జిన్నారం, ఏప్రిల్ 7 : జిన్నారంలోని ఏపీజీవీబీ బ్యాంకు ఆవరణలో పట్టపగలే దోపిడీ జరిగింది. బ్యాంకు నుంచి రూ.2.25లక్షలు తీసుకొని బయటకు వచ్చిన డ్వాక్రా మహిళ చేతిలోని బ్యాగును ఇద్దరు యువకులు లాక్కొని బైక్పై పారిపోయారు. స్థానికులు అలెర్ట్ అయ్యేలోపే ఇద్దరు యువకులు బైక్పై పారిపోయారు. బ్యాంకు సిబ్బంది, స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకొని సీసీ పుటేజీని పరిశీలిస్తున్నారు.
వివరాలలోకి వెళ్తే…కిష్టయ్యపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి లక్ష్మి అనే మహిళ డ్వాక్రా గ్రూపు లీడర్. మరో డ్వాక్రా మహిళ కొడకంచి విజయతో కలిసి ఉదయం 11 గంటల సమయంలో జిన్నారం ఏపీజీవీబీ బ్యాంకుకు వచ్చిన లక్ష్మి బ్యాంకు లోను రూ.2.25 లక్షలు తీసుకొని బ్యాగులో పెట్టుకుంది. మరో మహిళతో కలిసి బయటకు వచ్చి నడుచుకుంటూ వెళ్తుండగా ..వారిని గమనిస్తున్న ఇద్దరు యువకులు ఆమెను వెంబడించారు.
బ్లాక్ కలర్ పల్సర్ బైక్పై ఒక యువకుడు బ్యాంకు ముందు నుంచి కొద్ది దూరం వెళ్లి ఆగాడు. మరో యువకుడు లక్ష్మిని అనుసరించి అమె చేతిలో ఉన్న బ్యాగును లాక్కొని బైక్పై ఎక్కి ఇద్దరు పారిపోయారు.
జిన్నారం సీఐ వేణుగోపాల్, ఎస్ఐ సిద్దిరాములుతో బ్యాంకుకు వచ్చి మహిళతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బ్యాంకు సీసీ కెమెరాలను పరిశీలించి పుటేజీ తీసుకొని ఇతర పోలీస్ స్టేషన్లకు పంపించి అలర్ట్ చేశారు. నగదు ఎత్తుకెళ్లిన యువకులు బైక్పై పటాన్చెరు వైపు వెళ్లినట్లుగా సీసీ కెమెరాల ద్వారా తెలుసుకున్న పోలీసులు బైక్ నంబర్ గుర్తించారు. నగదు ఎత్తుకెళ్లిన యువకులు తెలిసిన వాళ్లు అయ్యుండోచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.