ఎమ్మెల్యే అయ్యాక కడియం శ్రీహరి, ఆయన బిడ్డ, అల్లుడు తమ బినామీల పేరిట రెండు వేల ఎకరాల దేవునూరు అటవీ భూమిని అక్రమంగా దోచుకునేందుకు యత్నిస్తున్నారు.
ధర్మసాగర్, ఏప్రిల్ 6 : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం, దేవునూర్ గ్రామాల పరిధిలోని ఇనురాతి గుట్టల్లో అటవీ శాఖకు చెందిన భూములను కబ్జా చేసేందుకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురైన ఎంపీ కావ్య, అల్లుడు నజీర్ యత్నిస్తున్నారని మాజీ ఉపముఖ్య మంత్రి, బీఆర్ఎస్ నేత రాజయ్య ఆరోపించారు. ‘నమస్తే తెలంగాణ’లో ‘కారడవిలో పాగాకు ముంజేతి కడియం!’..రెండున్నర వేల ఎకరాల అటవీ భూమిపై కన్ను’ అన్న ప్రత్యేక కథనం ఆదివారం ప్రచురితమైంది. దీంతో ఇనుపరాతి గుట్టలను రాజయ్య ఆదివారం సందర్శించి, అక్కడి భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే అయ్యాక కడియం శ్రీహరి, ఆయన బిడ్డ ఎంపీ కావ్య, అల్లుడు నజీర్ తమ బినామీల పేరిట రెండు వేల ఎకరాలను అక్రమంగా దోచుకునేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.
అధికారులను వాడుకొని ఇప్పటికే బుల్డోజర్లు పెట్టి అడవిని నరికేస్తూ, కబ్జా చేయడానికి పనులను ప్రారంభించారని తెలిపారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. 4 వేల ఎకరాల భూముల్లో సగం భూములను బినామీల పేరుతో కబ్జా చేసేందుకు కలెక్టర్‌పై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారని, ఈ విషయంలో కలెక్టర్ ప్రమేయమున్నందున సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేకుంటే న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని హెచ్చరించారు. ఈ అటవీ స్థలాన్ని ఎవరు కొన్నా బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోనికి వచ్చాక వెనక్కి తీసుకొని అటవీశాఖకు అప్పగిస్తామని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇద్దరు మంత్రులు ఉన్నా ఈ విషయంలో పట్టించుకోకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. అధికారులు ప్రభుత్వ భూములకు పరిరక్షణగా ఉండాలని, ప్రజాప్రతినిధుల చేతిలో కీలుబొమ్మగా ఉండొద్దని రాజయ్య ఈ సందర్భంగా హితవు పలికారు.