Cinema | వ్యవస్థలపై గుత్తాధిపత్యం, నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తున్న కేంద్ర ప్రభుత్వ కన్ను ఇప్పుడు సినీ రంగంపై పడింది. సినిమాటోగ్రఫీ అమెండ్మెంట్ బిల్ 2021 ( Cinematography amendement bill 2021 ) ఆమోదం ద్వారా సినీ పరిశ్రమ స్వేచ్ఛను హరించేందుకు సిద్ధమైంది. ఈ చట్ట సవరణతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ( Central Board of Film Certification ) ధృవీకరించిన సినిమాను తిరస్కరించే లేదా మరోసారి సమీక్షించమని చెప్పే అధికారం కేంద్ర ప్రభుత్వానికి చేజిక్కింది. దీంతో స్వయం ప్రతిపత్తి గల సీబీఎఫ్సీ ( CBFC ) నామమాత్రంగా మారిపోనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై చిత్ర పరిశ్రమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నది. ఇప్పటికే లాక్డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన సినీ రంగం ఈ చట్ట సవరణ వల్ల కోలుకోలేని విధంగా దెబ్బతింటుందని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం మన దేశంలో 1952 సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్స్ జారీ చేస్తున్నారు. ఈ చట్టం సినిమాలను యు, యు.ఎ, ఏ, ఎస్ అనే నాలుగు విభాగాలుగా ధృవీకరణ చేస్తున్నది. యు అనేది ప్రేక్షకులంతా చూడదగిన సినిమా కాగా, యు.ఏ అనేది తల్లిదండ్రుల పర్యవేక్షణలో 12 ఏండ్ల లోపు పిల్లలు చూడవచ్చని. ఏ సర్టిఫికెట్ మూవీస్ పెద్దలకు మాత్రమేనని, ఒక వర్గం లేదా వృత్తికి సంబంధించిన వారు చూడదగిన సినిమాలకు ఎస్ అనే సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఈ కొత్త చట్ట సవరణ ద్వారా యు.ఎ సర్టిఫికేషన్‌ను 7 ఏండ్లు పైబడి, 13 ఏండ్లు పైబడి, 16 ఏండ్లు పైబడిన ప్రేక్షకులకు మాత్రమేనని విభజించబోతున్నారు. దీని వల్ల ప్రతి థియేటర్ వద్ద ప్రేక్షకులు తమ వయసు ధృవీకరణ పత్రాలను చూపించాల్సి వస్తుంది. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యపై ఇది ప్రభావం చూపనుంది. పంపిణీదారులు, ప్రదర్శనదారులు, నిర్మాతలు ఆర్థికంగా నష్టపోనున్నారు. ప్రస్తుత సినిమాటోగ్రఫీ చట్టానికి సబ్ సెక్షన్ 6 చేర్చడం సినిమాటోగ్రఫీ అమెండ్మెంట్ బిల్ 2021లో ప్రమాదకరమైనదిగా చెప్పుకోవచ్చు. సీబీఎఫ్సీ ధృవీకరించిన సినిమాను కేంద్ర ప్రభుత్వం తిరిగి సమీక్షకు పంపే అధికారం ఈ చట్ట సవరణ కల్పిస్తుంది. దీంతో సీబీఎఫ్సీ స్వయం ప్రతిపత్తి కోల్పోయినట్లే భావించాలి.
సినిమాటోగ్రఫీ చట్టానికి చేసిన సవరణలు సృజనాత్మక స్వేచ్ఛకే కాదు సుప్రీం కోర్టు తీర్పును కూడా ధిక్కరించేలా ఉన్నాయి. ఒక సినిమాకు సీబీఎఫ్సీ సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత అందులోని మంచీ చెడులను బేరీజు వేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉండదని 2000 సంవత్సరంలో దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ సవరణలను కమల్ హాసన్, అనురాగ్ కశ్యప్, హన్సల్ మెహతా, నందితా దాస్, వెట్రి మారన్, షబానా అజ్మీ, ఫర్హాన్ అక్తర్, జోయా అక్తర్ వంటి అనేకమంది దర్శక నిర్మాతలు, ఇతర సినీ ప్రముఖులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్లోని సభ్యులు, అడ్వైజరీ ప్యానెల్, ప్రాంతీయ అధికారులు..ఇలా మొత్తం ఆఫీసర్స్‌ను కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుంది. వీళ్లంతా కేంద్రం చెప్పినట్లే వినాల్సి ఉంటుంది. దాని ఆలోచనలు గ్రహించి ప్రవర్తించాల్సి ఉంటుంది. అయినా ఈ కొత్త సవరణలు తీసుకురావడం సినీ రంగంపై పూర్తి గుత్తాధిపత్యం కోసమేననే విమర్శలు వినిపిస్తున్నాయి.
భావ ప్రకటనా స్వేచ్ఛకు పరిమితులు ఉంటాయని చెప్పుకునే చైనా, ఉత్తర కొరియా వంటి దేశాల్లోనూ సృజనాత్మక రంగానికి ఇలాంటి పరిమితులు, నిబంధనలు లేవనేది విశ్లేషకుల మాట. ఇలా సినిమా ప్రదర్శనలకు కొత్త అడ్డంకులు సృష్టించడం వల్ల విదేశీ చిత్ర నిర్మాణ సంస్థలు మన దేశీయ సినీ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావు. ఇప్పటికే ఐటీ చట్టం ద్వారా ఓటీటీలకు పలు పరిమితులు విధించిన కేంద్రం వాటి గమనాన్ని అడ్డుకుంటున్నది. వందలాది సినిమా థియేటర్స్ గోదాములుగా, ఫంక్షన్ హాల్స్గా మారుతున్న ఈ విపత్కర పరిస్థితుల్లో సినిమాటోగ్రఫీ చట్ట సవరణలు చిత్ర పరిశ్రమకు శాపాలే కాబోతున్నాయి.
తన సినిమాను విడుదలకు ముస్తాభు చేసుకున్న నిర్మాతకు సీబీఎఫ్సీ ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ తిరుగులేని అనుమతి పత్రం. ఈ ధృవీకరణ అందుకున్న తర్వాత సదరు నిర్మాత తన సినిమా విడుదల తేదీని ప్రకటించుకుంటాడు. ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకుంటాడు. డిస్ట్రిబ్యూటర్స్‌కు అమ్మకాలు చేస్తాడు. ఇప్పుడున్న డిజిటల్ మార్కెట్లో ఓటీటీలకు ఇంత ధరని చెప్పి రైట్స్ ఇస్తాడు. సినిమాటోగ్రఫీ చట్టానికి చేసిన తాజా సవరణల వల్ల ఇవన్నీ సందిగ్ధంలో పడనున్నాయి. అప్పటికే సీబీఎఫ్సీ సర్టిఫికెట్ అందుకున్న నిర్మాత ధైర్యంగా సినిమాను విడుదల చేసే పరిస్థితి ఉండదు. ఆ సినిమాను తిరిగి కేంద్రం సమీక్షకు పంపవచ్చు (ఇలా సమీక్షకు ఎన్నిసాైర్లెనా పంపవచ్చు). అప్పుడు విడుదల తేదీ స్పష్టత లేక అమ్మకాలు జరగవు, ఓటీటీల వారు కొనరు. విడుదలైన తర్వాత గనుక ఆ సినిమాను పునసమీక్షించమని కోరితే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, ఓటీటీ యాజమాన్యాలు పెట్టిన పెట్టుబడి ఏం కావాలి? ఇదంతా నిర్మాత ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుంది.
Dasara Movie | అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న దసరా మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?