Mancherial | మంచిర్యాల : మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. రెండు రోజుల క్రితం ఓ రోగి మరో రోగిపై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన బాధిత రోగిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని ఇటిక్యాల గ్రామానికి చెందిన చిలుకా దేవయ్య(49)గా పోలీసులు గుర్తించారు. అయితే దేవయ్య ఛాతీపై మరో రోగి కత్తితో దాడి చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కత్తితో దాడి చేసిన వ్యక్తిని గుర్తించాల్సి ఉంది.
మూడు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ దేవయ్య మంచిర్యాల ఆస్పత్రిలో చేరారు. మరో రోగి రెండు రోజుల క్రితమే అదే ఆస్పత్రిలో చేరగా, దేవయ్య పక్క బెడ్ కేటాయించారు. దేవయ్య గాఢ నిద్రలో ఉండగా, పక్కనే ఉన్న రోగి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో దేవయ్య భార్య గట్టిగా కేకలు వేయడంతో ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.