హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : మరొకసారి బెట్టింగ్ యాప్స్‌కు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎలాంటి ప్రమోషన్లు చేయబోనని సీఐడీ అధికారుల ఎదుట నటుడు విజయ్ దేవరకొండ చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రమోషన్ విషయంలో తన టీం సరిగ్గా అప్రమత్తంగా లేకపోవడంతో ఈ పరిస్థితి తెలెత్తిందని సీఐడీకి వివరణ ఇచ్చినట్లు తెలిసింది. నిషేధిత బెట్టింగ్‌యాప్స్‌కు ప్రచారం కల్పించారనే కేసులో ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండతోపాటు టీవీ ఆర్టిస్టు సిరిహనుమంతును లక్డికపూల్‌లోని సీఐడీ కార్యాలయంలో అధికారులు మంగళవారం ప్రశ్నించారు. మధ్యాహ్నం సీఐడీ ఆఫీసుకు వెళ్లిన ఆయన్ను.. దర్యాప్తు బృందం గంటకు పైగా విచారించింది. విచారణ ముగిశాక కార్యాలయం వెనుక గేట్ నుంచి విజయ్ దేవరకొండ వెళ్లిపోయారు. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లకు సంబంధించి పలువురు నటీనటులు, సెలబ్రెటీలపై వివిధ పోలీస్ స్టేషన్లలో గతంలో కేసులు నమోదయ్యాయి. వాటి ఆధారంగా ఈడీ కూడా కేసు నమోదు చేసి విచారించింది.
అనంతరం ప్రభుత్వం ఈ కేసు విచారణను సీఐడీకి అప్పగించింది. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశారు. విజయ్ దేవరకొండతో పాటు నటుడు ప్రకాశ్ రాజ్ కు కూడా ఇటీవల సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం విజయ్ దేవరకొండ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌కు తీసుకున్న పారితోషకం, కమీషన్లు, ఒప్పంద పత్రాలు, బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ల వల్ల జరిగే పరిణామాలు తదితరాల గురించి విజయ్ను అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఇకపై బెట్టింగ్, గేమింగ్ యాప్‌లకు ప్రమోషన్లు చేయబోనని సిట్ ముందు విజయ్ దేవరకొండ చెప్పినట్లు సమాచారం. ఇదే కేసులో బిగ్‌బాస్ ఫేమ్ సిరి హనుమంతు సైతం సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. అధికారులు ఆమె నుంచి కూడా బెట్టింగ్ యాప్‌లకు చేసిన ప్రమోషన్ల గురించి వివరాలు రాబట్టారు. అలాగే నటుడు ప్రకాశ్ రాజ్ కూడా సీఐడీ కార్యాలయంలో సిట్ విచారణకు నేడు లేదా రేపు హాజరయ్యే అవకాశం ఉంది.