పిల్లల ముందు తల్లిదండ్రులు గొడవపడటం కూడా మంచిది కాదంటారు. అలాంటిది ఒక దుర్మార్గుడు తన పిల్లలు చూస్తుండగానే భార్యను కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో వెలుగు చూసింది. మలాద్‌లో నివాసం ఉండే ఆసిఫ్ షేక్ (44) ఈ ఘోరానికి పాల్పడ్డాడు. అతని భార్య పేరు నసీమ్ (38).
ఈ దంపతులకు 14 ఏళ్ల కుమారుడు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న నసీమ్ సోదరుడు వసీమ్ ఖాన్ (31) ఆ ఇంటికి వెళ్లి ఇద్దరికీ సర్దిచెప్పి వచ్చాడు. అదే రోజు రాత్రి 10.15 ప్రాంతంలో అతనికి ఫోన్ చేసిన మేనల్లుడు.. నసీమ్‌ను తన తండ్రి కత్తితో పొడిచి చంపేశాడని చెప్పాడు.
దీంతో హుటాహుటిన అక్క ఇంటికి చేరుకున్న వసీమ్.. అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న నసీమ్ మృతదేహన్ని చూశాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆసిఫ్‌ను ట్రేస్ చేసి అరెస్టు చేశారు.