నేహితులు ప్రయత్నించారు. కానీ ఒకరి తర్వాత మరొకరు మొత్తం ముగ్గురు బాలికలు ఆ గుంటలో పడిపోయారు. కానీ ఆ ముగ్గురిలో ఒక బాలిక చెట్టు కొమ్మను పట్టుకోవడంతో ప్రాణాలతో బయటపడింది. కానీ గుంటలో పడిపోయిన ముగ్గురు మాత్రం దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కేపీహెచ్బీ కాలనీలోని ఆర్టీఏ కార్యాలయం సమీపంలో ఆడుకునేందుకు శుక్రవారం మధ్యాహ్నం ఐదుగురు బాలికలు వెళ్లారు. ఈ క్రమంలో కాలు జారి సంగీత అనే బాలిక నీటిలో పడిపోయింది. ఆమెను కాపాడే క్రమంలో రమ్య ( 7), సఫియా (10) కూడా నీటిలో మునిగిపోయారు. నేహా అనే బాలిక పక్కనే ఉన్న చెట్టు కొమ్మను పట్టుకుని బయటకు వచ్చేసింది. కానీ మిగిలిన ముగ్గురు మాత్రం నీటిలో మునిగిపోయారు. తోటి స్నేహితురాళ్లు నీట మునిగిపోతుండటంతో భయపడిపోయిన నేహా, నవ్య ఇద్దరు బాలికలు.. స్థానికులకు విషయం చెప్పారు. ఘటనాస్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది సాయంత్రం.. సఫియా, సంగీత మృతదేహాలను వెలికితీశారు. రమ్య మృతదేహం కోసం గాలిస్తున్నారు.