Adipurush Movie | మరో రెండు నెలల్లో విడుదల కాబోతున్న ఆదిపురుష్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటికీ టెన్షన్ గానే ఉన్నారు. టీజర్ రిలీజ్‌కు ముందు ఫ్యాన్సే కాదు సగటు ప్రేక్షకుడు సైతం ఆదిపురుష్ గురించి ఎంతో ఆత్రుతతో ఎదురు చూశారు. తీరా టీజర్ చూశాక ప్రభాస్ ఫ్యాన్స్‌పై సానుభూతి వ్యక్తం చేశారు. ఇక సినిమాపై ఆశలు వదులుకోండి అని సలహాలు ఇచ్చారు. అంతలా టీజర్ ప్రేక్షకుల్లో ఎఫెక్ట్ చూపింది. వీఎఫ్ఎక్స్ విషయంలో ఇంకా సందేహమే నెలకొంది. రిపేర్లు ఎంతదాగా వచ్చాయన్న క్లారిటీ లేదు. అసలు నిజంగానే వీఎఫ్ఎక్స్పై మేకర్స్ మరోసారి కసరత్తులు చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పైగా శాకుంతలం రిజల్ట్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకా భయపడుతున్నారు.
కంటెంటే కాదు పిక్చర్ క్వాలిటీ విషయంలోనూ ఏ మాత్రం తేడా కొట్టినా ప్రేక్షకులు నిర్మొహమాటంగా సినిమాను తిరస్కరిస్తారు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో రూపొందిన ఆదిపురుష్ రిలీజ్ డేట్‌పై నిన్న మొన్నటి వరకు క్లారిటీ లేదు. కచ్చితంగా ఈ సారి వస్తున్నామంటూ మేకర్స్ ప్రకటించింనా.. ప్రేక్షకుల్లో నమ్మకం లేదు. అయితే తాజాగా న్యూయార్క్‌లో జరిగే ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్లో ఈ సినిమా జూన్ 13న ప్రదర్శితమవుతుందని చిత్రబృందం తెలిపింది. దాంతో ఈ సినిమా జూన్ 16న కచ్చితంగా వస్తుందన్న క్లారిటీ వచ్చేసింది. కాగా ఆ క్లారిటీతో ప్రభాస్ ఫ్యాన్స్‌కు మరో టెన్షన్ మొదలైంది.
ఈ సినిమా ఇండియా కంటే మూడు రోజుల ముందే ట్రిబెకా ఫెస్టివల్లో ప్రీమియర్ కానుంది. దాంతో ఆ ప్రీమియర్ షోకు క్రిటిక్స్‌తో సహా పలువురు ఆడియెన్స్ సినిమా చూసే అవకాశం ఉంది. దాంతో మూడు రోజుల ముందే ఆదిపురుష్ టాక్ తెలిసిపోతుంది. పాజిటీవ్ టాక్ వస్తే పర్లేదు కానీ, ఏ మాత్రం నెగెటీవ్ టాక్ వచ్చినా మొదటికే మోసం వస్తుంది. అయినా గానీ కంటెంట్ మీదున్న నమ్మకంతో ఫిలిం ఫెస్టివల్ ప్రదర్శనకు ఆదిపురుష్ మేకర్స్ పచ్చజెండా ఊపేశారు.
రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ‘తన్హాజీ’ ఫేం ఓంరౌత్ దర్శకత్వం వహించాడు. ప్రభాస్‌కు జోడీగా కృతిసనన్ నటించింది. సైఫ్ అలీఖాన్ లంకాధిపతి రావణాసురుడుగా కనిపించనున్నాడు. టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను నిర్మించాయి. ఇక ఈ సినిమాను జూన్ 16న పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.