Prakash Raj | తెలంగాణ మేధావి, ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారని తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలపై నాగేశ్వర్ అనుచిత, నిరాధార వ్యాఖ్యలు చేశారని జనసేన నేతల ఫిర్యాదుతో కాకినాడ జిల్లా ఇంద్రపాలెం పీఎస్‌లో ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై ఈ కేసు నమోదైంది.
రీసెంట్గా ఓ టీవీ చానల్ డిబేట్లో పాల్గొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏపీ రాజకీయాలపై గతంలో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ కలిసి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారని, ఆ సమయంలో వైఎస్ జగన్‌ను అరెస్ట్ చేయాలని వారిపై ఒత్తిడి వస్తుందని చెప్పినట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఓ టీవీ చానల్ డిబేట్లో నాగేశ్వర్ మాట్లాడుతూ.. బేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలో ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు మద్దతుగా నిలిచారు. ఈ మేరకు ప్రకాశ్ రాజ్ ఓ వీడియో సందేశాన్నిపోస్ట్ చేశాడు.
ప్రొఫెసర్ నాగేశ్వర్ సంవత్సరాలుగా అధికారంలో ఉన్నవారినైనా ప్రతిపక్షంలో ఉన్నవారినైనా ప్రశ్నించారు. ప్రజల పక్షాన నిలబడ్డారు. కానీ ఆయన మాట్లాడిన మొత్తం విషయాన్ని పక్కకు పెట్టి.. అందులో ఒక లైన్ మాత్రమే పెట్టుకుని సోషల్ మీడియా ట్రోలింగ్, కేసులు, బెదిరింపులు.. ఏంటిది..? ఇది ప్రజాస్వామ్యమా..? లేక మా నాయకుడిని ప్రశ్నిస్తేనాశనం చేస్తాం. అనే రాజకీయ గూండాయిజమా..? నిజంగా మీకు ఒక్క మాట తప్పనిపిస్తే దానికి ఆధారాలు అడగండి రాజకీయంగా కౌంటర్ ఇవ్వండి. కానీ వ్యక్తిత్వాన్ని హత్య చేయడం.. సోషల్ మీడియాలో అవమానించడం కేసులతో భయపెట్టడం.. ఇదనా మీరు చెప్పే కొత్త రాజకీయ సంస్కృతి అని ప్రకాశ్ రాజ్ అన్నాడు.
నాగేశ్వర్ చంద్రబాబును, కేసీఆర్‌ను, పవన్ కల్యాణ్‌ను, జగన్‌ను, రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. బీజేపీ ప్రశ్నలు అడిగారు.. అప్పుడు ఆయన నిజాయితీ మీకు గుర్తుకు రాలేదా..? ఇప్పుడు ఆయన ఒక మాట నచ్చలేదని ఆయన మీద యుద్ధం ప్రకటించడం ద్వంద్వ వైఖరి కాదా..? ప్రశ్నించే గొంతులను కేసులతో మౌనం చేయాలని చూడటం ప్రమాదకరం.. ఈ రోజు నాగేశ్వర్ రేపు ఎవరో..? ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో ఏయే పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకున్నారు. ఎవరు పట్టులో ఉన్నారని అందరికీ అన్నీ తెలుసున్నారు. దయజేసి ఈపనికి మాలిన చర్యలు ఆపండి అని ప్రకాశ్‌రాజ్ కోరాడు.