కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. మాచారెడ్డి మండల పరిధిలోని ఘన్పూర్ గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు – కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, గాయపడ్డ చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు టైర్ పేలడంతోనే అదుపుతప్పి కారును ఢీకొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కరీంనగర్ డిపో-1 బస్సు సిరిసిల్ల నుంచి కామారెడ్డి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గురైన కారు నంబర్ – TS 16 FB 4366.