Tollywood | ఇక్కడ సిత్తరాల సిరపడు.. అక్కడ విచిత్రంగా ఆడలేదు! మన అతడు.. వారిని మెప్పించలేకపోయాడు!! తెలుగింటి ఒక్కడు.. బాలీవుడ్లో పరాజయం చెందాడు!! ఇలా చెబుతూ పోతే టాలీవుడ్లో కోట్లు కొల్లగొట్టిన సినిమాలు.. బాలీవుడ్లో బొక్కాబోర్లా పడ్డాయి. భారీ అంచనాల మధ్య విడుదలై ఉసూరుమన్నాయి. తెలుగునాట ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన పలు చిత్రాలు బాలీవుడ్‌ను ఆకట్టుకోలేకపోయాయి. కారణాలు ఏమైనా.. కాసులు మాత్రం కురిపించలేకపోయాయి.
త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ‘అల వైకుంఠపురములో..’ సినిమా తెలుగులో రికార్డు కలెక్షన్లు సాధించింది. మూడేండ్ల కిందట సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రం సూపర్ హిట్టయ్యింది. అదే సినిమాను ‘షెహజాదా’ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. రోహిత్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కార్తిక్ ఆర్యన్, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 17న విడుదలై బాక్సాఫీస్ ముందుకొచ్చిన ‘షెహజాదా’ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కలెక్షన్ల పరంగా బడ్జెట్‌ను అందుకున్నా.. విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణ మాత్రం చూరగొనలేక పోయింది.
ఒక్క షెహజాదా విషయంలోనే కాదు.. తెలుగింట నెగ్గి, బాలీవుడ్లో తగ్గిన సినిమాలు చాలా ఉన్నాయి. ఈ వైఫల్యాల పరంపర ఎప్పట్నుంచో ఉన్నదే! తెలుగులో ట్రెండ్ సెట్ చేసిన ఎన్నో సినిమాల రీమేక్ వెర్షన్లు ఫ్లాప్‌లను మూటగట్టుకున్నాయి. తెలుగులో చరిత్ర సృష్టించిన ‘శంకరాభరణం’ సినిమాను హిందీలో ‘సుర్ సంగమ్’ పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రానికీ విశ్వనాథే దర్శకుడు. మనదగ్గర చిత్రరాజంగా నిలిచిపోయిన శంకరాభరణం.. హిందీలో మాత్రం ఫ్లాప్ అయింది. బాపూ, ఏయన్నార్ కాంబినేషన్లో వచ్చిన ‘బుద్ధిమంతుడు’ కూడా హిందీలో ‘పరమాత్మ’ పేరుతో విడుదలై పరాజయం పాలైంది.
హిందీ రీమేక్ చిత్రం దర్శకుడు కూడా బాపూనే! తెలుగులో 1951లో విడుదలైన ‘పాతాళభైరవి’ సినిమా ఆపాత అద్భుతం. ఇది రిలీజైన 34 ఏండ్లకు హిందీలో అదేపేరుతో రీమేక్ చేశారు. అక్కడ మాత్రం నిర్మాత చేతి చమురు వదిలించింది. జితేంద్ర హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రొడ్యూసర్ హీరో కృష్ణ! ఇలా ఇంట గెలిచి రచ్చ ఓడిన సినిమాలు కోకొల్లలు. విజయవంతమైన సినిమాలూ ఎన్నో ఉన్నాయి. కానీ, ఇటీవల కాలంలో పరాజయాల శాతం భారీగా పెరిగింది.
మహేశ్‌బాబు కెరీర్లో మొదటి బ్లాక్‌బస్టర్ హిట్ ‘ఒక్కడు’. ప్రిన్స్ ఇమేజ్ను ఒక్కరోజులోనే మార్చేసిన సినిమా ఇది. 2003లో విడుదలైన ‘ఒక్కడు’ రికార్డు విజయం సాధించింది. ఇది విడుదలయ్యాక 12 ఏండ్ల తర్వాత హిందీలో ‘తేవర్’గా తెరకెక్కింది. అర్జున్ కపూర్, సోనాక్షి సిన్హా హీరో హీరోయిన్లుగా వచ్చి భారీ పరాజయం చవిచూసింది. మహేశ్‌బాబు కెరీర్లో మరో మరపురాని సినిమా ‘అతడు’. త్రివిక్రమ్, మహేశ్ కాంబోలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. దీని రీమేక్ వెర్షన్‌గా హిందీలో విడుదలైన ‘ఏక్- ద పవర్ వన్’ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. బాబీ దేవుల్, నానా పటేకర్, జాకీష్రాఫ్ ఇలా భారీ తారాగణం సమకూరినా కలెక్షన్లు వసూలు చేయలేకపోయింది.
హీరో రానా తొలిచిత్రం ‘లీడర్’.. ఓ మోస్తరుగా ఆడింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో పొలిటికల్ డ్రామా కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ఎప్పుడు టీవీలో వచ్చినా మంచి టీఆర్పీ రేటింగ్స్ సాధిస్తుంటుంది. ఇదే చిత్రం హిందీలో ‘యంగిస్థాన్’ పేరుతో రీమేక్ అయింది. అయితే, తెలుగుతో పోలిస్తే భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. తెలుగులో సిద్ధార్థ్‌కు బ్రేక్ ఇచ్చిన సినిమా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా!’ కథానాయిక త్రిషను స్టార్ హీరోయిన్గా నిలబెట్టింది. ఇదే సినిమా హిందీలో ‘రామయ్యా వస్తావయ్యా’ పేరుతో రీమేక్ అయింది. గిరీశ్‌కుమార్, శృతిహాసన్ జంటగా వచ్చిన ఈ ఫిల్మ్ బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. లారెన్స్ ‘కాంచన’ తెలుగులో ఓ సంచలనమైతే.. హిందీలో ‘లక్ష్మి’గా యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. విశ్వక్సేన్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘హిట్ 1’ తెలుగులో సంచలన విజయం అందుకుంది.
ఈ సినిమా అదే పేరుతో హిందీలో రీమేక్ అయింది. రాజ్‌కుమార్ రావ్ హీరోగా నటించిన ఈ సినిమా గొప్పగా ఆడలేదు. రొమాంటిక్ యాక్షన్ మూవీ ‘ఆర్ఎక్స్ 100’ ఇక్కడ రికార్డులు సృష్టిస్తే.. హిందీలో ‘ర్యాపిడ్’గా వచ్చి బిలో యావరేజ్‌గా మిగిలిపోయింది. శ్రీ విష్ణు హీరోగా వచ్చిన ‘బ్రోచేవారెవరురా’ టాలీవుడ్లో సంచలన విజయం సొంతం చేసుకుంటే ‘వెల్లె’ అట్టర్‌ఫ్లాప్ అయింది. టాలీవుడ్ ఖాతాలో భారీ విజయాలు బాలీవుడ్‌కు చేరే సరికి ప్రేక్షకులను మెప్పించలేక బాక్సాఫీస్ ముందు చతికిలపడ్డాయి.