Mechanic Rocky Review | సినిమా పేరు : మెకానిక్ రాకీ
తారాగణం: విశ్వక్సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, నరేష్, సునీల్, వైవా హర్ష..
దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి
నిర్మాత : రామ్ తాళ్లూరి
యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న కథానాయకుడు విశ్వక్సేన్ (Vishwak Sen) . ఆయన సినిమా వస్తుందంటే అంచనాలు సర్వసాధారణం. అందుకు తగ్గట్టే ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky) చిత్రానికి నిర్మాణంలో ఉన్నప్పుడే క్రేజీ ఇమేజ్ సొంతం చేసుకున్నది. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలు కావడంతో గ్లామర్ పరంగా కూడా సినిమా ఆకట్టుకునేలా ఉంటుందని పలువురు భావించారు. మరోవైపు పేరు తగ్గట్టే విశ్వక్ ఇందులో మెకానిక్‌గా మాస్‌కి నచ్చే పాత్ర చేశారని, ఆయన మార్క్ యాక్షన్ టింట్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ చెప్పారు. మరి దానికి తగ్గట్టే సినిమా ఉందా..? మెకానిక్ రాకీ మాస్ ప్రేక్షకులను అలరించాడా..? తెలియాలంటే ముందు కథలోకెళ్లాలి.
కథ :
బీటెక్ని మధ్యలోనే ఆపేసి తండ్రి రామకృష్ణ(నరేష్ వీకే) నడుపుతున్న గ్యారేజీలోనే మెకానిక్‌గా సెటిల్ అవుతాడు నగుమోము రాకేష్ అలియాస్ రాకీ(విశ్వక్సేన్). కార్లను బాగుచెయ్యడంతోపాటు, డ్రైవింగ్ కూడా నేర్పుతుంటాడు. ఓ రోజు రాకీ స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకోవడానికి మాయ(శ్రద్ధా శ్రీనాథ్) అనే అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయికి డ్రైవింగ్ నేర్పే క్రమంలో ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. తాను బీటెక్ మధ్యలో ఎందుకు మానేసింది… కాలేజ్‌లో తన స్నేహితుడు చెల్లెలు ప్రియ(మీనాక్షి చౌదరి)తో తన ప్రేమకథ.. ఇవన్నీ చెప్పడం మొదలుపెడతాడు రాకీ. అసలు ప్రియకు తనెందుకు దూరమయ్యాడు? వీరిద్దరూ విడిపోవడంలో తన స్నేహితుడి పాత్ర ఏంటి? ప్రియ కోసం రాకీ చేసిన సాహసం ఏంటి? అసలు మాయ ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
ఒక హీరో.. ఇద్దరు హీరోయిన్లు.. అనగానే ఎవరైనా ఇది ముక్కోణపు ట్రైయాంగిల్ లవ్‌స్టోరీ అనుకుంటారు. అలాగే విశ్వక్సేన్ హీరో కావడం, ‘మెకానిక్ రాకీ’ అనే టైటిల్.. ఈ తతంగాన్నంతా చూసి ఇదేదో పక్కా మాస్ ఎంటైర్టెనర్ అని కూడా అనుకుంటాం. సినిమా ప్రారంభంలో వచ్చే సన్నివేశాలు కూడా ఆ అభిప్రాయాలకు బలాన్నిస్తాయి. కానీ అనూహ్యంగా దర్శకుడు జానర్ మార్చేసి, ఆడియన్స్‌కి స్వీట్ షాక్ ఇచ్చాడు. నిజానికి నేర సామ్రాజ్య నేపథ్యంలో సాగే ఫక్తు థ్రిల్లర్ సినిమా ఇది. విషయం ఉన్న కథ. సమకాలీన సమాజంలో సామాన్యులు ఎదుర్కొంటున్న ఓ అంశం చుట్టూ కథ తిరిగింది. ఈ తరహా సీరియస్ సబ్జెక్ట్‌ను అంతే సీరియస్‌గా డీల్ చేయకుండా, కమర్షియల్ హంగులకోసం పాకులాడటం ఈ సినిమాకు మైనస్‌గా పరిఢమిల్లింది. ఫస్ట్ హాఫ్‌లో విశ్వక్సేన్ ఓల్డ్ గెటప్, ఆ గెటప్‌లో సన్నివేశాలు ఆడియన్స్‌కి ఇరిటేషన్ తెప్పిస్తాయి. కామెడీ కూడా పెద్దగా పేలలేదు.
