OTT | ఓటీటీ అంటేనే నో రిస్ట్రిక్షన్.. నో సెన్సార్.. థియేటర్లో చూపించలేని ఎన్నో దారుణాలు ఓటీటీలో చూపిస్తున్నారు దర్శక నిర్మాతలు. అక్కడ అడిగేవాడు లేడు కాబట్టి ఇష్టమొచ్చినట్టు తీస్తున్నారనే విమర్శలు ఇప్పటికే మొదలయ్యాయి. దానికి తోడు బూతుల విషయంలో కూడా కంట్రోల్ చేయాలని.. కచ్చితంగా ఓటీటీకి కూడా సెన్సార్ ఉండాల్సిందే అనే డిమాండ్స్ ఎక్కువైపోతున్నాయి. దానికి కారణాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య వచ్చిన కొన్ని వెబ్ సిరీస్‌ల్లో శృతిమించిన శృంగారంతో పాటు.. మితిమీరిన బూతు డైలాగులు చిన్న పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయని విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఓటీటీకి సెన్సార్ పెడితే ఆ వ్యవస్థ మొత్తం చచ్చిపోతుంది అంటూ మనోజ్ బాజ్‌పేయి వంటి సీనియర్ నటులు కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే ఈ డిజిటల్ ఎంట్రీ కారణంగా మన హీరోహీరోయిన్ల ఇమేజ్ గంగలో కలుస్తుంది. కేవలం డబ్బు కారణంగా ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంటున్నారు. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన జి కర్దా వెబ్ సిరీస్‌లో తమన్నాను చూసిన తర్వాత ఆమె డై హార్డ్ ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. ఇందులో మితిమీరిన బూతులతో పాటు బోల్డ్ సీన్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇప్పటివరకు ఎంత గ్లామర్ షో చేసినా కూడా హద్దుల్లోనే ఉన్న తమన్నా.. ఓటీటీ పేరు చెప్పి ఉన్న హద్దులు కూడా చెరిపేసింది.
మొన్న రానా నాయుడు కారణంగా వెంకటేశ్ కూడా ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్నాడు. 35 సంవత్సరాలుగా ఈయనకు ఉన్న మంచి ఇమేజ్ను రానా నాయుడు దారుణంగా దెబ్బతీసింది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులైతే అందులో వెంకటేశ్‌ను చూసి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. డబ్బుల కోసం మరీ ఇంత దిగజారి పోవాలా అంటూ వెంకీని ఓ రౌండ్ వేసుకున్నారు. అలాగే ఫ్యామిలీమెన్ సిరీస్‌లో సమంత కూడా కొన్నిచోట్ల హద్దులు మీరి నటించిందనే విమర్శలు వచ్చాయి. వీళ్లందరూ సినిమాల్లో ఉన్నప్పుడు చాలా పద్ధతిగా కనిపిస్తారు.. కానీ డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం ఎలాంటి హద్దులు లేకుండా రెచ్చిపోతున్నారు.
కేవలం డబ్బుల కోసం తమ పరువు మొత్తం పోగొట్టుకుంటున్నారు అని అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు. కానీ వాళ్ల ఫీలింగ్స్ వీళ్లు అసలు పట్టించుకోవడం లేదు అనేది మరో వాదన. ట్రెండ్‌కు తగ్గట్టు మేం చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ.. దీనివల్ల ఎన్నో సంవత్సరాలు కష్టపడి తెచ్చుకున్న ఇమేజ్ పోతుంది అనే ధ్యాస వాళ్లలో కనిపించడం లేదు. మరి రాబోయే రోజుల్లో ఈ మార్పు ఇంకెంత భయంకరంగా ఉంటుందో చూడాలి.
Upasana | నేను ప్రెగ్నెంట్ అని తెలియగానే చరణ్ అలా స్పందించాడు : ఉపాసన