గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆనవాయితీ ప్రకారం 2026 సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులను ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ఈసారి సినీరంగం నుంచి ఆరుగురిని పద్మ పురస్కారాలు వరించాయి. బాలీవుడ్ నటుడు ధర్మేంద్రను మరణానంతరం దేశంలోనే ద్వితీయ అత్యుత్తమ పురస్కారమైన ‘పద్మవిభూషణ్’తో భారత ప్రభుత్వం గౌరవించింది. అలాగే మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి, గాయని అల్కా యాగ్నిక్ ‘పద్మభూషణ్’ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఇక తెలుగు నుంచి సీనియర్ నటులైన మాగంటి మురళీమోహన్, నటకిరీటి రాజేందప్రసాద్ ‘పద్మశ్రీ’ పురస్కారాలకు ఎంపికయ్యారు.
వెండితెర హీమ్యాన్ ధర్మేంద్ర
బాలీవుడ్లో తొలితరం యాక్షన్ హీరోగా ప్రసిద్ధికెక్కిన ధర్మేంద్రకు మరణానంతరం పద్మవిభూషణ్ పురస్కారం వరించింది. గత ఏడాది నవంబర్ 24న ధర్మేంద్ర కన్నుమూశారు. ధర్మేంద్ర అసలు పేరు కెవల్ క్రిషన్ డియోల్. 1935 డిసెంబర్ 8న పంజాబ్ లూథియానా జిల్లాలోని సస్రలీలో జన్మించారు. మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన అనంతరం సినిమాల్లో అవకాశాల్ని వెతుక్కుంటూ 1960లో ముంబయిలో అడుగుపెట్టారు. ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరే’ సినిమాతో బాలీవుడ్‌లోకి అరంగ్రేటం చేశారు. 60వ దశకంలో సూరత్ ఔర్ సీరత్, బందినీ, దుల్హన్ ఏక్ రాత్‌కీ, ఆయే మిలన్ కి బేలా, కాజల్, పూర్ణిమా వంటి చిత్రాలతో రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ‘పూల్ ఔర్ పత్తర్’ ‘మేరా గావ్ మేరా దేశ్’ సినిమాలతో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. వెండితెరపై డాషింగ్ పాత్రల ద్వారా రాబిన్‌హుడ్ అనే ఇమేజ్ను సంపాదించుకున్నారు. ‘షోలే’ సినిమాతో భారతీయ సినీ చరిత్రలో సంచలనం సృష్టించారు. ఆయన కెరీర్లో ‘షోలే’ చిత్రం ఓ మైలురాయిగా నిలిచింది. 1980లో హేమమాలినీని వివాహం చేసుకున్నారు ధర్మేంద్ర. బాలీవుడ్లో ఈ జంట హిట్ పెయిర్‌గా నిలిచింది. ధర్మేంద్రకు ఆరుగురు సంతానం, వారిలో సన్నీడియోల్, బాబీ డియోల్, ఇషా డియోల్, అహ్నా డియోల్ సినీరంగంలో రాణిస్తున్నారు. దాదాపు 300పై చిలుకు చిత్రాల్లో అసమాన అభినయంతో భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేశారు ధర్మేంద్ర.
విలక్షణ నటనకు చిరునామా
మలయాళ చిత్రపరిశ్రమ స్థాయిని పెంచిన మహానటుడు మమ్ముట్టి. ఆయన అసలు పేరు మహమ్మద్ కుట్టి ఇస్మాయిల్ పనపరంబిల్. 1971లో ప్రేమ్‌నజీర్ హీరోగా నటించిన ‘అనుభవంగళ్ పాలిచకల్’ చిత్రంలో జూనియర్ ఆర్టిస్టుగా నట ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆయనకు నటుడిగా గుర్తింపును తెచ్చిన సినిమా 1980లో వచ్చిన ‘విక్కనందు స్వప్నంగళ్’. ఆ తర్వాత వచ్చిన త్రిష్న(1981), అథిరతరమ్(1984), నిరక్కొట్టు(1985), యాత్ర(1985) చిత్రాలు ఆయన్ని మలయాళ సూపర్‌స్టార్‌గా నిలబెట్టాయి. ఆ తర్వాత కాలంలో జాతి గర్వించదగ్గ ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించి నటుడిగా తనకు తానే సాటి అనిపించుకున్నారు. మలయాళంలో ఆయన నటించిన ‘సామ్రాజ్యం’(1990) సినిమా తెలుగులో అదే పేరుతో అనువాదమై అఖండ విజయాన్ని అందుకుంది.
