రంగారెడ్డి : మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తన భార్యను బండరాయితో మోది చంపాడు. ఈ దారుణ ఘటన నందిగామలోని వెంకమ్మగూడలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బాలరాజు(35), సునిత అలియాస్ సరిత(30) దంపతులు గత కొంతకాలంగా వెంకమ్మగూడలో నివాసం ఉంటున్నారు. వీరికి మూడేండ్ల కుమార్తె ఉంది. భార్యాభర్తలిద్దరూ రోజువారీ కూలీలుగా పని చేస్తూ జీవనం గడుపుతున్నారు.
అయితే వీరిద్దరి మధ్య గత కొన్ని రోజుల నుంచి వివాదాలు తలెత్తాయి. సరితను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేశాడు. మంగళవారం రాత్రి కూడా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న భర్త.. సరిత నిద్రించిన తర్వాత ఆమెపై బండరాయితో మోది చంపాడు. సమాచారం అందుకున్న నందిగామ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలరాజును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.