ద్వితీయార్ధం ఈ సినిమాకు ప్రధాన బలం. ఫస్ట్‌హాఫ్‌లో తలెత్తిన అనుమానాలన్నింటినీ నివృత్తి చేసుకుంటూ ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ అనూహ్యమైన మలుపులతో ఆసక్తిగా సినిమాను నడిపించాడు దర్శకుడు. కథలో ఒక్కసారిగా వచ్చే మలుపు ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. మిడిల్‌క్లాస్ వారి అవసరాలను ఆసరాగా తీసుకొని కొంతమంది చేసే మోసాలను దర్శకుడు కళ్ళకు కట్టాడు. అయితే.. ఈ కథకు ఇంకా ఎమోషన్ అవసరం. హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి, కథకు కావాల్సిన ఎమోషన్స్‌ని దర్శకుడు పక్కన పెట్టాడనిపిస్తుంది. ఓవరాల్‌గా ప్రధమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం సినిమా బావుందనే చెప్పాలి.
నటీనటులు :
విశ్వక్సేన్ ఎప్పటిలాగే హుషారుగా నటించారు. మాస్కు నేచ్చేలా అభినయించారు. ఈ కథలో శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర చాలా కీలకం. గ్రే షేడ్ ఉన్న ఈ పాత్రను ఆమె చక్కగా అభినయించింది. మీనాక్షి చౌదరి పాత్ర కూడా కథలో కీలకం. హీరోయిన్లిద్దరివీ కథలో బలమైన పాత్రలు కావడం విశేషం. ఇక సునీల్, హర్షవర్ధన్, వైవా హర్ష, రోడీస్ రఘు, హర్ష చెముడు అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికంగా..
దర్శకుడు మంచి కథ రాసుకున్నాడు. దాన్ని ప్రజెంట్ చేయడంలో కాస్త తడబడ్డాడు. కథపై, కథనంపై, ఎమోషన్స్‌పై ఇంకాస్త శ్రధ్ధ పెడితే సినిమా మరోలా ఉండేది అనిపించింది. జేక్స్ బిజోయ్ సంగీతం బావుంది. కెమెరా విభాగం పనితీరు కూడా బావుంది. ఫస్ట్‌హాఫ్‌పై ఎడిటింగ్ విభాగం ఇంకాస్త దృష్టిపెడితే బావుండేది. మొత్తంగా ‘మెకానిక్ రాకీ’ మంచి కథ. ద్వితీయార్ధం బావుంది. మాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమాతో పాటు విడుదలైన సినిమాల ఫలితాలను బట్టి, ఈ సినిమా ఫలితం ఆధారపడివుంటుంది.
బలాలు :
కథ, కథలో మలుపులు, ద్వితాయార్ధం, విశ్వక్సేన్ నటన, సంగీతం..
బలహీనతలు :
ప్రథమార్ధం, కథనం, నవ్వురాని కామెడీ..
రేటింగ్ : 2.75/5
RC16 | రాంచరణ్ ఆర్సీ16 షూట్ టైం.. మైసూర్ టెంపుల్ ముందు బుచ్చి బాబు సాన
Dhanush | 2025 ఫస్ట్ హాఫ్‌ను టేకోవర్ చేసిన ధనుష్.. కుబేర సహా 3 సినిమాలు