బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Oct 11, 2020 , 02:06:48

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా ‘ఫైటర్‌'

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా ‘ఫైటర్‌'

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఫైటర్‌' (వర్కింగ్‌ టైటిల్‌). పూరి-విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో తొలిసారి రాబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఆగిపోయిన షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమా గురించి ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్‌ దేవరకొండ పలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు. ‘ఫైటర్‌' నటుడిగా తన కెరీర్‌లో సరికొత్త అనుభవమని తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను ఫైటర్‌గా కనిపిస్తా. శారీరకంగా అత్యంత శక్తివంతంగా కనిపించేందుకు గత ఎనిమిది నెలలుగా కఠినమైన వ్యాయామాలు చేస్తున్నా. సిక్స్‌ప్యాక్‌ లేదా యైట్‌ ప్యాక్‌ అని కాకుండా ఫైటర్‌గా దృఢమైన శరీరంతో కనిపించడమే లక్ష్యంగా వర్కవుట్స్‌పై దృష్టిపెట్టాను. చూడగానే వీడు ఎవడినైనా మట్టికరిపించగలడు అనేలా ఫిజిక్‌ కనిపించాలని ప్రయత్నం చేశా. ‘ఫైటర్‌' రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమా కాదు. నా శైలితో సాగే యాక్షన్‌, ఎమోషనల్‌ అంశాలతో చాలా కొత్తగా ఉంటుంది. కథ వినగానే అద్భుతంగా ఉందనిపించింది. నాలోని నటుణ్ణి సంతృప్తి పరచుకోవాలంటే ఇలాంటి సినిమానే చేయాలని వెంటనే నిర్ణయం తీసుకున్నా. ఫిజికల్‌గా కొత్త లుక్‌తో కనిపించడంతో పాటు నటుడిగా నాలోని కొత్త పార్శాల్ని ఆవిష్కరిస్తుందీ చిత్రం. మొత్తంగా చెప్పాలంటే ‘ఫైటర్‌' నాలో పునరుత్తేజాన్ని నింపింది. నా కెరీర్‌లో ఈ సినిమా మరచిపోలేని అనుభవం’ అని చెప్పారు విజయ్‌దేవరకొండ.


logo