Elli AvrRam | ఎల్లీ అవ్రామ్.. యాభై కేజీల స్విస్ చాక్లెట్. డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించి.. బిగ్‌బాస్‌తో వచ్చిన ప్రాచుర్యంతో బిగ్‌స్క్రీన్ మీద మెరిసిపోయి.. ‘గుడ్ బై’లో ఏకంగా బిగ్-బితో కలిసి నటించింది. ఫిట్నెస్, సినిమా, జీవితం.. ఇలా అనేక విషయాల మీద తన అభిప్రాయం పంచుకుంది.
నాప్రయాణంలో ఎన్నో మలుపులు. స్వీడిష్ డ్యాన్స్ డ్రామా నుంచి బాలీవుడ్ వరకూ అనేక మజిలీలు. స్వీడన్‌లోని ‘పర్దేశీ డ్యాన్స్ గ్రూప్’లో కాలేజీ రోజుల నుంచీ నేను సభ్యురాలిని. ఇండో-స్వీడిష్ సినిమాలు చాలానే చేశాను. అప్పుడే , బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. ‘మిక్కీ వైరస్’ నా మొదటి చిత్రం. అప్పటినుంచి ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూనే ఉన్నాను. బిగ్‌బాస్ రియాలిటీ షోలో కనిపించడంతో జనానికి మరింత దగ్గరయ్యాను.
‘గుడ్ బై’ సినిమాలో అమితాబ్ బచ్చన్ సర్‌తో నటించడం ఓ గొప్ప అనుభవం. నటిగా నా జన్మ ధన్యమైనట్టే అనిపించింది. షూటింగ్ జరిగినన్ని రోజులూ.. కాలేజీకి వెళ్లి పాఠాలు నేర్చుకున్న అనుభూతి కలిగేది. నెట్‌ఫ్లిక్స్‌లో ఆ సినిమా చూసి స్వీడన్ నుంచి అమ్మానాన్న ఫోన్ చేశారు. ‘నిన్ను కన్నందుకు గర్వంగా ఉంది’ అంటూ ఆనందబాష్పాలు రాల్చారు. కన్నవారి ప్రశంసలు ఆస్కార్ కంటే గొప్ప అవార్డులు.
నా సౌందర్య రహస్యమా? అలాంటిదేం లేదు. నేను మితాహారిని. అల్పాహారిని. అలా అని ఎప్పుడూ నోరు కట్టేసుకుని ఉంటానని అనుకోవద్దు. తినాలనిపిస్తే పిజ్జా ఆర్డర్ చేస్తాను. ఫ్రెంచ్ ఫ్రైస్ నమిలేస్తాను. చాక్లెట్ కనిపిస్తే చాలు.. కొరకబుద్ధేస్తుంది. అది నా వీక్నెస్. మిగతా సమయాల్లో మాత్రం కచ్చితంగా ఉంటాను కాబట్టి, అప్పుడప్పుడూ చిరుతిళ్లు ఓకే.
తమిళ స్టార్ ధనుష్‌తో ‘నేనే వస్తున్నా’ చేస్తున్నప్పుడు సెట్స్‌లో మహా సందడిగా ఉండేది. ఒకట్రెండు తమిళ మాటలు కూడా నేర్చుకున్నా. రోజూ అరిటాకుల్లో సహపంక్తి భోజనం చేసేవాళ్లం. కారంగా ఉన్నా.. మమకారంతో కొసరికొసరి వడ్డిస్తుంటే కాదనలేక పోయేదాన్ని. కొన్నిసార్లు ఆ ఘాటుకు కళ్లలో నీళ్లు తిరిగేవి.
పరిశ్రమలో రకరకాల వ్యక్తులు తారసపడుతుంటారు. వెకిలి నవ్వులు నవ్వేవాళ్లు. ఏదో ఓ రూపంలో వేధించేవాళ్లు. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసేవారు, దొంగదెబ్బ తీయాలని ప్రయత్నించేవారు.. ఎవర్నీ లెక్కచేయకూడదు. మన మీద మనకు నమ్మకం లేకపోతే.. నిర్మాతకు నమ్మకం ఎలా కలిగిస్తాం? ‘నెవర్ గివప్..’ నా నినాదం. నటులుగా మనం శరీరాన్నే కాదు, మనసునూ ఫిట్‌గా పెట్టుకోవాలి. భారత్ వచ్చాక ధ్యానం మీద దృష్టి పెట్టాను. ఆ సాధన మంచి ఫలితాన్నిచ్చింది.
స్వీడన్ నుంచి ఇంతదూరం వచ్చింది.. గ్లామర్ డాల్‌లా ఓ వెలుగు వెలిగి వెళ్లిపోవడానికి కాదు. మంచినటిగా పేరు తెచ్చుకోవాలి. పరిశ్రమ మీద మనదైన ముద్ర వేయాలి. పదికాలాలూ గుర్తుంచుకునే సినిమాల్లో చేయాలి. ఇదే నా లక్ష్యం. ఇంతకుమించిన పెద్దపెద్ద కోరికలేం లేవు.
Elli AvrRam మరిన్ని ఫొటోల కోసం: Elli AvrRam | సరికొత్త పోజులతో మురిపిస్తున్న ఎల్లీ అవ్రామ్..