మంగళవారం 19 జనవరి 2021
Crime - Dec 23, 2020 , 18:30:23

అభియోగాలున్న వ్యక్తి కారులో ప్రయాణించిన జడ్జి సస్పెన్షన్‌

అభియోగాలున్న వ్యక్తి కారులో ప్రయాణించిన జడ్జి సస్పెన్షన్‌

డెహ్రాడూన్: ఇప్పటివరకు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న విషయాలను చూశాం. ఇప్పుడు ఈ కోవలోకి న్యాయమూర్తులు కూడా చేరుతున్నారు. అధికారాన్ని దుర్వినియోగానికి  పాల్పడిన కేసులో ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ జడ్జి సస్పెండ్‌ అయ్యాడు. ఈ మేరకు ఉత్తరాఖండ్‌ హైకోర్టు రిజిస్ట్రార్‌ ఉత్తర్వులు జారీచేశారు. 

ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లో ఒక జిల్లా న్యాయమూర్తి తన ప్రభుత్వ వాహనాన్ని అధికారిక పని కోసం పక్కనపెట్టి మరీ క్రిమినల్ కేసుల్లో అభియోగాలను ఎదుర్కొంటున్న వ్యక్తికి చెందిన ఆడి కారును ముస్సోరిలోని క్యాంకు కోర్టుకు వెళ్లేందుకు ఉపయోగించినట్లు అభియోగాలు ఉన్నాయి. సర్వీస్‌ నిబంధనలను ఉల్లంఘించిన న్యాయమూర్తిని ప్రశాంత్ జోషిగా గుర్తించి ఆయనపై సస్పెన్షన్‌ చర్యలు చేపట్టారు. ఉత్తరాఖండ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ హీరా సింగ్ బోనాల్ సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రవి మలిమత్ పరిశీలించిన తరువాత మంగళవారం రిజిస్ట్రార్ జనరల్‌కు లేఖ రాశారు. సదరు న్యాయమూర్తి యొక్క ప్రవర్తన ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమాలు 2002 లోని నిబంధనల ఉల్లంఘనతో పాటు తీవ్రమైన దుష్ప్రవర్తనకు సమానమని డిసెంబర్ 22 నాటి ఉత్తర్వులో పేర్కొన్నది. 

కారు యజమాని కేవాల్ క్రిషన్ సోయిన్‌పై డెహ్రాడూన్‌లో ఫోర్జరీ, చీటింగ్‌, క్రిమినల్‌ కుట్రలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. సస్పెన్షన్‌కు గురైన న్యాయమూర్తిని రుద్రప్రయాగ్ జిల్లా న్యాయమూర్తి ప్రధాన కార్యాలయానికి అటాచ్‌ చేశారు. గౌరవ హైకోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా రుద్రప్రయాగ్‌ విడిచిపెట్టవద్దని సూచించారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.