Girl Kidnap Drama | సినీ ఫక్కీలో తాను కిడ్నాప్ అయినట్లు కుటుంబాన్ని నమ్మించి, తల్లిదండ్రుల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేయడానికి ప్రయత్నించిందో అమ్మాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో వెలుగు చూసింది. బిహార్‌లోని ఛాప్రా ప్రాంతానికి చెందిన ఒక జంట పూణేలో ఉంటోంది. ఈ కుటుంబంలో పరిస్థితుల పట్ల 15 ఏళ్ల కుమార్తె తీవ్రమైన అసంతృప్తి చెందింది. దీంతో స్వగ్రామం వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది.
అయితే తన భవిష్యత్తు కోసం డబ్బు అవసరమని భావించిన ఆమె.. తాను కిడ్నాప్ అయినట్లు మెసేజ్ పంపింది. ఇంట్లోంచి పరారైన తర్వాత, తన మొబైల్ నుంచి ‘రూ.5 లక్షలు ఇవ్వండి లేదంటే మీ అమ్మాయిని మర్చిపోండి’ అంటూ తల్లిదండ్రులకు మెసేజ్ పంపింది. ఆ కుటుంబం వెంటనే పోలీసులను ఆశ్రయించింది. అమ్మాయి మొబైల్ ఆన్‌లోనే ఉండటంతో వెంటనే టెక్నికల్ టీమ్ రంగంలోకి దిగింది.
ఈ క్రమంలోనే బిహార్‌లోని ఛాప్రాలో ఆమె రైలు దిగగానే పోలీసులు ఆ అమ్మాయిని అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల తర్వాత అక్కడకు వచ్చిన షిక్రాపూర్ పోలీసులకు ఆమెను అప్పగించారు. అమ్మాయిని కుటుంబానికి తిరిగి అప్పగించిన పోలీసులు మొత్తం కుటుంబానికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ కేసును పోలీసులు ఆరు గంటల్లో ఛేదించినట్లు అధికారులు తెలిపారు.