మమ్ముట్టిని ‘స్వాతికిరణం’ సినిమాతో తెలుగుతెరకు పరిచయం చేశారు కె.విశ్వనాథ్. తొలిసారిగా తెలుగులో నటిస్తూ.. తెలుగు నేర్చుకొని మరీ సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు మమ్ముట్టి. భాషకు ఆయనిచ్చిన గౌరవం అది. ‘స్వాతికిరణం’లో అనంతరామశర్మగా ఆయన అభినయం నిజంగా చిరస్మరణీయం. ఆ తర్వాత తెలుగులో ఆయన రైల్వే కూలీ, యాత్ర, ఏజెంట్ చిత్రాలో ్ల నటించారు. తన కెరీర్లో దాదాపు 600పై చిలుకు చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. తెలుగుతోపాటు, తమిళం, హిందీ, కన్నడ చిత్రాల్లోనూ నటించి జాతీయ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మూడు పర్యాయాలు జాతీయ ఉత్తమనటుడిగా కూడా ఎంపికయ్యారు. అలాంటి మహానటుడి కీర్తికిరీటంలో ఈ రోజు ‘పద్మభూషణ్’ కూడా చేరడం ఆనందించదగ్గ విషయం.
అజాతశత్రువు మురళీమోహన్
కుటుంబ కథాచిత్రాల కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేసిన వ్యక్తి మాగంటి మురళీమోహన్. ఆయన తొలి సినిమా ‘జగమే మాయ’ (1973). మురళీమోహన్ కెరీర్లో మేలి మలుపు అంటే ఎన్టీఆర్ ‘అన్నదమ్ముల అనుబంధం’(1975) సినిమానే. ఆ సినిమాలో ఎన్టీఆర్ తమ్ముడిగా నటించారాయన. కెరీర్ తొలినాళ్లలో దర్శకరత్న దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావులు ఆయన్ని బాగా ప్రోత్సాహించారు. ముఖ్యంగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన జ్యోతి, కల్పన చిత్రాలు మురళీమోహన్‌ని అగ్రకథానాయకుడిగా నిలబెట్టాయి.
తొలిరేయి గడిచింది, ప్రేమలేఖలు, దేవతలారా దీవించండి, పొట్టేలు పున్నమ్మ, మనవూరి పాండవులు, కల్యాణి, కోరికలే గుర్రాలైతే.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన కెరీర్లో గొప్ప సినిమాలున్నాయి. నిర్మాతగా జయభేరి సంస్థను స్థాపించి ఆయన నిర్మించిన ఓ తండ్రితీర్పు, చల్లని రామయ్య చక్కని సీతమ్మ, శ్రావణమేఘాలు, పెళ్లాం చెబితే వినాలి చిత్రాలు అటు నిర్మాతగా, ఇటు నటుడిగా కూడా మురళీమోహన్కి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ‘ఓతండ్రి తీర్పు’(1985)సినిమాతో ఉత్తమ నటుడిగా నంది అవార్డును అందుకున్నారు. నాగార్జున ‘నిర్ణయం’, మహేష్ ‘అతడు’ చిత్రాలు నిర్మాతగా మురళీమోహన్ స్థాయిని పెంచాయి. ఇండస్ట్రీలో అజాతశత్రువుగా ఆయనకు పేరుంది.
హాస్యేంద్రుడికి సముచిత గౌరవం
కమర్షియల్ సినిమాలు రాజ్యమేలుతున్న రోజుల్లో, మాస్ హీరోలే మకుటంలేని మహారాజులు అనుకుంటున్నవేళ.. జంధ్యాల, వంశీ, రేలంగి నరసింహారావు లాంటి ఉద్ధండ దర్శకులు ‘కామెడీ సినిమా’ అనే ఓ కొత్త జానర్‌ని సృష్టిస్తే.. ఆ జానర్ సినిమాలకు సూపర్‌స్టార్‌గా అవతరించారు నటకిరీటి డా.రాజేందప్రసాద్. కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1956లో జన్మించిన రాజేంద్రప్రసాద్.. మహానటుడు నందమూరి తారకరామారావుని ఆదర్శంగా తీసుకొని నటుడు కావాలనే లక్ష్యంతో 70ల్లోనే మద్రాసు చేరుకున్నారు. ఆడయార్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో విద్యార్థిగా నటనలో పట్టా తీసుకున్నారు. బాపు ‘స్నేహం’ నటుడిగా రాజేంద్రప్రసాద్ తొలి సినిమా. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ, కెరీర్ తొలినాళ్లలో డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా రాజేంద్రప్రసాద్ కొనసాగారు. కొన్ని సినిమాల్లో విలన్‌గా కూడా నటించారు.
