Jaisalmer : రాజస్థాన్లోని పెద్ద నగరాల్లో ఒకటైన జైసల్మేర్ ప్రజలు నీటి కోసం అల్లాడుతున్నారు. గత పది రోజులుగా నగరంలో నీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోల్డెన్ సిటీగా పేరున్న జైసల్మేర్.. ఇప్పుడు నీటి కొరతతో సతమతమవుతోంది. జైసల్మేర్ ఎడారి ప్రాంతం. ఒక పక్క ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో నీటి కొరత అంటే అక్కడి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
నల్లాల నుంచి నీటి సరఫరా ఆగిపోయి 10 రోజులవుతోంది. దీంతో ట్యాంకర్ల ద్వారా స్థానికులకు నీళ్లు సరఫరా చేస్తున్నారు. మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా నాలుగైదు రోజులకు ఒకసారి మాత్రమే నీళ్లు సరఫరా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. పది రోజులుగా నీళ్లు రావడం లేదని అధికారులకు చెప్పినా, రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ప్రజలు వాపోతున్నారు. నీటి కొరతపై అధికారులు స్పందిస్తూ స్థానిక కాలువకు సంబంధించిన నిర్వహణ పనుల వల్ల ప్రజలకు నీటి సరఫరాలో అవాంతరం ఏర్పడిందన్నారు.
రాజస్థాన్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీనర్ నిరంజన మీనా మాట్లాడుతూ.. ఈ నెల 10న నిర్వహణ పనులు ప్రారంభించామని, అందువల్ల నీటిని సరఫరా చేయలేకపోతున్నాం అన్నారు. నగరంలోని ఏడు ప్రాంతాలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందిస్తున్నామన్నారు. మూడు రోజుల్లో నల్లాల ద్వారా నీటి సరఫరా పునరుద్ధరిస్తామని చెప్పారు. అయితే, అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా నీటి సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.