వంశీ ‘ప్రేమించు పెళ్లాడు’తో హీరోగా మారిన రాజేంద్రప్రసాద్ ఆయన దర్శకత్వంలోనే లేడీస్ టైలర్, చెట్టుకింద ప్లీడర్, ఏప్రిల్ ఒకటి విడుదల వంటి మరపురాని చిత్రాల్లో నటించి హాస్యానికే చిరునామాగా నిలిచారు. అలాగే బాపు దర్శకత్వంలో వచ్చిన పెళ్లిపుస్తకం, మిస్టర్ పెళ్లాం వంటి క్లాసిక్స్‌లో హీరోగా నటించి తెలుగువారి ఇష్టుడైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముత్యాలసుబ్బయ్య దర్శకత్వం వహించిన ‘ఎర్రమందారం’, చంద్రసిద్దార్థ దర్శకత్వంలో వచ్చిన ‘ఆ నలుగురు’ చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా నంది అవార్డులను కూడా అందుకున్నారు. జంధ్యాల, రాజేంద్రప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన అహనా పెళ్లంట, వివాహ భోజనంబు, రెండు రెళ్లు ఆరు చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తూవున్నాయి. తమిళంతోపాటు ‘క్విక్ గన్ మురుగన్’ అనే ఆంగ్ల చిత్రంలో కూడా నటించారాయన. భారత మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు అంతటి వ్యక్తి ‘నా ఒత్తిడికి మందు రాజేంద్రప్రసాద్ సినిమాలే’ అన్నారంటే నటుడిగా ఆయనేంటో అర్థం చేసుకోవచ్చు.
బహుభాషా నటుడు మాధవన్
ఆర్.మాధవన్ దక్షిణాదితో పాటు హిందీ చిత్రసీమలో కూడా ప్రతిభావంతుడైన నటుడిగా గుర్తింపును తెచ్చుకున్నారు. దాదాపు 7 భారతీయ భాషల్లో సత్తా చాటారు. మాధవన్ అసలు పేరు రంగనాథన్ మాధవన్. 1970 జూన్ 1న బీహార్‌లోని జంషెడ్‌పూర్‌లో తమిళ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి రంగనాథన్ వృత్తిరీత్యా జంషెడ్పూర్ టాటా స్టీల్‌లో పనిచేశారు. దాంతో మాధవన్ బాల్యమంతా అక్కడే గడిచింది. 1990 దశకంలో బనేగీ అప్నీ బాత్, సాయా, ఘర్ జమై వంటి సీరియల్స్‌లో నటిస్తూ పేరు తెచ్చుకున్నారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం ‘అలై పాయుతే’ (తెలుగులో ‘సఖి’) చిత్రం మాధవన్ సినీ కెరీర్‌కు బ్రేక్‌నిచ్చింది. అనంతరం మణిరత్నం దర్శకత్వంలో నటించిన మరో చిత్రం ‘కన్నాత్తి ముతమిట్టల్’ (తెలుగులో ‘అమృత’) మాధవన్‌కు మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. తమిళంలో మిన్నాలే, రన్, అన్బేశివం వంటి చిత్రాలతో సత్తా చాటారు. తమిళంలో నటిస్తూనే మరోవైపు హిందీ సినీరంగంలో రంగ్ దే బసంతీ, త్రీ ఇడియట్స్ వంటి చిత్రాల్లో కీలక పాత్రల ద్వారా గుర్తింపు పొందారు. రొమాంటిక్ కామెడీ సిరీస్ ‘తను వెడ్స్ మను’ సిరీస్ చిత్రాలు బాలీవుడ్లో మాధవన్ స్థానాన్ని సుస్థిరం చేశాయి. ఆయన నటించీ, దర్శ కత్వం వహించిన ‘రాకెట్రీ’ చిత్రం జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైన విషయం తెలిసిందే.
మెలోడీ క్వీన్ అల్కా యాగ్నిక్
అల్కా యాగ్నిక్ బాలీవుడ్లో ప్రసిద్ధ గాయనిగా పేరు పొందారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కేరీర్లో ఎన్నో జనరంజక గీతాలతో ఆమె సంగీత ప్రియుల్ని మెప్పించారు. అల్కా యాగ్నిక్ 20 మార్చి 1966 కలకత్తాలో జన్మించారు. తల్లి శుభా యాగ్నిక్ కూడా శాస్త్రీయ సంగీత గాయని. సుదీర్ఘ కేరీర్లో 20 వేలకు పైగా పాటలతో మెలోడీ క్వీన్‌గా పేరు తెచ్చుకున్నారు అల్కా యాగ్నిక్. హిందీతో పాటు తెలుగు, బెంగాలీ, మరాఠీ, తమిళ భాషల్లోనూ ఆమె పాటలు పాడారు. ఆమె పాడిన ఏక్ దో తీన్ (తేజాబ్), తాళ్ సే తాళ్ మిలా(తాళ్), దిల్ నే యే కహా హై దిల్ సే (ధడ్కన్), టిప్ టిప్ బర్సా పానీ (మొహ్రా) వంటి గీతాలు పాపులర్ అయ్యాయి. నాలుగు దశాబ్దాల కేరీర్లో ఆమె ఏడు ఫిలిం ఫేర్ అవార్డులు మరియు రెండు జాతీయ చలన చిత్ర అవార్డులను గెలుచు కున్నారు.